2024 ఎన్నికల్లో అక్రమాలు ? 51 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపుపై సంచలన ఆరోపణలు.. రిపోర్టర్స్ కలెక్టివ్ పరిశోధనలో ఏముంది ?
2024 ఎన్నికల్లో అక్రమాలు ? 51 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపుపై సంచలన ఆరోపణలు.. రిపోర్టర్స్ కలెక్టివ్ పరిశోధనలో ఏముంది ?
భారత ఎన్నికల సంఘం (Election Commission of India) పనితీరుపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ఎన్నికలను స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష ఇండియా కూటమి చాలాకాలంగా ఆరోపిస్తోంది. ఎన్నికల సంఘం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రభావంలో పనిచేస్తోందని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. తాజాగా ‘రిపోర్టర్స్ కలెక్టివ్’ అనే పరిశోధనాత్మక జర్నలిజం సంస్థ వెల్లడించిన వివరాలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. 2024 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నాయని ఆ సంస్థ తన పరిశోధనలో వెల్లడించింది. ఎన్నికల సంఘానికి చెందిన అంతర్గత రికార్డులను విశ్లేషించడం ద్వారా ఈ వివరాలను గుర్తించినట్లు పేర్కొంది.
ఫామ్-6 నిబంధనల మార్పుపైనా వివాదం
ఇటీవల ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల సంఘంలోని మరో ఇద్దరు కమిషనర్ల అభ్యంతరాలను పక్కనపెట్టి ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించిన ఫామ్-6 నిబంధనల్లో మార్పులు చేసినట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం ప్రచురించింది. ఈ మార్పులపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శికి లేఖలు రాసినట్లు కూడా ఆ కథనం వెల్లడించింది. దీనిపై ఎన్నికల సంఘం స్పందిస్తూ సుప్రీంకోర్టు సూచనల మేరకే మార్పులు చేసినట్లు ప్రకటించింది. అయితే ఈ మార్పులకు తాము అనుమతి ఇవ్వలేదని, తమను సంప్రదించలేదని సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా స్పష్టం చేసినట్లు కథనంలో ప్రస్తావించారు. దీంతో ఎన్నికల సంఘం వివరణపై కూడా ప్రశ్నలు తలెత్తాయి.
51 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపుపై అనుమానాలు
తాజాగా రిపోర్టర్స్ కలెక్టివ్ వెల్లడించిన పరిశోధనలో 2024 ఎన్నికలకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్ర, హర్యానా, జమ్మూకశ్మీర్ సహా పలు ప్రాంతాల్లోని 51 లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు, ఈవీఎంలలో లెక్కించిన ఓట్లకు మధ్య గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ వివరాలు రాజకీయ పార్టీల ఆరోపణల ఆధారంగా కాకుండా ఎన్నికల సంఘానికి చెందిన అంతర్గత రికార్డుల విశ్లేషణ ద్వారా గుర్తించినట్లు తెలిపింది.
బద్కల్లో 3.32 లక్షల ఓట్లు.. లెక్కించింది 1.60 లక్షలేనా?
హర్యానాలోని బద్కల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఇందుకు ఉదాహరణగా పేర్కొంది. 2024 అక్టోబర్ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల సంఘం అంతర్గత రికార్డుల్లో 3.32 లక్షల ఓట్లు పోలైనట్లు నమోదై ఉండగా, అధికారిక లెక్కింపులో ఈవీఎంల ద్వారా లెక్కించిన ఓట్లు సుమారు 1.60 లక్షలుగా ఉన్నట్లు రిపోర్టర్స్ కలెక్టివ్ వెల్లడించింది. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుమారు 6 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ సింగ్ ఈ ఫలితాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. పోలింగ్ రోజుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, ఇతర రికార్డులను అందించాలని కోర్టును కోరినట్లు ఈ కథనంలో వివరించారు.
ముంబై నార్త్‌లో 7.78 లక్షల ఓట్ల వ్యత్యాసం?
మహారాష్ట్రలోని ముంబై నార్త్ లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించిన వివరాలు కూడా ఈ పరిశోధనలో ప్రస్తావించారు. ఎన్నికల సంఘం అంతర్గత రికార్డుల ప్రకారం ఇక్కడ 18.11 లక్షల ఓట్లు పోలైనట్లు నమోదుకాగా, అధికారిక ఫలితాల్లో ఈవీఎంల ద్వారా లెక్కించిన ఓట్లు సుమారు 10.33 లక్షలుగా ఉన్నట్లు పేర్కొన్నారు. అంటే పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య సుమారు 7.78 లక్షల వ్యత్యాసం ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పీయూష్ గోయల్ కాంగ్రెస్ అభ్యర్థి భూషణ్ పాటిల్‌పై విజయం సాధించారు. ఈ వివరాలు నిజమైతే ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది.
మరికొన్ని నియోజకవర్గాల్లోనూ తేడాలు!
హర్యానాలోని కైతల్ నియోజకవర్గంలో అంతర్గత రికార్డుల ప్రకారం కేవలం 215 మంది ఓటర్లు ఓటు వేసినట్లు నమోదుకాగా, ఈవీఎంలలో మాత్రం 67 వేల ఓట్లు లెక్కించినట్లు రిపోర్టర్స్ కలెక్టివ్ పేర్కొంది. అలాగే జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ నియోజకవర్గంలో పోలైన ఓట్ల కంటే సుమారు 6 వేల ఓట్లు అధికంగా లెక్కించినట్లు రికార్డులు సూచిస్తున్నాయని తెలిపింది.
మరో కీలక అంశం కూడా ఈ పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. సాధారణంగా పోలింగ్ ముగిసే సమయానికి పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఉన్న ఓటర్లకు టోకెన్లు ఇచ్చి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. అయితే 19 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల తర్వాత క్యూలో ఓటర్లు ఎవరూ లేరని రికార్డుల్లో నమోదైనప్పటికీ, ఆ తర్వాత కూడా పోలింగ్ శాతం పెరిగినట్లు చూపించారని రిపోర్టర్స్ కలెక్టివ్ పేర్కొంది. ఈ వ్యత్యాసాలకు కారణాలేమిటన్నది ఎన్నికల సంఘం వివరించాల్సి ఉంది.
ఓట్ల వివరాలు ఎందుకు వెల్లడించడం లేదు?
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రతి పోలింగ్ బూత్‌లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి? ఎన్ని ఓట్లు లెక్కించారు? అనే వివరాలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఫారం-17సీ ద్వారా పోలింగ్ కేంద్రాల వారీగా ఓట్ల వివరాలు నమోదు చేస్తారు. అయితే ఈ వివరాలను బహిరంగంగా అందుబాటులో ఉంచే విషయంలో ఎన్నికల సంఘం వెనుకడుగు వేస్తోందని విమర్శలు వస్తున్నాయి. 2024 ఎన్నికల తర్వాత ఓట్లకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించకుండా ఉండేందుకు నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
రిపోర్టర్స్ కలెక్టివ్‌ను వివరాలు కోరిన ఈసీ
తాము వెల్లడించిన వివరాలపై ఎన్నికల సంఘం స్పందించినట్లు రిపోర్టర్స్ కలెక్టివ్ పేర్కొంది. తమ వద్ద ఉన్న అంతర్గత రికార్డులు, సమాచారాన్ని అందించాలని ఎన్నికల సంఘం కోరినట్లు తెలిపింది. అయితే తమ వద్ద ఉన్న సమాచారాన్ని ప్రజలకు వెల్లడించిన తర్వాతే ఎన్నికల సంఘానికి అందిస్తామని ఆ సంస్థ స్పష్టం చేసినట్లు వివరించింది. ఈ అంశంపై మరిన్ని పరిశోధనాత్మక కథనాలను కూడా త్వరలో ప్రచురించనున్నట్లు ప్రకటించింది.
ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాల్సిందే!
ఇప్పటివరకు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించిన ప్రతిసారీ బీజేపీ వాటిని రాజకీయ విమర్శలుగానే కొట్టిపారేస్తూ వచ్చింది. అయితే తాజాగా మీడియా సంస్థ వెల్లడించిన అంతర్గత రికార్డుల విశ్లేషణతో ఈ అంశం మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య ఇంతటి వ్యత్యాసాలు ఎందుకు కనిపిస్తున్నాయి? వివిధ నియోజకవర్గాల్లో నమోదైన గణాంకాల్లో తేడాలకు కారణాలేమిటి? 19 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల తర్వాత ఓటర్లు లేకపోయినా పోలింగ్ ఎలా పెరిగింది? వంటి ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
అయితే రిపోర్టర్స్ కలెక్టివ్ వెల్లడించిన వివరాలు, గణాంకాల్లోని వ్యత్యాసాలు మాత్రమే ఎన్నికల అక్రమాలు జరిగినట్లు నిరూపించవు. వాటిపై ఎన్నికల సంఘం అధికారిక వివరణ, స్వతంత్ర పరిశీలన కూడా అవసరం. దేశ ప్రజలకు ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం ఉండాలంటే ఇలాంటి అనుమానాలకు పారదర్శకంగా సమాధానాలు ఇవ్వడం ఎన్నికల సంఘం బాధ్యత.