Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

అగ్రనాయక త్రైపాక్షిక సమ్మిట్‌ ఏమి సాధించింది ?

Prajapaksham 21 Nov 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
అగ్రనాయక త్రైపాక్షిక సమ్మిట్‌ ఏమి సాధించింది ?

Trump and putin and jinping

అమెరికా, చైనా, రష్యా అధ్యక్షులు ఒకచోట సమావేశమై ప్రపంచ పరిస్థితులపై అభిప్రాయాలు మార్చుకోవటం, ప్రపంచ శాంతికి పునరంకితం కావాలని నిర్ణయించుకోవటం చరిత్రలో అరుదైన ఘట్టం. వారిలో ఎవరి అవసరం ఎవరికుంది, సంభాషణల్లో ఎవరిది పైచేయి అయిందీ అనే శషభిషలకన్నా ప్రపంచ పరిణామాలను ప్రభావితం చేయగల సైనిక, ఆర్థిక, శాస్త్ర శక్తి సామర్థ్యాలున్న ఆ ముగ్గురు అగ్రనాయకులు చర్చలు జరపటం ఉద్రిక్తతలు, అనిశ్చితులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచానికి అవసరం.

ఆసియా ఆర్థిక సహకార(ఎపిఇసి) సంస్థ సమావేశానికి చైనా ప్రజా రిపబ్లిక్‌ ఆతిథ్యం మూడు దేశాల అధ్యక్షులు డోనాల్డ్‌ ట్రంప్‌, జీ జిన్‌పిన్‌, వ్లదీమిర్‌ పుతిన్‌ సమ్మిట్‌కు సందర్భం కల్పించింది. చైనా ఆర్థిక పునరుజ్జీవనానికి కేంద్రమైన షెన్‌జెన్‌ నగరంలో గురువారం 90నిముషాలపాటు జరిగిన త్రిమూర్తుల సమ్మిట్‌, ట్రంప్‌ వ్యాఖ్యానించినట్లు చరిత్రాత్మకం. ఈ చర్చలు నిర్దిష్టంగా ఫలితాలు సాధించకపోయినా జటిలమైన సమస్యలపై భవిష్యత్‌ చర్చలకు ప్రాతిపదిక కల్పించాయి. నాలుగు అంశాలతో సూక్ష్మంగా విడుదలచేసిన సంయుక్త శాంతి ప్రకటన ట్రంప్‌ లేవనెత్తిన ఉక్రేన్‌, ఇరాన్‌ యుద్ధ సమస్యలను ప్రస్తావించలేదు. త్రైపాక్షిక సమావేశానికి ముందుగా ట్రంప్‌ ట్రంప్‌ మధ్య ముఖాముఖీ చర్చలు జరిగాయి.

ఈ సంయుక్త శాంతి ప్రకటన సాధించిన అత్యంత సానుకూల ఫలితం అణుయుద్ధం నివారణకు సంభాషణ, సంప్రదింపులను వక్కాణించటం. “అణుయుద్ధలో విజేత ఉండరు. ఎన్నడూ ఆ యుద్ధానికి దిగకూడదు” అని, అందువల్ల అణ్వాయుధాలను తగ్గించుకునే విషయమై సంభాషణలు ప్రారంభించాలని కోరింది. ఈ మూడు దేశాలు అణ్వస్త్ర నిల్వలు అధికంగా ఉన్న రాజ్యాలు. రెండవ ప్రపంచ యుద్ధంలో విజేతలైన రష్యా, అమెరికా, చైనా ప్రపంచ శాంతికి పూచీకత్తుగా భద్రతామండలిలో వీటో అధికారం కలిగిన సభ్యులు.

అమెరికా మధ్య ప్రస్తుతం అమలులో ఉన్న అణు ఒప్పందం 2027 ఫిబ్రవరిలో ముగియనుంది. అమెరికా అధ్యక్షుల గత సమ్మిట్‌లో చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాలు ఎగుమతి, అమెరికానుంచి చైనాకు ఎఐ చిప్స్‌ ఎగుమతిపై కుదిరిన అవగాహన 2027 జనవరిలో ముగుస్తుంది. ఎన్‌విడియా సంక్షోభం నేపథ్యంలో చైనాకు చిప్స్‌ ఎగుమతులపై అమెరికా విధించిన నిషేధం నేపథ్యంలో అమెరికా మధ్య వాణిజ్య వేగాన్ని కొనసాగించే విషయమై క్షుణ్ణంగా చర్చలు జరగాల్సి ఉంది. రష్యాకు సంబంధించి ఉక్రేన్‌తో యుద్ధం నుంచి గౌరవప్రదంగా బయటపడేందుకు ట్రంప్‌ సహాయం అవసరం. యూరోపియన్‌ యూనియన్‌ ఉక్రేన్‌ అధ్యక్షుడి కొమ్ముగాస్తూ యుద్ధం కొనసాగించి రష్యాను బలహీనపరచాలని చూస్తోంది.

షెన్‌జెన్‌లో ముగ్గురు అగ్రనేతల సమావేశం రోజునే (నవంబర్‌ 19) 20 యూరప్‌ దేశాల అధినేతలు, నాటో ప్రధాన కార్యదర్శి మార్క్‌ రుట్టీ బెర్లిన్‌లో సమావేశమై పరోక్షంగా ట్రంప్‌పై ఒత్తిడి పెంచారు. జెలెన్‌స్కీ ఈ సమావేశానికి హాజరైనారు. 2027 సంవత్సరానికి యుద్ధ నిధులు సమకూర్చే కార్యక్రమం అంగీకరించారు. ఈ పరిస్థితుల్లో ట్రంప్‌ ఉక్రేన్‌ ఆమోదయోగ్యమైన పరిష్కారం ప్రతిపాదించలేక
పోయారు. జిన్‌పింగ్‌ సహాయం కోరారు.

ముగ్గురు నేతలు అంగీకరించిన 4అంశాల శాంతి ప్రకటనలోని అంశాలు ఇలా వున్నాయి : 1. అణ్వాయుధాల ప్రమాదాలు తగ్గించేందుకు, వ్యాప్తిని నిరోధించేందుకు మూడు దేశాలు సంభాషణలు జరుపుతాయి. ఇరాన్‌కు అణుబాంబు లేకుండా చేయటం అన్న ట్రంప్‌ వాదన ఈ ‘వ్యాప్తి నిరోధన’ పరిధిలోకి వస్తుంది. 2. సంఘర్షణలను నివారించటంలో ఐరాస భద్రతామండలి సమర్ధతపై విమర్శల దృష్ట్యా దాని సభ్యుల సంఖ్యను పెంచుతూ సంస్కరణలు చేయటానికి నిబద్ధత ప్రకటించాయి. 3. రాజ్యాధినేతలకు తమ ప్రాసిక్యూషన్స్‌నుంచి మినహాయింపు యివ్వాలని అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ఐసిసి)ను ఉద్దేశించి పేర్కొన్నది. పుతిన్‌ తమ ముందుకు రావాలన్న ఐసిసి ఆదేశం దృష్ట్యా ఈ ప్రస్తావనకు ప్రాధాన్యత ఉంది. 4. అందరి మేలుకోసం పెట్రోలియం ఉత్పత్తుల ధరలను స్థిరీకరించేందుకు వాటి ఉత్పత్తి, సరఫరాలను పెంపుచేయాలని మూడు దేశాలు అంగీకరించాయి. రష్యా నుంచి ఆయిలు కొనుగోలు దేశాలపై 100 శాతం సుంకాల విధింపు చట్టంపై సంతకం చేసి, దాని అమలును వాయిదా వేసిన ట్రంప్‌ ఆ బెదిరింపునకు మళ్లీ పాల్పడకుండా ఈ అవగాహన నిరోధిస్తుంది.

ప్రధాన దేశాలు పరస్పర గౌరవం, శాంతియుత సహజీవనం, సహకారం, అంతర్జాతీయ నియమాలు, సంభాషణ, సంప్రదింపులతో మసలుకోవాలని చైనా అధ్యక్షుడు వక్కాణించారు. చైనా, రష్యా, అమెరికా భాగస్వాములుగా, స్నేహితులుగా ఉండాలని, అవి తమ మధ్య సైనిక మోహరింపు, సంఘర్షణకు దిగరాదని చెప్పారు.

పరస్పర సహకార భావన వెల్లివిసిరినప్పటికీ, ఈ భావనను వచ్చే రోజుల్లో ముందుకు తీసుకెళతారో లేదో వేచిచూదాం!