Hyderabad Real Estate: దక్షిణ హైదరాబాద్‌లో రియల్ బూమ్..శంషాబాద్ భూములకు పెరుగుతున్న డిమాండ్..
real estate
Hyderabad Real Estate: భాగ్యనగర రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు పశ్చిమ ప్రాంతమైన గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధుల నుంచి దక్షిణ భాగమైన శంషాబాద్ వైపు వేగంగా విస్తరిస్తోంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA), ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిసర ప్రాంతాలు సరికొత్త రెసిడెన్షియల్ హబ్‌గా రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా శంషాబాద్, మామిడిపల్లి పరిసరాలు మెరుగైన రవాణా కనెక్టివిటీ, స్థానిక ఆర్థిక కార్యకలాపాల విస్తరణతో నివాస ప్రాంతాలుగా విశేష ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.
శంషాబాద్ విమానాశ్రయం కేవలం ప్రయాణికుల రాకపోకలకే పరిమితం కాకుండా ఏవియేషన్, కార్గో, లాజిస్టిక్స్ , హాస్పిటాలిటీ విభాగాల విస్తరణకు ప్రధాన కేంద్రంగా మారింది. ఇది స్థానికంగా వేలాది ఉపాధి అవకాశాలను సృష్టిస్తూ, నివాస గృహాలకు స్థిరమైన డిమాండ్‌ను పెంచుతోంది. ఔటర్ రింగ్ రోడ్ ద్వారా నగరంలోని ఇతర ప్రాంతాలకు, ముఖ్యంగా పశ్చిమ ఐటీ కారిడార్లకు వేగంగా, ట్రాఫిక్ రహితంగా చేరుకునే వెసులుబాటు ఉంది. వీటికి తోడు జీఎంఆర్ సెజ్ (GMR SEZ), హార్డ్‌వేర్ పార్క్, జెమ్స్ పార్క్ వంటి పారిశ్రామిక కేంద్రాలతో పాటు ఆగాఖాన్ అకాడమీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఈ ప్రాంతంలో అందుబాటులో ఉండటం గృహ కొనుగోలుదారులను విశేషంగా ఆకర్షిస్తోంది.
ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ‘నైట్ ఫ్రాంక్’ (Knight Frank) 2025 ద్వితీయార్థం నివేదిక ప్రకారం, హైదరాబాద్ మొత్తం గృహ విక్రయాల్లో దక్షిణ హైదరాబాద్ వాటా 5 శాతం నుంచి 9 శాతానికి ఎగబాకింది. పశ్చిమ హైదరాబాద్ ఇప్పటికీ 63 శాతం వాటాతో మార్కెట్లో ఆధిపత్యం కొనసాగిస్తున్నప్పటికీ, దక్షిణ ప్రాంతంలో నివాస మార్కెట్ క్రమంగా బలపడుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. భవిష్యత్తులో రానున్న మెట్రో రైలు విస్తరణ, జీఎంఆర్ హైస్ట్రీట్ మాల్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ , దక్షిణ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు వంటి కీలక ప్రతిపాదనలు ఈ కారిడార్ అభివృద్ధికి మరింత ఊతమివ్వనున్నాయి.
ఈ ప్రాంతానికి ఉన్న భవిష్యత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ నిర్మాణ సంస్థలు భారీ ప్రాజెక్టులను చేపడుతున్నాయి. వైష్ణవి గ్రూప్ మామిడిపల్లిలో ‘సౌత్‌వుడ్స్’ విల్లా ప్రాజెక్టుతో పాటు ‘గరుడ’ పేరిట 2, 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్లను నిర్మిస్తోంది. అలాగే ప్రెస్టీజ్–వైష్ణవి భాగస్వామ్యంలో రాజేంద్రనగర్‌లోని ప్రెస్టీజ్ సిటీ, బెల్లాజియో విల్లాస్, ఫోరమ్ మాల్, అలోఫ్ట్ హోటల్ వంటి సమీకృత టౌన్షిప్ ప్రాజెక్టులు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. అయితే ఇళ్ల కొనుగోలుదారులు, మదుపర్లు కేవలం భవిష్యత్ ఊహాగానాలను మాత్రమే నమ్ముకోకుండా క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, నిర్మాణ పురోగతి, నిర్వహణ ఖర్చులు, నిత్యావసర సేవలు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయో నిర్ధారించుకుని, ప్రతిపాదిత మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతిని గమనిస్తూ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా నివాస ఎంపిక చేసుకోవడం ఉత్తమమని మార్కెట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
గమనిక (Disclaimer): ఈ కథనంలో పేర్కొన్న గణాంకాలు, విశ్లేషణలు కేవలం పాఠకుల అవగాహన మరియు సమాచారం కోసం మాత్రమే అందించబడ్డాయి. దీనిని ఆర్థిక లేదా స్థిరాస్తి పెట్టుబడి సలహాగా పరిగణించరాదు. ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే ముందు లేదా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్లు (RERA), చట్టపరమైన అనుమతులు, మరియు క్షేత్రస్థాయి మౌలిక వసతులను స్వయంగా పరిశీలించుకోవడంతో పాటు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఈ కథనం ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు ప్రజాపక్షం ఎటువంటి బాధ్యత వహించదు.