Andhra Pradesh Rain Alert: ఏపీకి రెడ్ అలర్ట్.. దూసుకొస్తున్న వాయుగుండం.. రేపు రాత్రి విశాఖ–గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం..
Four Storms Churning at Once
Andhra Pradesh Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ వాయుగుండం రానున్న 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండం (Deep Depression)గా మారే అవకాశం ఉంది. అనంతరం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ సెప్టెంబర్ 23 రాత్రి నుంచి 24 తెల్లవారుజాము మధ్య ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాల మధ్య, ముఖ్యంగా విశాఖపట్నం–గోపాల్పూర్ ప్రాంతం మధ్య తీరం దాటే అవకాశం ఉందని IMD తెలిపింది.
ప్రస్తుతం ఈ వ్యవస్థ విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా సుమారు 410 కిలోమీటర్లు, కళింగపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 330 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు తూర్పు-ఆగ్నేయంగా 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు తాజా IMD బులెటిన్ పేర్కొంది. ఇది గంటకు సుమారు 20–25 నాటికల్ మైళ్ల వేగంతో గాలులతో కూడిన వాతావరణాన్ని తీసుకొస్తోంది. సముద్ర పరిస్థితులు క్రమంగా రఫ్ నుంచి వెరీ రఫ్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో వర్షాలు మరింత తీవ్రం కానున్నాయి. IMD తాజా హెచ్చరికల ప్రకారం సెప్టెంబర్ 22న కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, 23, 24 తేదీల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 25న కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ముఖ్యంగా కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలకు సెప్టెంబర్ 23, 24 తేదీల్లో అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్ తదితర జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాల ముప్పు ఉంది. కాకినాడలోనూ వాయుగుండం ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. IMD స్థానిక అంచనా ప్రకారం సెప్టెంబర్ 22న చాలా భారీ వర్షం, 23, 24 తేదీల్లోనూ భారీ వర్షాలతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
గంటకు 50–60 కి.మీ వేగంతో గాలులు
వాయుగుండం తీరం వైపు కదులుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు బలపడనున్నాయి. IMD తీరప్రాంత బులెటిన్ ప్రకారం ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 20–25 నాట్స్ వేగంతో గాలులు, అప్పుడప్పుడు 30 నాట్స్ వరకు గాలివానలు వీచే అవకాశం ఉంది. భారీ వర్షాలు, ఉరుములతో సముద్ర పరిస్థితులు మరింత అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో ఉన్న వారు వీలైనంత త్వరగా సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవాలని సూచిస్తున్నారు. విశాఖపట్నం, భీమిలి, గంగవరం, కళింగపట్నం, కాకినాడ పోర్టులకు స్థానిక హెచ్చరికలు కొనసాగుతున్నాయి.
లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా
భారీ నుంచి అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో వరదలు, వాగులు, వంకలు పొంగిపొర్లే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని IMD హెచ్చరికలు సూచిస్తున్నాయి.
ప్రస్తుతం వాయుగుండం తుఫానుగా మారుతుందని IMD ఎలాంటి సూచన ఇవ్వలేదు. అయితే ఇది తీవ్ర వాయుగుండంగా బలపడి విశాఖపట్నం–గోపాల్పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నందున తీరప్రాంత జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాయుగుండం కదలిక, తీవ్రత ఆధారంగా వర్షపాతం, గాలుల వేగంలో మార్పులు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అధికారిక వాతావరణ హెచ్చరికలను మాత్రమే అనుసరించాలని సూచిస్తున్నారు.
- Amit Shah VS Abhijit Dipke: 2029లో గెలుపుపై ముందే ధీమానా? అమిత్ షా మాటల్లోనే దొంగతనం బయటపడింది..దిప్కే కౌంటర్..
- Rahul Gandhi Petition: రాహుల్ గాంధీ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా.. 14 లోపాలు గుర్తించిన రిజిస్ట్రీ
- Mamata Banerjee: మమతా బెనర్జీ నివాసం వద్ద కత్తితో మహిళ హల్చల్.. దాడికి యత్నించిందని టీఎంసీ ఎంపీ ఫిర్యాదు
- LB Nagar Double Decker Corridor: ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు గ్రీన్ సిగ్నల్.. హైదరాబాద్‌కు మరో కీలక ప్రాజెక్టు!
- CM Revanth Reddy: సీఎం రేవంత్ లాజిక్ కు బీజేపీ షాక్: జనాభా పెరుగుతుంటే.. 13 కోట్ల ఓట్లు ఎలా తగ్గాయి?