Editorial: కృష్ణా జలాల అక్రమ తరలింపు…
Krishna River
తెలుగు రాష్ట్రాల మధ్య తాజాగా మరో జలవివాదం తెరపైకి వచ్చింది. కృష్ణా జలాలను చడీ చప్పుడు లేకుండా తీసుకుపోయేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బట్టబయలయ్యాయి. నాగార్జునసాగర్ డ్యాం కుడివైపు రిజర్వాయర్ నుంచే నీటిని సొరంగ మార్గంలో తరలించేందుకు జరుగుతున్న ఏర్పాట్లు వెలుగులోకి వచ్చాయి. పైగా, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న ఈ ప్రాజెక్టు విషయంలో తటస్థ ఎంపైర్ పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వమే ఇందుకు సహకరించడం ఘోరం. కేంద్రానికి చెందిన జల్ మిషన్ కింద దీనిని చేపట్టింది. దీని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం నిధులతో దీనిని నిర్మిస్తాయి. పల్నాడు ప్రాంతానికి నీరందించేందుకు అమరజీవి జల పథకం అనే పేరుతో దీనిని చేపట్టారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు సాగు, తాగు నీటి కోసం కేటాయించిన కృష్ణా జలాలను నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా తరలించేందుకు నేరుగా రిజర్వాయర్ డ్యామ్ గేట్ల వెంబడే కుడి కాలువ ఉన్నది. తెలంగాణకు కేటాయించిన నీళ్ళు రిజర్వాయర్ ఎగువన చాలా దూరంలో నుంచి ఎడమ కాలువ ద్వారా వెళుతున్నాయి. ఇప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా రిజర్వాయర్ డెడ్ స్టోరేజిలోనే 510 అడుగుల వద్ద నుంచి నీటిని తరలించేందుకు సొరంగం కాలువ నిర్మాణం పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగవంతం చేసింది. రోజుకు 160 మిలియన్ లీటర్లు చొప్పున 1.8 టీఎంసీల నీటిని సాఫీగా తీసుకుపోయే వెసులుబాటు కలుగుతోంది. ఇది కుడి కాలువ నుంచి తరలింపునకు అదనం. తమ వాటా నీటి నుంచే వాటిని మినహాయించుకుంటామని ఏపీ ప్రభుత్వం చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవు. ఇప్పటికే ఎగువన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను విస్తరించి, కేటాయింపు కంటే ఎక్కువగా కృష్ణా జలాలను వాడుకోవడమే కాకుండా, బేసిన్‌లో లేని ప్రాంతాలకు తరలించుక పోవడం కళ్ల ముందు కనబడుతోంది.
చాలాకాలం క్రితమే అమరజీవి జలపథకానికి టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. తమ న్యాయమైన వాటా కింద వచ్చే నీటికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి పథకం, ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేసేందుకు శతథా ప్రయత్నిస్తున్నది. అలాగే గోదావరి జలాల సద్వినియోగం కోసం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కలిసి అనుమతుల కోసం కష్టపడుతున్నారు. అయితే, డ్యామ్‌కు అవతల వైపున ఏపీ నిర్మిస్తున్న అక్రమ జల తరలింపు కట్టడాలను మన క్షేత్ర స్థాయి అధికార యంత్రాంగం పసిగట్టకపోవడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఒకవైపు ఎల్‌నినో ప్రభావం ముంచుకొస్తూ, నీటి కొరత ప్రమాద ఘంటికలను మోగిస్తుంటే, మరో వైపు ఏపీ నుంచి నీటి తరలింపు యత్నాలను సకాలంలో కనిపెట్టకపోవడం శోచనీయమే.
కృష్ణా జలాల అక్రమ తరలింపు యత్నాల గురించి ఇప్పుడు గగ్గోలు పెడుతున్న ప్రతిపక్ష బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా చేసిన నిర్లక్ష్యమూ ఇందుకు ఒక కారణమే. కృష్ణమ్మపై కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్‌సాగర్, ఎస్‌ఎల్‌బీసీ తదితర అనుమతులున్న ప్రాజెక్టులను దశాబ్దకాలంలో పూర్తి చేయకపోవడంతో కేటాయించిన జలాలు సద్వినియోగం చేసుకోలేకపోయాం. మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకు ఆ ప్రాంత ముఖ్యమంత్రులు కృష్ణా ప్రాజెక్టులకు అనుమతులున్నా లేకున్నా, ఏకపక్షంగా కట్టుకుంటూ పోయారు. పైగా అక్రమ ప్రాజెక్టుల ద్వారా నీటిని సుస్థిరం చేసుకునేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకం, బనకచర్ల రిజర్వాయర్‌కు పోలవరం నుంచి తరలింపునకు ఉపక్రమిస్తూనే ఉన్నారు. మరోవంక తెలంగాణ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుపుల్లలు వేస్తూనే ఉంది. ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, తుమ్మడిహెట్టి, ఇచ్చంపల్లి వంటి ప్రాజెక్టులకు అభ్యంతరాలను చెబుతూనే ఉంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు తక్కువ ఖర్చుతో ప్రయోజనకారిగా ఉండే గోదావరి కృష్ణా నదుల అనుసంధానాన్ని ఇచ్చంపల్లి లేదా, దుమ్ముగూడెం నుంచి చేపట్టకుండా దారి మళ్లిస్తోంది. దిగువన పోలవరం నుంచి రాయలసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణాలో కలిపే వ్యూహాన్ని తెరపైకి తీసుకువచ్చి, తన బలంతో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేందుకు ఏపీ అధికార పార్టీ టీడీపీ ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నది.
ఏపీ చేపడుతున్న అమరజీవి జలపథకంపై ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై కృష్ణా నది జలాల నిర్వహణ బోర్డుకు ఫిర్యాదు చేసినప్పటికీ, అది సరిపోదు. కేంద్ర ప్రభుత్వం వివక్షతాపూరిత సహకారాన్ని ఆంధ్రప్రదేశ్‌కు అందించటాన్ని ప్రజల్లో ఎండగట్టడమే కాకుండా, దానిని అడ్డుకునేందుకు అన్ని రకాల అవకాశాలను వినియోగించుకోవాలి. అలాగే నీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టేందుకు అఖిలపక్షం, జల నిపుణులతో చర్చించి, విస్తృత సమ్మతితో ఒక జలప్రణాళికను సిద్ధం చేయాలి. దానికనుగుణంగా ముందుకు సాగాలి. గతంలో కృష్ణా, గోదావరి జలాల తరలింపు విషయంలో తెలంగాణ ఫిర్యాదుతో ఉభయ తెలుగు రాష్ట్రాలతో కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన 16 నెలల క్రితం అపెక్స్ కమిటీ సమావేశమైనప్పటికీ, ఫలితం శూన్యం. మూడు నెలల గడువుతో నాడు 13 మందితో వేసిన కమిటీ నివేదిక ఇచ్చిందో లేదో కూడా తెలియదు. వాయిదాల మీద వాయిదా పడి కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీలు సమావేశమైనప్పటికీ నిర్ణయాలు జరగడం లేదు. నిర్ణయాలు జరిగినా అమలు సుదూర స్వప్నాలుగానే మిగిలాయి. కాబట్టి తెలంగాణకు నదీ జలాల విషయంలో జరుగుతున్న అన్యాయాలపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకులు మౌనం దాలిస్తే స్వరాష్ట్రానికి అన్యాయం చేసినవారవుతారు.