No Bank Account? బ్యాంక్ అకౌంట్ లేకున్నా డబ్బులు పంపొచ్చు.. ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవే..
RBI
No Bank Account? బ్యాంకు ఖాతా లేని సామాన్యులు నగదు రూపంలో ఇతరుల ఖాతాల్లోకి డబ్బు పంపాలన్నా, లేదా ఖాతా ఉన్నవారు ఖాతా లేని వారికి నగదు అందించాలన్నా ఎంతవరకు పంపవచ్చు? ఏటీఎంలు, బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా జరిగే లావాదేవీలకు ఉన్న పరిమితులు ఏమిటి? వంటి అంశాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. గతంలో అమల్లో ఉన్న నగదు బదిలీ పరిమితులను అలాగే కొనసాగిస్తూనే, ఆర్థిక మోసాలను అరికట్టేందుకు కఠినమైన భద్రతా చర్యలను తప్పనిసరి చేస్తూ సమగ్ర ఆదేశాలు వెలువరించింది.
బ్యాంకు ఖాతా లేని వ్యక్తులు సైతం ఏదైనా బ్యాంకు శాఖకు నేరుగా వెళ్లి నెఫ్ట్ (NEFT) సేవ ద్వారా ఒక లావాదేవీలో గరిష్ఠంగా రూ. 50 వేల వరకు నగదు రూపంలో ఇతరుల ఖాతాల్లో జమ చేయవచ్చు.
బ్యాంకు ఖాతా లేని వ్యక్తులు గ్రామీణ, ఇతర ప్రాంతాల్లో బ్యాంకు తరఫున సేవలందించే బిజినెస్ కరస్పాండెంట్లు (BCs), ఏటీఎంలు లేదా ఆర్బీఐ అనుమతించిన ఇతర మార్గాల ద్వారా కూడా నగదు పంపవచ్చు. అయితే ఈ విధానంలో ఒకసారి గరిష్ఠంగా రూ. 5 వేలకు మించి పంపడానికి వీలుండదు. అంతేకాకుండా, ఒక వ్యక్తి ఈ మార్గాల ద్వారా నెల మొత్తంలో పంపే నగదు విలువ రూ. 25 వేలకు మించకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
మరోవైపు, డబ్బు పంపే వ్యక్తికి బ్యాంకు ఖాతా ఉండి, స్వీకరించే వ్యక్తికి బ్యాంకు ఖాతా లేకపోయినా నగదు బదిలీ చేసే వెసులుబాటు ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఏటీఎంలు, బ్యాంకు ప్రతినిధులు లేదా ఇతర అనుమతించిన వేదికల ద్వారా అవతలి వారికి నగదు అందజేయవచ్చు. అయితే ఈ ‘క్యాష్ పే-అవుట్’ విధానంలో ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ. 10 వేలు మాత్రమే పంపాలి. ఒక లబ్ధిదారునికి నెలలో ఇలా పంపే మొత్తం రూ. 25 వేలకు మించరాదు.
| లావాదేవీ రకం / మార్గం | ఒక్కో లావాదేవీ గరిష్ఠ పరిమితి | నెలవారీ గరిష్ఠ పరిమితి |
| బ్యాంకు శాఖలో నెఫ్ట్ (NEFT) (ఖాతా లేని వారు) | రూ. 50,000 | ప్రత్యేక పరిమితి పేర్కొనలేదు |
| బీసీ (BC) / ఏటీఎంల ద్వారా నగదు జమ (Cash Pay-in) | రూ. 5,000 | రూ. 25,000 (పంపే వారికి) |
| ఖాతా లేని వారికి నగదు చెల్లింపు (Cash Pay-out) | రూ. 10,000 | రూ. 25,000 (లబ్ధిదారునికి) |
లావాదేవీలలో పారదర్శకత కోసం ఆర్బీఐ భద్రతా నిబంధనలను మరింత కట్టుదిట్టం చేసింది. నగదు పంపే వ్యక్తి మొబైల్ నంబర్‌ను బ్యాంకు తప్పనిసరిగా ధ్రువీకరించడంతో పాటు, కేవైసీ (KYC) నిబంధనల ప్రకారం అధికారిక గుర్తింపు పత్రాన్ని నమోదు చేయాలి. అంతేకాకుండా ప్రతి లావాదేవీకి అదనపు ధ్రువీకరణ (AFA) తప్పనిసరి. నగదు రూపంలో పంపిన డబ్బును సులభంగా గుర్తించేందుకు నెఫ్ట్, ఐఎంపీఎస్ (IMPS) లావాదేవీల సమాచారంలో ప్రత్యేక సంకేతంతో పాటు పంపిన వారి వివరాలను బ్యాంకులు నమోదు చేయాలి.
ఏదైనా బ్యాంకు ఖాతాలోకి అకస్మాత్తుగా భారీ మొత్తంలో నగదు జమ అవుతున్నా, లేదా అనుమానాస్పద రీతిలో లావాదేవీలు జరుగుతున్నా బ్యాంకులు తక్షణమే అప్రమత్తమై విచారణ జరపాలి. అనుమానం బలపడితే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. డబ్బు బదిలీలను వీలైనంత వేగంగా రియల్ టైమ్ పద్ధతిలో పూర్తి చేయాలని, బ్యాంకుల మధ్య లావాదేవీలు కేవలం ఆర్బీఐ ఆమోదించిన చెల్లింపు వ్యవస్థల ద్వారానే జరగాలని ఆదేశించింది.
దేశంలోని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పట్టణ మరియు రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులతో పాటు అనుమతి పొందిన చెల్లింపు సేవల సంస్థలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. అయితే, ఒక కార్డు నుంచి మరో కార్డుకు చేసే నగదు బదిలీలను ఈ నిబంధనల పరిధి నుంచి మినహాయించారు.