Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

చాలీచాలని ఆదాయంలో పేదరికం ఛాయలు

Prajapaksham 18 Nov 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
చాలీచాలని ఆదాయంలో పేదరికం ఛాయలు

తమ పాలనాకాలంలో 50 కోట్ల మందిని దుర్భర దారిద్య్రం నుంచి పైకి తెచ్చినట్లు ప్రపంచబ్యాంక్‌ కితాబిచ్చిందని బిజెపి పాలకులు చంకలు చరుచుకుంటున్నారు. అయితే 80 కోట్లమందికి ఉచిత ఆహారధాన్యాల పంపిణీ ఎందుకు అని ప్రశ్నించే వారికి ప్రభుత్వం నుంచి సమాధానం లభించదు. విద్యావంతుల్లో నిరుద్యోగం పెరుగుతుందన్నది నిరాకరించలేని వాస్తవం. ప్రభుత్వ విద్యనుంచి లబ్దిపొంది పట్టభద్రులైన పేద కుటుంబాల విద్యార్థులూ వారిలో ఉన్నారు.

తాజా వారపు ప్రతిపత్తి (సిడబ్ల్యుఎస్‌) ప్రకారం నిరుద్యోగిత రేటు 2026 సెప్టెంబర్‌లోని 5 శాతం నుంచి అక్టోబర్‌లో స్వల్పంగా 4.9 శాతానికి తగ్గింది. అందులో పట్టణాల్లో నిరుద్యోగిత హెచ్చుస్థాయిలో 6.7 శాతంగా ఉంది. కాగా గ్రామీణ నిరుద్యోగిత గత మూడు మాసాలుగా ఆగస్టు నుంచి 4.2 శాతం వద్ద స్థిరంగా ఉంది.

పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (ఎ.ఎల్‌.ఎఫ్‌.ఎస్‌) 2026 అక్టోబర్‌ డేటాను 2025 నవంబర్‌తో పోల్చితే కొంత ప్రోత్సాహకరంగా ఉంది. అయితే 2026 ఆగస్టు నుంచి గ్రామీణ నిరుద్యోగిత రేటులో మార్పు లేదు. ఆగస్టు అనంతరకాలం వ్యవసాయ తరుణం, పండుగల సీజన్‌ కూడా. ఈ కాలంలో ఉపాధి కల్పన పెరగకపోవటం ఆందోళనకరం.

గ్రామీణ యువతలో (15 సం. మధ్య వయస్కులు) నిరుద్యోగిత గత మూడు మాసాలుగా 12.7 శాతం వద్ద నిలబడి ఉంది. పట్టణాల్లో నిరుద్యోగిత రేటు 0.2 శాతం తగ్గినా 6.7 శాతంగా హెచ్చుస్థాయిలోనే ఉంది. అదే పట్టణ యువతలో అది అక్టోబర్‌లో భారీగా 18.3 శాతంగా ఉంది. పట్టణ యువమహిళల నిరుద్యోగిత రేటు గత రెండు మాసాల్లో 26.6 శాతం నుంచి 25.1 శాతానికి తగ్గింది. యువకుల్లో 16.4 నుంచి 15.9 శాతానికి తగ్గినా ఇది ఎంతో ఆందోళన కలిగించే హెచ్చుస్థాయి.

భారతదేశంలో కార్మికుల ఉపాధి స్థితిపై తాజా ప్రభుత్వ డేటా ప్రకారం రెగ్యులర్‌ జీతంతో కూడిన ఉద్యోగాలు, అలాగే క్యాజువల్‌ ఉద్యోగాల (నిర్ణీతకాల ఉద్యోగాలు) లభ్యత తగ్గుతున్నది. దాంతో కార్మికులు స్వల్పాదాయ స్వయం ఉపాధి వైపు నెట్టబడుతున్నారు. అయితే వారి ఆదాయార్జన దారిద్య్ర రేఖకు దిగువనే ఉంటున్నది.

ఏది దారిద్య్ర రేఖ? తక్కువ, మధ్యస్థాయి ఆదాయ దేశాలకు (వాటిలో భారత్‌ ఉంది) కొనుగోలు శక్తి సరిసమానత ప్రాతిపదికపై 2021లో ప్రపంచ బ్యాంక్‌ నిర్ణయించిన దారిద్య్రరేఖ రోజు ఆదాయం 4.20 డాలర్లు. ఐదేళ్ల తర్వాత, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం లెక్కలోకి తీసుకుంటే ఇది ఒక వ్యక్తికి నెలవారీ ఆదాయం రూ.3,300 నుంచి రూ.3,450 అవుతుంది. ఐదుగురు సభ్యుల కుటుంబానికి నెలసరి దారిద్య్రరేఖ రూ.16,500 నుంచి రూ.17,250 అవుతుంది.

భారతదేశంలో ఎఎల్‌ఎఫ్‌ఎస్‌, ఆర్థిక సర్వేల ప్రకారం స్వయం ఉపాధి కార్మికుల్లో 75 మంది ఆదాయార్జన రూ.12,000 నుంచి రూ.15,000 ఉంది. ఇది 2026లో అంచనా వేస్తున్న దారిద్య్ర రేఖ కన్నా తక్కువ. 2021 రేఖ ప్రకారం దారిద్య్రం అధిగమించామని గొప్పలు చెప్పుకోవచ్చు. కాని 2026 రేఖ ప్రకారం దారిద్య్రం, పాక్షిక దారిద్య్రం హెచ్చుస్థాయిలోనే కొనసాగుతున్నాయి. దానికి జీవిత వాస్తవ ధృవీకరణ ఉచిత ఆహార ధాన్యాల పథకం.

మోదీ ప్రభుత్వం, అంతకుముందు 2013లో యుపిఎ ప్రభుత్వం ఆమోదించిన ‘జాతీయ ఆహార భద్రత చట్టం’ క్రింద కోవిడ్‌ మహమ్మారి కాలంలో (ఏప్రిల్‌ 2020 – డిసెంబర్‌ 2022) తాత్కాలిక ఉపశమనంగా ఉచిత ఆహార ధాన్యం (బియ్యం లేదా గోధుమలు) పథకం (ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన) ప్రారంభించింది. తదుపరి అంచెలంచెలుగా పొడిగిస్తూ డిసెంబర్‌ 2022లో ఆహార సబ్సిడీ పథకాలన్నిటినీ గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కిందకు తెచ్చింది. ప్రస్తుత పొడిగింపు 2028 డిసెంబర్‌ వరకు అమలులో ఉంటుంది. పేదలకు నెలకు 5 కిలోలు, అంత్యోదయ అన్నయోజన (పేదల్లో కెల్లా పేదలు) కింద కుటుంబానికి నెలకు 35 కిలోలు ఉచితంగా సరఫరా చేస్తున్నది.

దారిద్య్రరేఖ నేపథ్యంగా క్యాజువల్‌ లేబర్‌ ఆదాయాన్ని చూచినట్లయితే, జాతీయ సగటు దినసరి వేతనం రూ.453 ప్రకారం, వారు నెలకు రూ.12,750 నుంచి రూ.13 వేలు సంపాదిస్తారు. అదీ నెలరోజులు పూర్తిగా పనిదొరికితేనే. అంటే వారి నెలవారీ ఆదాయం 2026లో దారిద్య్ర రేఖ అంచనా (రూ.16,500 నుంచి రూ.17,250) కన్నా తక్కువగా ఉంది.

అందువల్ల పిఎల్‌ఎఫ్‌ఎస్‌ త్రైమాసిక డేటాను (2026 జులై సీరియస్‌గా తీసుకోవాలి. ఆ డేటా ప్రకారం క్యాజువల్‌ లేబర్‌ ఏప్రిల్‌ త్రైమాసికంలో 19 నుంచి 18.4 శాతానికి తగ్గారు. కాగా రెగ్యులర్‌ వేతన కార్మికులు 26.2 నుంచి 25.8 శాతానికి తగ్గారు. స్వయం ఉపాధిపరులు 54.8 నుంచి 55.8 శాతానికి పెరిగారు.

స్వయం ఉపాధిపరుల్లో కూడా 40.9 శాతమే స్వయానా వర్కర్‌ లేదా యజమాని. కాగా స్వయం ఉపాధిలోపల పనిచేసే వేతనం తీసుకోని కుటుంబ సభ్యులు ఆ రెండు త్రైమాసికాల మధ్యకాలంలో 13 నుంచి 14.2 శాతానికి పెరగటం ఆందోళనకరం. స్వయం ఉపాధిపరులైన మహిళల సంఖ్య ఈ కాలంలో 64 నుంచి 64.9 శాతానికి పెరిగారు.

ఏ రకంగా చూసినా, పెరుగుతున్న ధరవరలు దారిద్య్రభారాన్ని, దారిద్య్రరేఖ కింద ఉన్న జనాభా సంఖ్యను పెంచుతున్నాయి. ఒక్క అక్టోబర్‌లోనే టోకుధరలు గరిష్టంగా 12.9 శాతం పెరుగుదలతో కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. రానున్న ఎల్‌ నినో తమ కుటుంబాల్లో ఏ భారం తెచ్చిపెడుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం తక్షణం రంగంలోకి దిగాలి. రాష్ట్రప్రభుత్వాలను ఆదుకోవాలి. అంతర్జాతీయంగా క్రూడ్‌ రేటు తగ్గినందున, ఆ తగ్గుదలను వినియోగదారులకు అందించి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. ఎల్‌ నినో దృష్ట్యా స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలపై దృష్టిపెట్టాలి.

ట్యాగ్‌లు: editorial