Pannun Case: గుర్పత్వంత్ సింగ్ పన్నూ కేసు.. అజిత్ దోవల్‌కు అమెరికా సమన్లు.. తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ..
Ajit Doval
Pannun Case: ఖలిస్థానీ ఉగ్రవాది, ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ (SFJ) నాయకుడు గుర్పత్వంత్ సింగ్ పన్నూ దాఖలు చేసిన సివిల్ పిటిషన్ ఆధారంగా అమెరికా న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టు భారత ప్రభుత్వంతో పాటు పలువురు ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్, రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (RAW) మాజీ అధిపతి సమంత్ గోయల్‌లను కూడా ప్రతివాదులుగా చేర్చడంతో వారికి ఈ సమన్లు జారీ అయ్యాయి. దౌత్య మార్గాల ద్వారా అక్టోబర్ 9న అమెరికా విదేశాంగ శాఖ వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయానికి ఈ పత్రాలను పంపినట్లు వెల్లడైంది.
పన్నూ దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని ఆధారరహితం , దురుద్దేశపూరితం అని అభివర్ణించిన భారత విదేశాంగ శాఖ, భారత ఉన్నతాధికారులపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. అమెరికా పౌరసత్వం కలిగి ఉన్న గుర్పత్వంత్ సింగ్ పన్నూ తనను హత్య చేసేందుకు భారత ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపిస్తూ న్యూయార్క్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ ప్లాన్ కోసం నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని నియమించారని పేర్కొన్నాడు. ఈ వ్యవహారంలో అమెరికా ఇంటెలిజెన్స్, పోలీసు వర్గాలు జరిపిన దర్యాప్తు ఆధారంగా 2023 జూన్‌లో చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్లో నిఖిల్ గుప్తా అరెస్టయ్యాడు. అనంతరం అతడిని అమెరికాకు అప్పగించగా అక్కడ విచారణ ఎదుర్కొంటున్నాడు.
న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టు పన్నూ సివిల్ పిటిషన్‌పై విచారణ జరుపుతూ.. ఢిల్లీలోని స్థానిక కోర్టుల ద్వారా కూడా సమన్లను అందజేసే ప్రక్రియకు అనుమతినిచ్చింది. కాగా, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ ప్రతిష్టాత్మక హోదాలో ఉన్న భారత ఉన్నతాధికారులపై ఇటువంటి దురుద్దేశపూరిత ఆరోపణలు చేయడం చెల్లదని తెలిపారు. ఏవైనా అధికారిక న్యాయ పత్రాలను భారత్‌కు పంపాలనుకుంటే అవి కేవలం భారత న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా మాత్రమే ప్రక్రియ జరగాలని స్పష్టం చేశారు.