Cold Wave in Hyderabad: మహానగరాన్ని చుట్టుముట్టిన చలిగాలులు.. శివారు ప్రాంతాల్లో 12 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత
Cold Wave in Hyderabad
Cold Wave in Hyderabad: భాగ్యనగరాన్ని బుధవారం తెల్లవారుజామున శీతల గాలులు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. పగటిపూట ఆకాశం పూర్తిగా నిర్మలంగా ఉండి ఎండ కాస్తున్నప్పటికీ, రాత్రి వేళల్లో , తెల్లవారుజామున చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో చలిగాలుల ప్రభావం అధికంగా కనిపిస్తోంది. రాజేంద్రనగర్‌లో అత్యల్పంగా 12.0 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే 4.8 డిగ్రీలు తక్కువగా రికార్డయింది.
రాజేంద్రనగర్‌తో పాటు ఇతర శివారు ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. పటాన్చెరులో 12.6 డిగ్రీలు, కుత్బుల్లాపూర్‌లో 14.1 డిగ్రీలు, శేరిలింగంపల్లిలో 14.2 డిగ్రీలు, కూకట్‌పల్లిలో 14.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా అమీన్పూర్లో 14.9 డిగ్రీలు, బీహెచ్ఈఎల్లో 15.1 డిగ్రీలు, దుండిగల్‌లో 15.9 డిగ్రీలు, హకీంపేటలో 17.0 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
హైదరాబాద్ నగరం మొత్తం మీద సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 16.1 డిగ్రీలుగా నమోదైంది. శివారు ప్రాంతాలతో పోలిస్తే నగర కేంద్రంలోని ప్రాంతాల్లో దాదాపు ఐదారు డిగ్రీల వ్యత్యాసం కనిపిస్తోంది. ఖైరతాబాద్, అబిడ్స్, కోఠి, అంబర్‌పేట, చార్మినార్ వంటి రద్దీ ప్రాంతాల్లో పగటిపూట ఎండ తీవ్రత, వేడి ఎక్కువగానే ఉంటోంది. రానున్న రోజుల్లో నగరంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.