National Education Day 2026: జాతీయ విద్యా దినోత్సవం.. నవంబర్ 11న ఎందుకు జరుపుకుంటారు.. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి చరిత్ర గురించి తెలుసుకోండి..
National Education Day 2026
National Education Day 2026: స్వాతంత్ర్యానంతరం భారతదేశపు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా సేవలు అందించిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్ 11వ తేదీన దేశవ్యాప్తంగా ‘జాతీయ విద్యా దినోత్సవాన్ని’ జరుపుకుంటారు. వలస పాలనలోని చీకటి రోజుల నుంచి దేశ విద్యా వ్యవస్థను బయటకు తీసుకువచ్చి.. నూతన గుర్తింపును అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రాంచీ జైలులో నిర్బంధం ఎదుర్కోవడం నుంచి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IITలు), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) వంటి ప్రతిష్టాత్మక జాతీయ సంస్థల స్థాపన వరకు విద్యా రంగానికి ఆయన అందించిన సేవలు అసమానమైనవి.
భారత విద్యా వ్యవస్థకు మౌలానా ఆజాద్ చేసిన నిరుపమాన సేవలకు నివాళులర్పిస్తూ.. నాటి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ప్రస్తుత విద్యా మంత్రిత్వ శాఖ) 2008లో ఆయన జయంతిని ‘జాతీయ విద్యా దినోత్సవం’గా ప్రకటించింది. ఆ ఏడాది దేశ తొలి జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు జరిగాయి.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1888 నవంబర్ 11న మక్కాలో పండితులైన మౌలానా ఖైరుద్దీన్, ఆలియా దంపతులకు జన్మించారు. చిన్నతనంలో ఫిరోజ్ బఖ్త్ అని పిలువబడిన ఆయన, కాలక్రమేణా అబుల్ కలాంగా ప్రసిద్ధి చెందారు. అసాధారణమైన మేధస్సు కలిగిన ఆయన.. కేవలం 10 ఏళ్ల వయస్సులోనే ఖురాన్‌లో ప్రావీణ్యం సాధించి, 17 ఏళ్ల నాటికే వేదాంతిగా గుర్తింపు పొందారు. కైరోలోని ‘అల్ అజార్’ యూనివర్శిటీలో చదివిన విద్యాభ్యాసం ఆయన జ్ఞానాన్ని మరింత పెంచింది. కలకత్తాలో ‘లిసాన్-ఉల్-సిద్క్’ పత్రికను ప్రారంభించిన ఆజాద్, ప్రముఖ ఉర్దూ రచయితలు షిబ్లీ నోమానీ, అల్తాఫ్ హుస్సేన్ హాలీ లచే ప్రభావితమయ్యారు.
1905 నాటి బెంగాల్ విభజన సమయంలో మత ప్రాతిపదికన జరిగిన విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆజాద్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఐక్య భారతదేశాన్ని సమర్థిస్తూ శ్రీ అరబిందో ఘోష్ వంటి నాయకులతో కలిసి విప్లవాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్నారు. హిందూ-ముస్లిం ఐక్యతకు గట్టి మద్దతుదారుడైన ఆయన.. 1947 నాటి దేశ విభజనను దృఢంగా నిరసించారు. 1912లో ఆయన ప్రారంభించిన ఉర్దూ పత్రిక ‘అల్-హిలాల్’ ఆయన ఉదారవాద, హేతువాద భావాలను, బ్రిటిష్ దోపిడీ పట్ల నిరసనను ప్రతిబింబించింది. ఇరాక్, సిరియా, ఈజిప్టు దేశాల పర్యటనలు ఆయన రాజకీయ ఆలోచనలను మరింత పరిణతి చెందించాయి.
1947లో స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే మౌలానా ఆజాద్.. దేశపు తొలి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో ఆహారం, దుస్తుల తర్వాత విద్యకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, జాతీయ బడ్జెట్‌లో దానికి తగిన నిధులు కేటాయించాలని ఆయన బలంగా వాదించారు. ఆజాద్ 1950లో ‘ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్’ (ICCR)ను స్థాపించారు. బ్రిటిష్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన భారతీయ సంస్కృతిని పునరుద్ధరించేందుకు 1953లో సంగీత నాటక అకాడమీ, 1954లో సాహిత్య అకాడమీ , లలిత్ కళా అకాడమీలను ఏర్పాటు చేశారు.
కేంద్ర విద్యా సలహా మండలి ఛైర్మన్‌గా 14 ఏళ్ల లోపు పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను, బాలికల విద్యను, వృత్తి శిక్షణను సమర్థించారు. ఉన్నత విద్యారంగంలో విద్యా ప్రమాణాల పరిరక్షణకు, విశ్వవిద్యాలయాలకు ఆర్థిక సాయం అందించేందుకు 1956లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే సాగాలని చెప్తూనే, ఉన్నత విద్య , అంతర్జాతీయ అనుసంధానానికి ఆంగ్ల భాష అవసరమని పేర్కొన్నారు.
సాంకేతిక విద్యకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన ఆజాద్ హయాంలోనే 1951లో దేశంలో తొలి ఐఐటీగా ‘ఐఐటీ ఖరగ్‌పూర్’ ప్రారంభమైంది. ఆ తర్వాత బొంబాయి, మద్రాస్, కాన్పూర్, ఢిల్లీలలో ఐఐటీల ఏర్పాటుకు పునాదులు పడ్డాయి. 1955లో ఢిల్లీలోని ‘స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్’ కూడా ఆయన హయాంలోనే రూపుదిద్దుకుంది.
యువతలో మత అసహనం పెరగకుండా ఉండాలంటే ప్రాథమిక దశలో మతాన్ని తోసిపుచ్చడం కాదని, ఆరోగ్యకరమైన, పటిష్టమైన లౌకిక విద్యా విధానాన్ని అందించడమే సరైన పరిస్కారమని ఆజాద్ విశ్వసించారు.
2008లో జరిగిన తొలి జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రసంగిస్తూ.. ఈ రోజును జరుపుకోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం దేశంలోని విద్యా సంస్థలను బలోపేతం చేయడం , విద్య నాణ్యతా ప్రమాణాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమేనని గుర్తుచేశారు. భారత్‌ను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు విద్యా రంగానికి చెందిన భాగస్వాములందరూ ఏకతాటిపైకి వచ్చి నిరంతరం కృషి చేయాలని ఆనాడు పిలుపునిచ్చారు.