Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

Editorial: పేదరికం తగ్గితే ఉచిత రేషన్‌ ఎందుకు?

Prajapaksham 12 Nov 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
Editorial: పేదరికం తగ్గితే ఉచిత రేషన్‌ ఎందుకు?

Telangana Ration Shops: తెలంగాణలో మళ్లీ ‘అమ్మహస్తం’ పథకం? పేదలకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు!

భారతదేశంలో పేదరికం తగ్గిందని ప్రభుత్వ గణాంకాలు ప్రకటిస్తున్నప్పుడు, దేశంలోని కోట్లాది కుటుంబాలకు ఉచిత రేషన్‌ ఎందుకు ఇంకా అవసరమవుతోంది? ఈ ప్రశ్న మన దేశంలోని సామాజిక వాస్తవికతకు, ప్రభుత్వ విధానాలకు, పేద ప్రజల జీవన ప్రమాణాలకు, అభివృద్ధి నమూనాకు సంబంధించిన మౌలిక అంశాలను నిలదీస్తున్నది. ఒక దేశంలో పేదరికం తగ్గిందని ప్రకటించడం గొప్ప విషయమే. కానీ ఆ ప్రకటనతో పేదరికం అనుభవిస్తున్న మనుషుల కష్టాలు కూడా తగ్గిపోయాయని భావించడం మాత్రం ముమ్మాటికీ వాస్తవాన్ని విస్మరించడమే. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహా మండలి సభ్యురాలు డాక్టర్‌ షమికా రవి వెల్లడించిన వివరాల ప్రకారం, 2011 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 30 శాతంగా ఉన్న పేదరికం, తాజా గృహ వినియోగ వ్యయ గణాంకాల ఆధారంగా చూస్తే, 3.9 శాతానికి తగ్గింది. మరోవైపు, ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద దేశవ్యాప్తంగా సుమారు 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు అందించే వ్యవస్థ కొనసాగుతోంది. పేదరికం ఇంతగా తగ్గిపోయినప్పుడు, ఉచిత రేషన్‌ పొందుతున్న వారి సంఖ్యలో అదే దామాషాలో తగ్గుదల ఎందుకు కనిపించడం లేదు? పేదరికం తగ్గిందనే గణాంకానికి, పేదరికం నుంచి బయటపడిన ప్రజల వాస్తవ జీవితాలకు మధ్య ఉన్న అంతరాన్ని మనం పరిశీలించాల్సిన అవసరం లేదా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మోదీ ప్రభుత్వానిదే. గణాంకాలు ఒక దేశ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అవి అవసరమే. ప్రభుత్వాలు తమ విధానాల ఫలితాలను అంచనా వేయడానికి, ఆర్థికవేత్తలు అభివృద్ధి తీరు ను విశ్లేషించడానికి అవి ప్రామాణిక సాధనాలు. కానీ గణాంకాలకు ఒక పరిమితి ఉంది. అవి ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా వివరించలేవు.


జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) ప్రకారం గ్రామీణ జనాభాలో 75 శాతం, పట్టణ జనాభాలో 50 శాతం మందికి ఆహార ధాన్యాలు అందించాలనే లక్ష్యంతో 2011 జనాభా లెక్కల ఆధారంగా 81.35 కోట్ల మందిని పేదలుగా తేల్చారు. ఈ పరిమితి పేదరికం తగ్గిన ప్రతిసారీ దానంతట అదే తగ్గే విధంగా రూపొందించలేదు. అంతేకాదు, 2011 జనాభా లెక్కల తర్వాత జనాభా పెరిగినా, కొత్త జనాభా అంచనా లెక్కల ఆధారంగా ఈ పరిమితిని పూర్తిగా సవరించలేదు. అందువల్ల 80 కోట్ల మందికి రేషన్‌ అందుతోందనే సంఖ్యను ప్రస్తుత పేదరికానికి నేరుగా అద్దం పట్టే గణాంకంగా చూడలేం. కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం అర్హులుగా గుర్తించినవారి సంఖ్య, వాస్తవంగా రేషన్‌ తీసుకుంటున్నవారి సంఖ్య ఒకటి కాదు. 2025 అక్టోబరులో దాదాపు 78.90 కోట్ల మంది ఉచిత ధాన్యాలు పొందుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ అంశాన్ని విస్మరించి 3.9 శాతం పేదరికం, 80 కోట్ల రేషన్‌ లబ్ధిదారులు అనే రెండు సంఖ్యలను మాత్రమే పోల్చడం సరైన విశ్లేషణ కాదు. ప్రభుత్వం నిజంగా పేదరిక నిర్మూలన దిశగా గొప్ప విజయాలు సాధించి ఉంటే, ఆ విజయాల ఫలితంగా ఆర్థికంగా బలపడిన కుటుంబాలను గుర్తించి, మరింత అవసరంలో ఉన్న కుటుంబాలకు ఆ ప్రయోజనాలను అందించే సమర్థమైన వ్యవస్థను ఎందుకు అభివృద్ధి చేయకూడదు? ఒకవైపు అనర్హులు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు నిజమైన అర్హులు రేషన్‌ కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వలస కూలీలు, అసంఘటిత రంగ కార్మికులు, నిరాశ్రయులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, వికలాంగులు అనేక సందర్భాల్లో ప్రభుత్వ గుర్తింపు వ్యవస్థలోనే చోటు
సంపాదించలేకపోతున్నారు.


అర్హతను నిర్ణయించే ప్రమాణాలు కేవలం పత్రాల ఆధారంగా కాకుండా, కుటుంబాల వాస్తవ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఉండాలి. ఆహార భద్రత అనేది దానం కాదు, పౌరుడి హక్కు. అయితే ఆహార భద్రతను కేవలం బియ్యం, గోధుమల పంపిణీకి పరిమితం చేయడం కూడా సరైంది కాదు. మనిషి కడుపు నిండితేనే ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పలేం. పిల్లలకు పప్పులు, పాలు, గుడ్లు, పండ్లు అందాలి. గర్భిణులకు పౌష్టికాహారం అందాలి. రక్తహీనత, పోషకాహార లోపం, చిన్నారుల్లో ఎదుగుదల సమస్యలను
నిర్మూలించాలి. అందువల్ల ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రాంతీయ ఆహార అలవాట్లకు
అనుగుణంగా చిరుధాన్యాలు, పప్పులు, ఇతర పోషకాహార పదార్థాలను కూడా చేర్చే దిశగా ప్రభుత్వం ఆలోచించాలి.


దేశంలో అట్టడుగు వర్గాలను నిజం గా అభివృద్ధి చేయాలంటే సంక్షేమ పథకాలతో పాటు ఉపాధి అవకాశాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి. పట్టణాల్లో వలస కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, గృహ వసతి, ఆరోగ్య బీమా కల్పించాలి. ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేసి, పట్టణ పేదలకు కూడా ఉపాధి హామీ కల్పించే విధానాన్ని పరిశీలించాలి.
విద్య అనేది పేదరిక నిర్మూలనకు అత్యంత శక్తివంతమైన ఆయుధం. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధన, డిజిటల్‌ విద్య, వృత్తి విద్యను బలోపేతం చేయాలి. అలాగే ఆరోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేసి పేదరికాన్ని నిర్మూలించ డం సాధ్యం కాదు. మహిళల ఆర్థిక సాధికారతకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. స్వయం సహాయక సంఘాలను కేవలం రుణాల పంపిణీ కేంద్రాలుగా కాకుండా, చిన్న పరిశ్రమలు, ఉత్పత్తి కేంద్రాలు, మార్కెటింగ్‌ వ్యవస్థలుగా అభివృద్ధి చేయాలి. మహిళలకు ఆస్తి హక్కులు, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి. వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు గౌరవప్రదమైన పెన్షన్లు అందించాలి. సంక్షేమం అనేది వారి జీవనాధారానికి మాత్రమే కాకుండా ఆత్మగౌరవానికి కూడా తోడ్పడాలి. ప్రభుత్వం ప్రకటించే 3.9 శాతం పేదరికం నిజంగా దేశానికి గర్వకారణం కావాలంటే, ఆకలితో నిద్రపోయే ఒక్క కుటుంబం కూడా ఉండకూడదు. ఉచిత రేషన్‌ తీసుకునే కుటుంబాన్ని అవమానంగా చూడకూడదు. అదే సమయంలో జీవితాంతం ఉచిత రేషన్‌పై ఆధారపడాల్సిన పరిస్థితిని కూడా అభివృద్ధిగా పరిగణించకూడదు.


ఉచిత ఆహారం తాత్కాలికంగా ఆకలిని నివారిస్తుంది. నాణ్యమైన విద్య, స్థిరమైన ఉపాధి, ఆరోగ్య భద్రత, సామాజిక న్యాయం మాత్రం తరతరాల పేదరికాన్ని నిర్మూలిస్తాయి. ఒక దేశ అభివృద్ధిని కొలవడానికి అత్యంత సరైన కొలమానం ఆ దేశంలో అత్యంత పేదవాడి జీవితాన్ని పరిశీలించడమే. అంబానీ సంపద ఎంత పెరిగింది, స్టాక్‌ మార్కెట్‌ ఎంత ఎత్తుకు చేరింది, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఎన్నో స్థానానికి ఎదిగింది అనే అంశా లు ముఖ్యమే కావచ్చు. కానీ ఒక పేద తల్లి తన బిడ్డకు తగినంత ఆహారం పెట్టగలుగుతోందా? ఒక రైతు తన అప్పులు తీర్చగలుగుతున్నాడా? ఒక నిరుద్యోగ యువకుడు గౌరవప్రదమైన ఉద్యోగం సంపాదించగలుగుతున్నాడా? ఒక వృద్ధుడు ఇతరులపై ఆధారపడకుండా జీవించగలుగుతున్నాడా? అన్నదే నిజమైన అభివృద్ధికి సిసలైన పరీక్ష. గణాంకాలు ప్రజల కన్నీళ్లను తుడవలేవు. అంకెలు ఆకలి బాధ ను అనుభవించలేవు. పేదరికం తగ్గిందని చెప్పడం కంటే, పేదరికంలో ఉన్న చివరి మనిషిని కూడా ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావడమే కీలకం. అప్పుడే గణాంకాలకు, వాస్తవాలకు నిజమైన అర్థం.. పరమార్థం.

ట్యాగ్‌లు: editorial