Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. సూపర్ సిక్స్ నుంచి సంక్షేమ పథకాల వరకు.. ఏపీ ప్రభుత్వ కార్యక్రమాల విశ్లేషణ

Prajapaksham 24 Jul 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. సూపర్ సిక్స్ నుంచి సంక్షేమ పథకాల వరకు.. ఏపీ ప్రభుత్వ కార్యక్రమాల విశ్లేషణ

Andhra Pradesh Govt ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్, ఇతర సంక్షేమ పథకాలు సమాజంలోని అట్టడుగు వర్గాలకు సాంఘిక భద్రతను, ఆర్థిక సాధికారతను కల్పిస్తూ సమ్మిళిత వృద్ధికి దోహదపడుతున్నాయి. ఈ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు:

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం : సమాజంలో అత్యంత వెనుకబడిన, ఆసరా అవసరమైన వర్గాలకు సామాజిక రక్షణ కవచంగా ఈ పథకం నిలుస్తోంది.

    ప్రారంభం: 2024, జూలై 1న గుంటూరు జిల్లా పెనుమాకలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
    లబ్ధిదారులు & పింఛను వివరాలు: వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, చర్మకారులు, ట్రాన్స్‌జెండర్లు , కళాకారులకు నెలకు రూ. 4,000 లభిస్తుంది.
    దివ్యాంగులకు నెలకు రూ. 6,000 పింఛను అందజేస్తారు.
    మూత్రపిండ (కిడ్నీ) వ్యాధిగ్రస్తులకు వారి తీవ్రతను బట్టి నెలకు రూ. 10 వేల నుండి రూ. 15 వేల వరకు సహాయం అందుతుంది.

    దీపం పథకం 2.0 : పేద మహిళలకు వంటగ్యాస్ సదుపాయం కల్పించి ఇంధన భద్రత అందించడమే ఈ పథకం లక్ష్యం.

      నేపథ్యం: 1999 జులైలో ఉమ్మడి ఏపీలో డ్వాక్రా మహిళల కోసం తొలిసారి ప్రారంభించారు.
      దీపం 2.0 ప్రారంభం: ‘సూపర్ సిక్స్’ హామీల్లో భాగంగా తొలి పథకంగా 2024, అక్టోబరు 31న శ్రీకాకుళం జిల్లా ఏడుపురంలో సీఎం ప్రారంభించారు.
      ప్రయోజనాలు: అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఏటా 3 ఎల్‌పీజీ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తారు. గ్యాస్ సబ్సిడీ మొత్తం 48 గంటల్లోగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
      లబ్ధి: రాష్ట్రంలోని సుమారు 1.5 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోంది.

      తల్లికి వందనం: పాఠశాలల్లో డ్రాప్‌అవుట్లను తగ్గించి, అక్షరాస్యతను పెంచేందుకు , బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు.

        ప్రారంభం: 2025, జూన్ 12న విజయవాడలో సీఎం ప్రారంభించారు (2025-26 విద్యా సంవత్సరం నుండి అమలు).
        అర్హత & విధివిధానాలు:1 నుండి 12వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు ఆర్థిక సహాయం అందిస్తారు. విద్యాసంవత్సరంలో విద్యార్థికి కనీసం 75% పాఠశాల హాజరు తప్పనిసరి.
        నగదు జమ విధానం: ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ. 13 వేలు జమ అవుతాయి (టాయిలెట్ల నిర్వహణకు రూ. 1,000, వాచ్‌మెన్ గౌరవ వేతనానికి రూ. 1,000 మినహాయిస్తారు).
        లబ్ధి: సుమారు 67 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతోంది.

        అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ : రైతులకు, కౌలుదారులకు వ్యవసాయ పెట్టుబడి భారాన్ని తగ్గించేందుకు ఆర్థిక సహాయం అందించే పథకం.

          ప్రారంభం: 2025, ఆగస్టు 2న ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెం వద్ద సీఎం ప్రారంభించారు.
          ఆర్ధిక సాయం:ప్రతి రైతు , భూమి లేని కౌలుదారు కుటుంబానికి ఏటా రూ. 20 వేలు పెట్టుబడి సహాయం లభిస్తుంది.
          రాష్ట్ర ప్రభుత్వం వాటా: రూ. 14 వేలు
          కేంద్ర ప్రభుత్వం (పీఎం కిసాన్) వాటా: రూ. 6,000

          విడతల వివరాలు: వార్షిక మొత్తాన్ని మూడు విడతలలో (మొదటి విడత రూ. 7,000, రెండో విడత రూ. 7,000, మూడో విడత రూ. 6,000) జమ చేస్తారు. మొదటి విడతగా 46,85,838 మంది రైతుల ఖాతాల్లో నగదు జమ అయింది.

          స్త్రీ శక్తి పథకం : మహిళల ఆర్థిక స్వేచ్ఛ , రవాణా సౌలభ్యం కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం.

            ప్రారంభం: 2025, ఆగస్టు 15న విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్‌లో సీఎం ప్రారంభించారు.
            నిబంధనలు: ఏపీ నివాసితులైన మహిళలు, బాలికలు , ట్రాన్స్‌జెండర్లకు ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తారు. ఏపీ నివాస గుర్తింపు కార్డు చూపిస్తే జీరో ఫేర్ టికెట్ ఇస్తారు.
            వర్తించే బస్సులు: పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ వంటి 5 రకాల సేవలలోని సుమారు 8,458 బస్సుల్లో ఈ వెసులుబాటు ఉంది.
            లబ్ధి: సుమారు 2.62 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుండగా, 2026 జనవరి 28 నాటికి 40 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయి.

            అన్న క్యాంటీన్లు 2.0 : పేదరిక నిర్మూలన , ఆహార భద్రతే ధ్యేయంగా తక్కువ ధరకే నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారు.

              నేపథ్యం: 2016 మార్చిలో అమరావతిలోని వెలగపూడిలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమై.. 2018 జులై 11న పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది.
              అన్న క్యాంటీన్లు 2.0 ప్రారంభం: 2024, ఆగస్టు 15న గుడివాడలో సీఎం పునఃప్రారంభించారు.
              వివరాలు: ఉదయం టిఫిన్, మధ్యాహ్నం , రాత్రి భోజనాన్ని కేవలం రూ. 5 చొప్పున అందిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు , పట్టణాలలో 205 అన్న క్యాంటీన్లు అందుబాటులో ఉన్నాయి.