Skip to content
లైఫ్ స్టైల్ › వార్తలు

Shigella Outbreak in Kerala: కేరళలో షిగెల్లా బ్యాక్టీరియా కలకలం.. మలప్పురంలో హై అలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి..

jagan 12 Nov 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
Shigella Outbreak in Kerala: కేరళలో షిగెల్లా బ్యాక్టీరియా కలకలం.. మలప్పురంలో హై అలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి..

Virus

Shigella Outbreak in Kerala: కేరళలోని మలప్పురం జిల్లాలో ‘షిగెల్లా’ (Shigella) బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లాలోని మూడు ప్రాంతాల్లో ఈ ఇన్ఫెక్షన్ తాజాగా నిర్ధారణ కావడంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 75 షిగెల్లా కేసులు నమోదయ్యాయని, వీరిలో ఎనిమిది మంది బాధితులతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారికి కూడా ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా నిఘా పెంచడంతో పాటు కట్టుదిట్టమైన నివారణ చర్యలు చేపట్టారు.

మలప్పురం జిల్లాలోని అరీకోడ్, పుల్పట్ట, ఎడవన్న ప్రాంతాల్లో తాజాగా షిగెల్లా కేసులు వెలుగుచూశాయి. దీంతో జిల్లా స్థాయి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ (RRT) అత్యవసర సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించింది. వ్యాధి మరింత విస్తరించకుండా తీసుకోవాల్సిన యుద్ధప్రాతిపదికన చర్యలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

షిగెల్లా అనేది బ్యాక్టీరియా వల్ల సంక్రమించే తీవ్రమైన పేగుల ఇన్ఫెక్షన్. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. కలుషితమైన నీరు తాగడం, నిల్వ ఉంచిన ఆహారం లేదా సరిగా ఉడకని పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ వ్యాధి వేగంగా సోకుతుంది. బాధితుల మలంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఏర్పడినా ఇన్ఫెక్షన్ వ్యాపించే ప్రమాదం ఉంది. సాధారణంగా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన ఒకటి లేదా రెండు రోజుల్లోనే వ్యాధి లక్షణాలు బయటపడతాయి.

విరేచనాలు, మలంలో రక్తం లేదా చీము పడటం, తీవ్రమైన కడుపునొప్పి, జ్వరం, వాంతులు , శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం (డీహైడ్రేషన్) ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. ఎలాంటి బయటి లక్షణాలు కనిపించని బాధిత పిల్లల నుంచి కూడా మలం ద్వారా బ్యాక్టీరియా ఇతరులకు వ్యాపించవచ్చని మలప్పురం జిల్లా వైద్యాధికారి డాక్టర్ వి. వినోద్ హెచ్చరించారు. చికిత్స అందించడంలో ఆలస్యమైతే మెదడు, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం పడవచ్చని, కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా తలెత్తే ప్రమాదం ఉందని తెలిపారు.

వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో బహిరంగ విందులను అధికారులు తాత్కాలికంగా నిషేధించారు. ఆరోగ్యశాఖ, స్థానిక స్వపరిపాలన శాఖ , ఆహార భద్రత విభాగం సంయుక్తంగా ఆహార తయారీ, నిల్వ, పంపిణీ కేంద్రాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించనున్నాయి. పరిశుభ్రత నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

ప్రజలు తాగడానికి , వంట అవసరాలకు కేవలం కాచి చల్లార్చిన నీటినే ఉపయోగించాలని ఆరోగ్యశాఖ సూచించింది. ఎల్లప్పుడూ తాజాగా తయారు చేసిన, పూర్తిగా ఉడికించిన ఆహారాన్నే తీసుకోవాలి. నిల్వ ఆహారం, మూతలేకుండా ఉంచిన పదార్థాలు, బయట దొరికే ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండాలి. తాగునీటి వనరులను క్రమం తప్పకుండా క్లోరినేషన్ చేయడంతో పాటు పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగిన తర్వాతే వినియోగించాలి. భోజనానికి ముందు, వంట చేసే ముందు, మరుగుదొడ్డికి వెళ్లి వచ్చిన తర్వాత తప్పనిసరిగా సబ్బుతో చేతులు శుభ్రపరుచుకోవాలి.

ఎవరికైనా విరేచనాలు మొదలైతే తక్షణమే ఓఆర్‌ఎస్ (ORS) ద్రావణం, ఉప్పు కలిపిన గంజి లేదా కొబ్బరినీళ్లు ఇవ్వాలని అధికారులు సూచించారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని కోరారు.