Parking Dispute Turns Fatal: టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి కాల్చివేత వీడియో ఇదిగో.. పార్కింగ్ వివాదంతో దారుణంగా కాల్చిన పొరుగింటి వ్యక్తి.. సీసీటీవీ పుటేజీ రిలీజ్..
Paramjit Dhankhar Shot Dead
Parking Dispute Turns Fatal: టెక్ మహీంద్రా ఆసియా విభాగ మాజీ అధిపతి పరమ్‌జీత్ ధన్‌కర్ హత్యకు సంబంధించిన దారుణ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కారు పార్కింగ్ విషయంలో పొరుగింటి వ్యక్తితో తలెత్తిన స్వల్ప వివాదం నిండు ప్రాణాన్ని బలిగొనగా, తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. నిందితుడు మోనూ శర్మ అత్యంత కిరాతకంగా, విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన తీరు ఈ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది.
పోలీసులు విడుదల చేసిన సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. కారు పార్కింగ్ అంశంపై పరమ్‌జీత్ ధన్‌కర్, పొరుగింటి నిందితుడు మోనూ శర్మ మధ్య వాగ్వాదం జరిగింది. పరమ్‌జీత్ మాట్లాడుతుండగానే, టీషర్టు ధరించి ఉన్న మోనూ శర్మ అకస్మాత్తుగా తన ప్యాంటు జేబులో నుంచి లైసెన్స్‌డ్ తుపాకీని బయటకు తీసి కాల్పులు ప్రారంభించాడు. కేవలం 5 సెకన్ల వ్యవధిలోనే మల్టిపుల్ రౌండ్లు కాల్చడంతో, పక్కనే ఉన్న పరమ్‌జీత్ కుమారుడు ప్రాణభయంతో పరుగులు తీశాడు. బుల్లెట్ల వర్షం కురుస్తుండటంతో పరమ్‌జీత్ తప్పించుకునేందుకు బిల్డింగ్ గేటు తీసి పరుగెత్తే ప్రయత్నం చేసినప్పటికీ నిందితుడు వదిలిపెట్టలేదు.కుప్పకూలి పడిపోయిన పరమ్‌జీత్ వద్దకు ఓ వృద్ధ మహిళ వచ్చి నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది.
అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గని మోనూ శర్మ, తన తుపాకీని తిరిగి రీలోడ్ చేసి మరీ పరమ్‌జీత్‌పై కాల్పులు జరిపాడు. కాల్పులు జరుపుతున్న సమయంలో నిందితుడు “హ్యాపీ దీపావళి, ముబారక్.. అందరినీ చంపేస్తా, అందరినీ చంపాకే వెళ్లిపోతా” అంటూ గట్టిగా అరుస్తున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. నిందితుడు తన లైసెన్స్‌డ్ తుపాకీతో మొత్తం 15 రౌండ్లు కాల్పులు జరపగా, అందులో 9 తూటాలు పరమ్‌జీత్ శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.సింగపూర్‌లో నివాసముంటున్న పరమ్‌జీత్ ధన్‌కర్ తన మేనల్లుడి వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు భారత్‌కు వచ్చారు.
అయితే, పరమ్‌జీత్ కుటుంబానికి, పొరుగింట్లో ఉండే మోనూ శర్మ కుటుంబానికి మధ్య గత కొంతకాలంగా కారు పార్కింగ్, పెంపుడు కుక్క మూత్ర విసర్జన వంటి చిన్నచిన్న విషయాల్లో తరచూ గొడవలు జరిగేవని దర్యాప్తులో తేలింది. గత శుక్రవారం రాత్రి మరోసారి కారు పార్కింగ్ విషయంలో మొదలైన ఘర్షణ ఈ దారుణ హత్యకు దారితీసింది. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే ప్రధాన నిందితుడు మోనూ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ హత్య కేసులో మోనూ శర్మతో పాటు అతని భార్య, కుమార్తె, కుమారుడు మరియు సోదరుడిని కూడా నిందితులుగా చేర్చాలని బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.