Skip to content
తెలంగాణ › వార్తలు

Telangana High Court: కోర్టు ధిక్కరణ కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..

jagan 09 Nov 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telangana High Court: కోర్టు ధిక్కరణ కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..

TS High court

Telangana High Court: న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డికి తెలంగాణ హైకోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. శిక్షతో పాటు రూ.2,000 జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. జస్టిస్ కె.లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు సంచలన తీర్పును వెలువరించింది. అయితే, ఈ తీర్పుపై కలెక్టర్ ఎగువ కోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును నాలుగు వారాల పాటు నిలిపివేస్తూ ధర్మాసనం ఊరటనిచ్చింది.

రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని సెక్షన్ 22-ఏ ప్రకారం నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న కొన్ని ప్లాట్లను ఆ జాబితా నుండి తొలగించాలంటూ బాధితులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ప్లాట్ల యజమానుల వినతిని పరిశీలించి, చట్టబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని 2025 ఆగస్టులో జిల్లా కలెక్టర్‌ను కోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని 60 రోజుల్లోగా పూర్తి చేయాలని అప్పట్లో స్పష్టం చేసింది.

కోర్టు విధించిన గడువు ముగిసినప్పటికీ కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, బాధితులు 2025 అక్టోబరు 15న హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలైన తర్వాత మాత్రమే యంత్రాంగం స్పందించి, బాధితులకు నోటీసులు ఇస్తూ 2026 ఫిబ్రవరి 26న వారి వినతిని తిరస్కరించింది. ఆ తర్వాత మళ్లీ 2026 జులై 8న మరొకసారి తిరస్కరణ ఉత్తర్వులను జారీ చేసింది.

కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైన తర్వాతే అధికారులు కదలడం, నిర్దేశిత గడువులోగా చర్యలు తీసుకోకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కలెక్టర్ ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను ధిక్కరించారని నిర్ధారించింది. ఐఏఎస్ (IAS) స్థాయి బాధ్యతాయుత అధికారి న్యాయస్థాన ఉత్తర్వులను ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేస్తూ హైకోర్టు ఈ జైలు శిక్షను ఖరారు చేసింది.

ట్యాగ్‌లు: Telangana Telangana High Court