Editorial: ‘10+2’ పై స్పష్టత అవసరం
Students
వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో 10+2 విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్లు విద్యాశాఖను కూడా చూస్తున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి బుధవారం ప్రకటించారు. దీంతో ఐదున్నర దశాబ్దాలకు పైగా కొనసాగిన ఇంటర్మీడియట్ విద్యా విధానానికి ముగింపు కార్డు పడనుంది. ఇకపై పాఠశాలల్లోనే పదవ తరగతి తరువాత 11, 12 తరగతులు ఉండబోతున్నాయి. అలాగే ప్రస్తుతం ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యా విధానంలో కూడా మార్పులు చోటు చేసుకోనున్నాయి. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్య, 5 నుంచి 8వ తరగతి వరకు సెకండరీ విద్య, 9 నుంచి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీ విద్యగా విభజిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇది ఆకస్మికంగా వచ్చిపడిన నిర్ణయమేమి కాదు. గత విద్యా సంవత్సరంలోనే అమలు చేయాలని భావించినప్పటికీ, సమయం తక్కువ ఉండటంతో 2027 సంవత్సరానికి వాయిదాపడింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలోనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ నేతృత్వంలో విద్యా కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్ అన్ని కోణాలలో పరిశీలన చేసి, కింది నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు విద్యా వ్యవస్థలో మార్పులను సిఫార్సు చేస్తూ సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి అందజేసింది. అందులో ఇంటర్‌ను రద్దు చేసి, 10+2 విధానాన్ని తీసుకురావాలని ప్రతిపాదన తీసుకువచ్చింది. దానిని ప్రయోగాత్మకంగా రంగారెడ్డి జిల్లా ఆరుట్ల అనే గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో మార్పులు తీసుకువచ్చి తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను కమిషన్ విజయవంతంగా నడిపి చూపింది. విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.కేశవరావు నేతృత్వంలో అధ్యయన కమిటీ వేయడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) రాష్ట్రంలో అన్వయంపై కూడా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రెండు, మూడు కార్పొరేట్ కాలేజీలు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను తమ గుప్పిట్లో తీసుకొని, వేల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. అవి బోర్డునే శాసించే స్థాయికి ఎదిగాయి. తాజాగా ప్లస్ టూ విధానాన్ని అమలు తీసుకురావాలనే నిర్ణయంతో కొంత వరకు వాటి ఆధిపత్యానికి అడ్డుకట్ట పడవచ్చని భావిస్తున్నారు. ఇది తొందరపాటే కావొచ్చు. వచ్చే ఏడాది నుంచి 10+2 విధానం వస్తుందని తెలిసినప్పటికీ, ఆ కార్పొరేట్ విద్యా సంస్థలు నెల రోజుల క్రితం నుంచే తమ పాఠశాలల్లో చదువుకుంటున్న పదవ తరగతి విద్యార్థులను వచ్చే ఏడాది తమ సంస్థ కాలేజీల్లోనే ఇంటర్మీడియట్లో చేర్చుకునేందుకు అడ్మిషన్ల అడ్వాన్స్ బుకింగ్‌లు మొదలెట్టేశాయి. ఇది వారి ధీమాను తెలియజేస్తోంది. ఎందుకంటే ఆ కార్పొరేట్ కళాశాలలు ఇప్పటికే చాలా కాలం క్రితం పాఠశాలలను కూడా స్థాపించాయి. అవి మొదట్లో అంత ఆదరణ పొందనప్పటికీ, క్రమక్రమంగా హైదరాబాద్ మహానగరంలో తమ పట్టును బిగించాయి. కాబట్టి, పదవ తరగతికి మరో రెండు క్లాసులు కలుపుకుంటే కొత్త విద్యా విధానాన్ని తమకు పాఠశాలల్లోనే అమలు చేయడం అంత కష్టమేమీ కాదు. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఎక్కువగా హైదరాబాద్‌లోనే స్కూల్స్‌ను ఏర్పాటు చేశాయి.
తెలంగాణలోని ఇతర ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాలలో ఉన్నప్పటికీ, ఇంకా వాటికి గుత్తాధిపత్యం దక్కలేదు. ఇప్పుడు కొత్త విద్యా విధానం వచ్చాక, కింది వరకు పట్టుబిగించగలిగే ఆర్థిక వనరులు మెండుగా ఉన్నాయి. కాబట్టి, ప్రభుత్వం ఎన్ని మార్పులు తీసుకువచ్చినప్పటికీ, కార్పొరేట్ విద్యా సంస్థల కోరలు తీయకపోతే షరా మామూలే.
ఇక మరో విషయమేమిటంటే, రాష్ట్రంలోని విద్యారంగంలో తీసుకువస్తున్న నూతన మార్పులు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానం 2020కి కొంత దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఇప్పటికే ఎన్ఈపీ అనేక విమర్శలను ఎదుర్కొంటున్నది. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యారంగాన్ని సమాఖ్యస్ఫూర్తిని కాలరాస్తూ తమ చేతుల్లోకి తీసుకునేందుకు అనుగుణంగానే ఎన్‌ఈపిని రూపొందించారు. ఎన్ఈపిలోని కొన్ని అంశాలను అమలు చేస్తామని కేంద్రప్రభుత్వంతో ఎంఓయూపై సంతకం చేస్తేనే రాష్ట్రాలకు పీఎం శ్రీ పథకం కింద విద్యా సంస్థలకు నిధులు ఇస్తారు. ఇది నెమ్మదిగా విద్యారంగాన్ని తన ఛత్రఛాయలోకి తీసుకొని, విద్య కాషాయీకరణకు చేసే పన్నాగాలలో భాగమనే విమర్శలు ఉన్నాయి. కేరళంలో ఎల్డీఎఫ్ అధికారంలో ఉండగా పీఎం శ్రీ నిధుల కోసం ఎంఓయు కుదుర్చుకునేందుకు ప్రయత్నం జరగగా, ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న సీపీఐ తీవ్రంగా వ్యతిరేకించటంతో అది నిలిచిపోయింది. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎం.కె.స్టాలిన్ ఉన్న సమయంలో సమగ్ర శిక్ష అభియాన్ కింద రావాల్సిన రూ.2,150 కోట్ల నిధుల విడుదలను పీఎం శ్రీ పథకం ఎంఓయుపై సంతకం చేయటంతో ముడిపెట్టడంతో ఆయన తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఎన్‌ఈపిని తిరోగమన పత్రంగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ప్రత్యామ్నాయ నమూనా విద్యా విధానాన్ని అమలులోకి తీసుకురావాలని ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేసింది.
మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు తీసుకురావడం అనివార్యమే. వచ్చే ఏడాది నుంచి 10+2పై ప్రభుత్వం విధాన నిర్ణయం ప్రకటించేసింది. అయితే, దీనిపై అనేక సందేహాలు ముసురుకున్నాయి. దీనిద్వారా ఎన్ఈపీ అమలవుతోందా? వొకేషనల్ స్కిల్స్‌ను సిలబస్‌లో చేరుస్తారనే నేపథ్యంలో సిలబస్‌లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి? ఇప్పటికే ఉన్న జూనియర్ కాలేజీలను ఏమి చేస్తారు? అందులోని లెక్చరర్లు, సిబ్బందికి ఇబ్బంది ఉండదని సీఎం చూచాయిగా చెప్పినప్పటికీ నిర్దిష్టంగా వివరాలు రావాల్సి ఉంది. 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4వేలకు పునర్వ్యవస్థీకరిస్తానని గతంలో ముఖ్యమంత్రి చెప్పిన మాటలపై ఆందోళన నెలకొంది. మరీ ముఖ్యంగా కార్పొరేట్ విద్యాసంస్థలను, ప్రైవేటు సంస్థల ఫీజులను ఏ విధంగా నియంత్రించబోతున్నారు? కృత్రిమ మేథతో అనేక ఉపాధి రంగాలకు ప్రమాదం ఏర్పడింది. దానిని అధిగమించేందుకు కరిక్యూలమ్‌లో తీసుకువచ్చే మార్పులేమిటి? ఇలాంటి అనేక ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానాలు రావాల్సి ఉంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలనే పట్టుదల మెండు. అందుకే విద్యా శాఖను మంత్రివర్గంలో తన వద్దే ఉంచుకున్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, కొత్త రిక్రూట్మెంట్, యూనివర్సిటీలలో ఖాళీల భర్తీకి చర్యలు, బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం, యూనిఫామ్, ఎడ్యుకేషన్ కిట్, లైబ్రరీలు తదితర కొన్ని సంస్కరణలు కూడా తీసుకువచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నర్సరీ నుంచి ప్లస్ టూ వరకు ఉచిత రెసిడెన్షియల్ విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణాలను పలుచోట్ల చేపట్టారు. అయితే, వచ్చే ఏడాది నుంచి నూతన మార్పులు తీసుకువస్తున్నట్లు చేసిన ప్రకటనలో కావాల్సిన స్పష్టత కొరవడింది. దీంతో ప్రజల్లో అనేక సందేహాలు ముప్పిరిగొని ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే పూర్తి వివరాలు వెల్లడించి, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, విద్యారంగ ప్రముఖులు, ఉపాధ్యాయ, అధ్యాపక రంగంలో నిష్ణాతులతో సమావేశం ఏర్పాటు చేసి లోటుపాట్లను సరి చేయాల్సిన తక్షణ అవసరం ఉంది. సమయం తక్కువగా ఉన్నందున ఏకపక్షంగా కాకుండా ప్రభుత్వం విస్తృతాభిప్రాయాల సమాహారంతో వచ్చే విద్యా సంవత్సరంలో సమగ్ర మార్పులకు శ్రీకారం చుడితేనే సత్ఫలితాలు సాధ్యం.