Skip to content
ఆంధ్రప్రదేశ్ › వార్తలు

ఎ.పి. స్థానిక ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షం

Prajapaksham 10 Nov 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
ఎ.పి. స్థానిక ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు గత 10 రోజుల్లో నిర్వహించిన ఎన్నికల్లో ఫలితాలు పాలక టిడిపి, జనసేన, బిజెపి కూటమికి అనుకూలంగా దాదాపు ఏకపక్షంగా వచ్చాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి సాధించిన విజయాలను మించి ఈ ఎన్నికల్లో ఓటర్లు తమకు ఓట్లు, సీట్లు, స్ట్రయిక్‌ రేట్‌ (విజయశాతం) ఇచ్చారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. తాము అధికారం చేబట్టిన దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత జరిగిన ఈ స్థానిక ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు తమ పాలనకు వారి ఆశీర్వాదమంటూ, ఇది తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పాలన రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందన్న ఆరోపణను పునరుద్ఘాటిస్తూ, విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెడుతూ, ‘అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నామన్నారు. ఈ ఎన్నికల్లో పాలక కూటమి నామినేషన్‌ల దాఖలు నుంచి, పోలింగ్‌, ఓట్ల లెక్కింపు వరకు హింసాకృత్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ప్రతిపక్ష వైసిపి, వామపక్షాలు ఘాటుగా విమర్శిస్తున్నాయి. 2021లో స్థానిక సంస్థల ఎన్నికల్లో నాటి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అభ్యర్థులు నామినేషన్‌లు వేయకుండా సాగించిన దాడులు, దౌర్జన్యాలు, హింసా కృత్యాలను గుర్తుకు తెచ్చుకుని మాట్లాడాలని తెలుగుదేశం నాయకులు హెచ్చరిస్తున్నారు. ఆనాడు బెదిరించి 21శాతం పదవులు ఏకగ్రీవం చేసుకున్న జగన్‌, ఈ పర్యాయం ఏకగ్రీవాలకు అంగీకరించవద్దని తమ నాయకులకు, కార్యకర్తలకు హితవు చెప్పారు. ఎదురయ్యే దౌర్జన్యాలను ఊహించే కావచ్చు మన టార్గెట్‌ 2029 అసెంబ్లీ ఎన్నికలని, ఆ ఎన్నికలకు క్యాడర్‌ను సిద్ధం చేయాలంటే ఈ ఎన్నికల్లో నాయకులు కార్యకర్తలకు అండగా ఉండాలన్నారు. అయితే తన సొంత నియోజకవర్గం పులివెందులలో పోలింగ్‌ రోజు కాసేపు అలజడి సృష్టించటం మినహా ఆయన స్వయంగా ఏ జిల్లాలో పర్యటించలేదు. కంచుకోట పులివెందుల మున్సిపాలిటీ, కడప కార్పొరేషన్‌ సహా జిల్లాలోని మొత్తం 9 పురపాలికలను, జిల్లా పరిషత్‌ను ఎన్నికల చరిత్రలో తొలిసారి టిడిపి కోల్పోవటం నైతికంగా ఆ పార్టీకి దెబ్బ. గత అసెంబ్లీ ఎన్నికల్లో ‘వై నాట్‌ కుప్పం’ అన్న వ్యక్తి పులివెందులను కోల్పోవటం వైఎస్‌ కుటుంబ తిరుగులేని ఆధిపత్యానికి గండికొట్టింది.

ఈ స్థానిక ఎన్నికలు ప్రత్యేక పరిస్థితుల్లో జరిగాయి. ముఖ్యంగా నెల్లూరు నుంచి విశాఖపట్నం వరకు కోస్తాను అతలాకుతలం చేసిన రెండు తుపానుల మధ్య (అర్ణవ్‌, మురసు) మున్సిపల్‌ సంస్థలకు, ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికల నిర్వహణ జరిగింది. పెద్దగా ఎన్నికల ప్రచారం లేదు. అయినా ఓటర్లు రికార్డు స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. 13 మున్సిపల్‌ కార్పొరేషన్స్‌లో 12 (అనంతపురం మినహా) టిడిపి కూటమికి కట్టబెట్టారు. ఇక్కడ కూడా అత్యధిక వార్డులు కూటమివే. 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైసికి మూడే దక్కాయి. కాగా 28జిల్లా పరిషత్‌లలో 27(అల్లూరిజిల్లా) కూటమిని వరించాయి. 7 కార్పొరేషన్స్‌లో ప్రతిపక్షమే లేదు. మండల పరిషత్‌ల్లో ఆ దామాషా కొంత తగ్గింది. తమ కూటమికి 2024 అసెంబ్లీ ఎన్నికలకన్నా 3.6శాతం ఓట్లు పెరిగి 58.9శాతం చేరుకున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. కాగా వైసిపి ఓటు 398శాతం నుంచి 33.56శాతానికి తగ్గింది. మొత్తంమీద కూటమి మధ్య ఓట్ల వ్యత్యాసం 25.34 శాతానికి చేరిందని బాబు చెప్పారు.

ఇవి గణాంకాలు ఎవరూ నిరాకరించలేరు. అయితే ఎన్నికలు పాలక కూటమి చెప్పుకుంటున్నట్లు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగాయా? స్థానిక ఎన్నికల ఫలితాలు సర్వసాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ లేదా కూటమికి అనుకూలంగానే వస్తాయి. కూటమి గెలుపొందిన 94 మేయర్‌, మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ సీట్లలో అతి పెద్దభాగం(70) టిడిపిదే. జనసేన 20, బిజెపి 4. కాగా జిల్లా పరిషత్‌లు టిడిపి స్వీప్‌ చేసింది. అది కొన్ని చైర్‌పర్సన్‌ పదవులను మిత్రధర్మంగా వదులుకోవలసి ఉంటుంది. అయితే పాలక కూటమి చెప్పుకుంటున్నట్లు ఎన్నికలు పూర్తిగా ప్రశాంతం కాదు. పాత ఫ్యాక్షన్‌ ప్రాంతాల్లో, ముఖ్యంగా రాయలసీమ, పల్నాడు జిల్లాలో కొన్ని పరిమిత ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు ప్రధానంగా జరిగాయి. కొన్ని చోట్ల కూటమి నాయకులు ప్రత్యర్థులను అడ్డగించారు, చెదరగొట్టారు, నామినేషన్‌ పత్రాలు లాక్కొని చించివేశారు, నామినేషన్‌ కేంద్రాల్లో, కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సైతం హింస చోటు చేసుకుంది. టిడిపి కూటమి అధికారం అండతో ఏకపక్ష ఆధిపత్యం కోసం ప్రయత్నించటం, పాత ఫ్యాక్షనిస్టులు తమ పెత్తనం నిలుపుకోవటానికై ప్రతిఘటించటమే ఈ దౌర్జన్యాలు, హింసకు హేతువు. సహజసిద్ధ సూత్రం ప్రకారం పాలక కూటమిది పైచేయి అయింది. అయితే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు హింసాత్మక ఘటనలు సంభవించకపోవటం, ఓటర్లు వర్షపు నీటిలో సైతం ఉత్సాహంగా వచ్చి అత్యధికశాతం పోలింగ్‌ నమోదు చేయటంపై హింసాత్మక ఘటనలను చూచి విస్మరించదగినది కాదు. జగన్మోహన్‌రెడ్డి రాజధాని ‘మావిగన్‌’ ప్రాంతం మొత్తం కూటమి అభ్యర్థులను గెలిపించటం కొసమెరుపు.

ట్యాగ్‌లు: andhra pradesh