Skip to content
జాతీయం › వార్తలు

Arvind Kejriwal Gets Death Threat: రూ.7 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం.. అరవింద్ కేజ్రీవాల్‌కు లారెన్స్ బిష్ణోయ్ ముఠా పేరుతో బెదిరింపులు..

jagan 12 Nov 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Arvind Kejriwal Gets Death Threat: రూ.7 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం.. అరవింద్ కేజ్రీవాల్‌కు లారెన్స్ బిష్ణోయ్ ముఠా పేరుతో బెదిరింపులు..

Aravind Kejriwal

Arvind Kejriwal Gets Death Threat: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను హత్య చేస్తామంటూ బెదిరింపులు రావడం దేశ రాజధానిలో కలకలం రేపింది. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా పేరుతో ఈ బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడినని చెప్పుకుంటూ ఇటీవల ఒక గుర్తుతెలియని వ్యక్తి తనకు ఫోన్ చేశాడని ఢిల్లీలోని తిలక్ నగర్ ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తమకు రూ. 7 కోట్లు చెల్లించాలని, లేనిపక్షంలో అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆయన కుమార్తెను కూడా హత్య చేస్తానంటూ సదరు వ్యక్తి తీవ్రస్థాయిలో బెదిరించినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ కాల్ అనంతరం నిందితుడు వాట్సప్ ద్వారా కూడా బెదిరింపు సందేశాలు పంపినట్లు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేజ్రీవాల్ , ఆయన కుటుంబ సభ్యులకు తక్షణమే కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని జర్నైల్ సింగ్ పోలీసులను కోరారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎమ్మెల్యే కాల్ రికార్డులు, వాట్సప్ మెసేజ్‌ల ఆధారంగా నిందితుడి ఫోన్ లొకేషన్‌ను గుర్తించేందుకు సాంకేతిక దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇటీవల బాలీవుడ్ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని లారెన్స్ బిష్ణోయ్ ముఠా సాగిస్తున్న బెదిరింపుల పరంపర సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తులు కాల్పులకు పాల్పడిన ఘటన మరువకముందే పలువురు హిందీ నటులకు ఇదే తరహా బెదిరింపు కాల్స్ వచ్చాయి. నటుడు తుషార్ కపూర్‌కు ఆ గ్యాంగ్ సభ్యుడు ‘హ్యారీ బాక్సర్’ పేరిట ఫోన్ చేసి రూ. 5 కోట్లు డిమాండ్ చేయడంతో పాటు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించాడు. ఆ తర్వాత మరో ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానాకు కూడా ఇటువంటి బెదిరింపులే రావడంతో ముంబయి పోలీసులు సైతం ప్రత్యేక బృందాలతో విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈ ముఠా పేరుతో బెదిరింపులు రావడం రాజకీయ, భద్రతా వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.