ప్రపంచ న్యుమోనియా దినం -2026: ప్రాణాలు తీస్తున్న న్యుమోనియా వ్యాధి
ప్రపంచ న్యుమోనియా దినం -2026: ప్రాణాలు తీస్తున్న న్యుమోనియా వ్యాధి
2021లో న్యుమోనియా అంటువ్యాధితో 2.2 మిలియన్లు మరణించగా అందులో 5.02 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఐదేళ్ల లోపు వయసున్న పిల్లల అధిక మరణాలకు కారణమైన వ్యాధి న్యుమోనియా. కోవిడ్-19 కారణంతో మరో 10 మిలియన్లు కూడా అదనంగా మరణించినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. అధిక ప్రాణాలను తీస్తున్న వ్యాధుల్లో న్యుమోనియా ప్రధానమైనదని తేలింది. వాతావరణ ప్రతికూల మార్పులు, గాలి కాలుష్యం కోరలు చాచడంతో శ్వాస వ్యవస్థ, ఊపిరితిత్తుల సమస్యలు ఉత్పన్నం కావడం, న్యుమోనియా మహా విపత్తు వస్తుందనే భయం కూడా ఉందని, మిలియన్ల జనులు న్యుమోనియా సోకే ప్రమాదపు అంచున ఉన్నారని వైద్యులు అంచనా వేస్తున్నారు. న్యుమోనియా వ్యాధి ఐదేండ్ల లోపు పిల్లలకు, వృద్ధులకు వస్తుంది. టీకాలు వేయించుకోని వారు, పోషకాహారలోపాలు, ఇంట్లో వంట చెరుకు వాడేవారు, కలుషిత గాలి పీల్చే పెద్దలు, పొగ త్రాగే దురలవాటు ఉన్నవారు అధికంగా న్యుమోనియా బారిన పడే ప్రమాదం ఉంటుంది.ప్రపంచ న్యుమోనియా దినం -2026 ఇతివృత్తంగా న్యుమోనియా అదుపులో కొత్త శకం(ఏ న్యూ ఏరా ఆఫ్ న్యుమోనియా కంట్రోల్) అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం
నిర్వహిస్తున్నారు.
న్యుమోనియాలో రకాలు: న్యుమోనియా నివారించదగిన అంటు వ్యాధి. వ్యాధిగ్రస్థులు తుమ్మడం, దగ్గడం, ముక్కు చీదడం లాంటి సందర్భాల్లో మరొకరికి సంక్రమిస్తుందని తెలుసుకోవాలి. పిల్లల్లో బ్యాక్టీరియా కారక స్ట్రెప్టోకోకల్ న్యుమోనియా అతి ప్రధానమైనది. దాని తర్వాత హిమోఫిలస్ ఇన్‌ఫ్లుయెంజా రెండవ ప్రధానమైనది. న్యుమోనియాలో రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ వ్యాధి వైరస్ వర్గంలో ముఖ్యమైనది. న్యుమోనియా వ్యాధికి చికిత్స కూడా అందుబాటులో ఉన్నది. ప్రపంచ న్యుమోనియా దినం వేదికగా ప్రభుత్వాలు, వైద్య ఆరోగ్య శాఖ, ఎన్‌జిఒలు, ఇతర సంస్థలు కలిసి న్యుమోనియా పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, రోగగ్రస్థులకు చికిత్సా పద్ధతులు వివరించ డం మంచి ఫలితాలను ఇస్తాయి. న్యుమోనియాను తొలిదశలో గుర్తించడం, చికిత్స తీసుకోవడం, నివారణ మార్గాలను తెలుసుకోవడం లాంటి అంశాలను గుర్తుంచుకోవాలి. యూనిసెఫ్ వివరాల ప్రకారం ప్రతి 39 సెకన్లకు ఒక పిల్లవాడు న్యుమోనియాతో మరణిస్తున్నాడు. వృద్ధుల్లో న్యుమోకోకల్ న్యుమోనియా అధికంగా సోకుతుంది. న్యుమోసిస్టిక్ జిరోవెస్సీ వ్యాధి ఫంగస్ సోకడంతో వస్తుంది. డబ్ల్యూహెచ్‌ఒ, యూనిసెఫ్‌లు సంయుక్తంగా న్యుమోనియా, డయేరియా వ్యాధుల కట్టడికి గ్లోబల్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు.
నివారణ మార్గాలు: టీకాలు వేయించడం, పోషకాహారం అందించడం, గాలి కాలుష్యాన్ని తగ్గించడం వల్ల న్యుమోనియా వ్యాధి తీవ్రత తగ్గుతుంది. యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ ఔషధాలతో న్యుమోనియా కట్టడి జరుగుతుంది. భౌతిక దూరాలు పాటించడం, మాస్కులు ధరించడం, పబ్లిక్ ప్రదేశాల్లో ఉమ్మి వేయకుండా ఉండడం, దగ్గినపుడు లేదా తుమ్మినపుడు కండువా కప్పుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, గాలి కాలుష్యాన్ని కట్టడి చేయడం, నదుల్ని కలుషితం కాకుండా చూసుకోవడం లాంటి పలు జాగ్రత్తలు న్యుమోనియా కేసులను తగ్గిస్తాయి.
- డాక్టర్ బిఎం. రెడ్డి,