Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

Editorial: ఒవైసీ కూటమి ప్రభావవంత మవుతుందా?

Prajapaksham 15 Nov 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
Editorial: ఒవైసీ కూటమి ప్రభావవంత మవుతుందా?

Owaisi And Chandrashekhar Azad

ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ రాష్ట్రంలో కొత్త కూటమి పొద్దుపొడిచింది. అది హైదరాబాద్‌ పునాదిగా పనిచేస్తూ, దాని ఏకైక ఎంపి అసదుద్దీన్‌ ఒవైసీ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్న అఖిలభారత మజ్లీస్‌ ఎ ముస్లిమీన్‌(ఎఐఎంఐఎం), దళిత నాయకుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ రావణ్‌ సొంత పార్టీ ఆజాద్‌ సమాజ్‌ పార్టీ(ఎఎస్‌పి) ఈ ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేసేందుకై గురువారం ప్రకటించిన ‘సామాజిక్‌ పరివర్తన్‌ మోర్చా’. తమ కూటమి అసెంబ్లీలోని 403 సీట్లకు పోటీ చేస్తుందని, ఆజాద్‌ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఒవైసీ ప్రకటించారు. కాగా తమ కూటమిలో చేరాల్సిందిగా ఇండియా కూటమి ప్రధాన పార్టీలైన సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్‌లకు అజాద్‌ విజ్ఞప్తి చేయటం చిత్రంగా ఉంది. ఈ పార్టీలు పెద్ద సామాజిక తరగతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు వాటి సామాజిక పునాది తెలియజేస్తున్నందున ఎన్నికల క్షేత్రం ఆసక్తిదాయకంగా మారనుంది. ఎందుకంటే, ఉత్తరప్రదేశ్‌ జనాభాలో దళితులు 21శాతం, ముస్లింలు 19శాతం వెరసి 40 శాతం. ఈ సామాజిక తరగతులు ఈ రెండు పార్టీల వెనుక ఐక్యంగా ఉంటే త్రిముఖ పోటీల్లో సాంప్రదాయపార్టీలకు పెనుసవాలు తప్పదు. కాని క్షేత్రస్థాయి పరిస్థితులు పూర్తి భిన్నం. అందువల్ల ఈ కొత్త పొత్తు ఏ రాజకీయ సముదాయానికి బిజెపికా లేక ఇండియా కూటమికా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపకారి అవుతుందనే చర్చలు, విశ్లేషణలు సాగుతున్నాయి. 2022లో జరిగిన గత ఎన్నికల్లో రాష్ట్రంలో ఆజాద్‌ సమాజ్‌ పార్టీకి ఒక్క శాతంలోపు ఓట్లు వచ్చాయి. ఎఐఎంఐఎం పరిస్థితీ అంతే. కాగా అఖిలేశ్‌ యాదవ్‌ నాయకత్వంలోని ప్రతిపక్షం కాంగ్రెస్‌తో, ఇతర చిన్న పార్టీలతో పొత్తు ప్రయత్నాలు చేస్తోంది. యాదవ్‌ వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలను కలుపుకుని పిడిఎ నినాదంతో బలమైన ఐక్యతను నిర్మించుకున్నారు. బిజెపి విభజనవాదం, దుష్పరిపాలనను, బుల్‌డోజర్‌ దురంతాలను వ్యతిరేకించే పైన ప్రస్తావించిన మూడు సామాజిక విభాగాలలోని వారు సమాజ్‌వాదిపార్టీ, కాంగ్రెస్‌ కూటమిని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఒవైసీ, రావణ్‌లు ఆ కూటమినుంచి, అలాగే మాయావతి బిఎస్‌పి నుంచి రెండు పెద్ద సామాజిక తరగతులను విభజించి తాము లబ్దిపొందాలని ఆశిస్తున్నారు. దేశమంతటా ముస్లింల రాజకీయవాణిగా ఎఐఎంఐఎంను పటిష్టం చేయాలన్న ఒవైసీ కోరిక. అందుకే బిహార్‌, మహారాష్ట్ర, బెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో ముస్లిం జనాభా కేంద్రీకరించి ఉన్న ప్రాంతాల్లో ఎన్నికలప్పుడు హడావుడి చేసి కొందర్ని పోటీ చేయిస్తుంటాడు. గెలిచిన కొద్దిమందిలో పదవీకాలం ముగిసేవరకు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారు అరుదు. ఎంఐఎం ఎన్నో కొన్ని ముస్లిం ఓట్లు చీల్చుతున్నందున అది పరోక్షంగా బిజెపికి ప్రయోజనం చేకూర్చుతున్నది. కాగా తన నగీనా నియోజకవర్గం, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ వెలుపలకు దళిత రాజకీయ పునాదిని విస్తరించాలన్నది చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఆకాంక్ష. ఒకప్పుడు దళితులకు తిరుగులేని శక్తిగా ఎదిగిన మాయావతి బహుజన్‌ సమాజ్‌పార్టీ ప్రభావం, ఓటువాటా వరుస ఎన్నికల్లో గణనీయంగా తగ్గింది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఏలుబడి సాగించిన ఆమెకు ఇప్పుడు అసెంబ్లీలో ఒకే సభ్యుడు ఉన్నాడు. పార్టీలో రెండవస్థానం ఎవరికి ఇవ్వాలో ఆమె గందరగోళంలో ఉన్నట్లు తన మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌ను పలుమార్లు నియమించి, తొలగించిన వైనం తెలియజేస్తోంది. దళితుల్లో మెజారిటీగా ఉన్న జాతవ్‌లు మాయావతి సామాజిక పునాది.దళితులందరికీ తాను నాయకుణ్ణి కావాలన్నది ఆజాద్‌ ప్రయత్నం. కాంగ్రెస్‌లో బలమైన దళితనేతగా ఎదుగుతాడనుకున్న ఆజాద్‌ అధిక ఆశలతో సొంతపార్టీ ఏర్పాటు చేసుకున్నాడు. తన పార్టీకి చివరన కన్షీరాం పేరు తగిలించుకున్నా కాలం కలిసి రాలేదు. ఆయన పార్టీకి తానొక్కడే ఎమ్మెల్యే. అందువల్ల ఎన్నికల ముందు ఏర్పడే ఇటువంటి కూటములు ముందునుంచీ తలపడుతున్న, స్థిరపడిన రాజకీయ పార్టీల్లో ఏదో ఒకదానికి నష్టం కలుగజేస్తాయి.
ఉత్తరప్రదేశ్‌లో తిరుగులేదనుకున్న బిజెపికి గత లోక్‌సభ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒకవైపు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ శాంతి ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపు పేరుతో దళితులు, ముస్లింలపై ఎన్‌కౌంటర్లు, బుల్‌డోజర్ల ప్రయోగంతో, రెండోవైపున, ఓట్‌చోరీ ఆరోపణలతో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న బిజెపిని అందరూ కలిసి వచ్చే ఎన్నిక ల్లో ఓడించాల్సి ఉండగా, ముస్లిం, దళితనాయకులిరువురు సొంత కూటమి ప్రకటించటం పరోక్షంగా బిజెపికి సహాయపడుతుంది. ఎంఐఎం ఒకవైపు బిజెపి విభజనవాద విధానాలను వ్యతిరేకిస్తూనే ఎన్నికల్లో ప్రజాతంత్ర శక్తులతో కలవకుండా ప్రతిపక్ష ఓట్లు చీల్చే ఎత్తుగడలవల్ల బిజెపి ‘బి’ టీంగా ఆరోపణకు గురవుతోంది.
ఎఐఎంఐఎం, ఆజాద్‌ సమాజ్‌ పార్టీ పొత్తు భారతీయ జనతా పార్టీ పాలనలో అన్యాయాలు అనుభవిస్తున్న సామాజిక తరగతుల ఓటర్లపై ఎటువంటి ప్రభావం చూపబోదని, దళితులు, ముస్లింలు, ఒబిసిలు, ప్రగతిశీల శక్తుల ఓట్లు చీల్చటానికి బిజెపి ప్రయత్నిస్తుందని ప్రజలు ముందునుంచే ఊహిస్తున్నారని సమాజ్‌వాదిపార్టీ, కాంగ్రెస్‌ నాయకులు వ్యాఖ్యానించటం గమనార్హం. అన్యాయం, అణిచివేత, విధ్వంసాలకు ప్రతీక అయిన బుల్‌డోజర్లను చూపి ఓట్లు అడుగుతున్న ముఖ్యమంత్రి యోగికి ఓటర్లు గర్వభంగం చేయకమానరు.