Panjagutta Police Station: దేశంలోనే తొలిసారిగా పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఏఐ ఆధారిత పోలీసింగ్ సేవలు.. సీపీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీ
Panjagutta Police Station
Panjagutta Police Station: దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత పోలీసింగ్ సేవలను హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్స్టేషన్లో పైలట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ వెల్లడించారు. ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో పంజాగుట్ట పోలీస్స్టేషన్లో వేగంగా జరుగుతున్న ఆధునికీకరణ పనులను ఆయన బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు.
రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఆలోచన మేరకు.. తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ విభాగంలో ఏఐ సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలనే ఉన్నత లక్ష్యంతో ఈ పైలట్ ప్రాజెక్టును చేపట్టినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. తనిఖీల్లో భాగంగా స్టేషన్లో జరుగుతున్న సాంకేతిక ఏర్పాట్లు, డిజిటలైజేషన్ ప్రక్రియ, పోలీస్ రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. పౌరుల నుంచి ఫిర్యాదు స్వీకరించినప్పటి నుంచి నేర దర్యాప్తు, ఆధారాల విశ్లేషణ, చివరకు కోర్టులో ఛార్జిషీట్ రూపకల్పన వరకు పోలీసింగ్లోని ప్రతి దశలోనూ ఏఐ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించనున్నట్లు స్పష్టం చేశారు. దీనివల్ల పోలీస్ సేవల్లో పారదర్శకత, వేగం పెరగడమే కాకుండా బాధితులకు సత్వర న్యాయం అందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.