వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలను పరామర్శించిన వైఎస్ జగన్.. అండగా ఉంటామని హామీ..
Jagan Visits Vizag Steel Plant Victims' Families, Assures Support
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విశాఖపట్నంలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన స్టీల్‌ప్లాంట్ కార్మికుల ప్రస్తుత దయనీయ స్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. లిక్విడ్ మెటల్ బ్లాస్ట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి 95 శాతం కాలిన గాయాలతో అత్యంత విషమంగా ఉందని పేర్కొన్నారు. గత పద్నాలుగు నెలల క్రితం జరిగిన ఇటువంటి ప్రమాదంలో మరణించిన పెంటయ్య అనే కార్మికుడి కుటుంబానికి ఇప్పటివరకు ఎలాంటి పరిహారంగానీ, ఉద్యోగంగానీ ఇవ్వలేదని, అడిగితే ఫైల్ పోయిందనే నిర్లక్ష్యపు సమాధానాలు చెపుతున్నారని మండిపడ్డారు.
తమ ప్రభుత్వ హయాంలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు ప్రధానమంత్రికి లేఖలు రాసి గట్టిగా పోరాడామని జగన్ గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్లాంట్ లో 28 వేల మంది ఉద్యోగులు ఉండగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం రెండేళ్ల కాలంలోనే ఉద్యోగుల సంఖ్యను 16 వేలకు తగ్గించిందని ఆరోపించారు. ఇందులో 10,500 మంది రెగ్యులర్ ఉద్యోగులను, 6,500 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడమే కాకుండా, మరో 1,800 మందిపై వీఆర్ఎస్ కోసం ఒత్తిడి తెచ్చారని విమర్శించారు.
ప్రస్తుతం కార్మికులకు నాలుగు నెలల జీతాల బకాయిలు ఉన్నాయని, క్వార్టర్స్‌లో విద్యుత్ ఛార్జీలను యూనిట్‌కు 50 పైసల నుండి రూ.8.50లకు పెంచి వారిని బలవంతంగా బయటకు పంపుతున్నారని ధ్వజమెత్తారు. బోనస్‌లు, వైద్య సదుపాయాలు పూర్తిగా నిలిపివేసి, యాజమాన్యం ప్రకటించిన ప్యాకేజీ అంతా ప్లాంట్ నిర్వహణ కోసం కాకుండా కార్మికులను సాగనంపడానికేనని స్పష్టం చేశారు.
ప్రమాద బాధితులకు పరిహారం అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్ అనుసరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.1.72 కోట్లు అందుతాయని ప్రభుత్వం చెబుతున్న మాటలను ప్రస్తావిస్తూ, అది కేవలం ఉద్యోగుల హక్కుగా వచ్చే పిఎఫ్, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్, పీఎం రిలీఫ్ ఫండ్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఇస్తున్నది ఒక్క రూపాయి కూడా లేదని, బాధితులకు ప్రభుత్వం తరఫున ఇచ్చేది ఏంటో చెప్పకుండా మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.