Skip to content
క్రైమ్ › వార్తలు

Husband Sues OpenAI: ChatGPTతో భర్త హత్యకు భార్య కుట్ర? OpenAIపై అమెరికా వ్యక్తి సంచలన దావా

jagan 06 Nov 2026 1 నిమిషాల పఠనం క్రైమ్
Husband Sues OpenAI: ChatGPTతో భర్త హత్యకు భార్య కుట్ర? OpenAIపై అమెరికా వ్యక్తి సంచలన దావా

Open AI

Husband Sues OpenAI:ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత దుర్వినియోగంపై అమెరికాలో ఒక సంచలనాత్మక న్యాయ పోరాటం మొదలైంది. తన భార్య తనను పక్కా పథకం ప్రకారం హత్య చేయడానికి ప్రయత్నించిందని.. ఈ కుట్రను అమలు చేయడానికి ఓపెన్ఏఐ (OpenAI) అభివృద్ధి చేసిన ‘చాట్‌జీపీటీ’ (ChatGPT) చాట్‌బాట్ సాయపడిందని ఆరోపిస్తూ ఒక వ్యక్తి నార్త్ కరోలినా కోర్టును ఆశ్రయించాడు. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్ఏఐతో పాటు దాని సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) లను కూడా ఈ దావాలో నేరుగా ప్రతివాదులుగా చేర్చడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

‘బ్లూమ్‌బర్గ్’ ప్రచురించిన కథనం వివరాల ప్రకారం.. నార్త్ కరోలినాకు చెందిన జేమ్స్ గేట్స్, ఆయన భార్య చెరిల్ గేట్స్‌ల మధ్య విడాకుల ప్రక్రియ నడుస్తోంది. ఈ క్రమంలో 2025 సెప్టెంబర్‌లో జేమ్స్ తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలు, కడుపునొప్పి , గందరగోళంతో అనారోగ్యానికి గురయ్యారు. అనంతరం ఆయనకు భార్య రాసిన ఒక రహస్య చేతిరాత నోట్ లభించింది. అందులో ప్రాణాంతక విషపదార్థాల పేర్లు, వాటి మోతాదుల వివరాలతో పాటు పైభాగంలో “చాట్‌జీపీటీ సంభాషణలు తొలగించు”, “లాగ్ అవుట్ చేయి” అని రాసి ఉండటంతో జేమ్స్‌కు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే 2025లో నమోదైన ఈ కేసులో తగిన ఆధారాలు లేవనే నెపంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రాసిక్యూటర్లు చెరిల్‌పై కేసును కొట్టివేశారు. దీంతో జేమ్స్ నేరుగా ఓపెన్ఏఐపైనే దావా వేశారు.

దావాలో జేమ్స్ న్యాయవాదులు సమర్పించిన స్క్రీన్‌షాట్ల ప్రకారం.. మొదట్లో సాధారణ అవసరాలకు చాట్‌జీపీటీని వాడిన చెరిల్, ఆ తర్వాత భర్తతో ఉన్న విభేదాలను చాట్‌బాట్‌తో పంచుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆమె ఆలోచనలకు చాట్‌బాట్ ఒక ‘ఎకో ఛాంబర్’లా మారి ఆమె భ్రమలను మరింత పెంచింది. అనంతరం ఆత్మరక్షణ నెపంతో “ఒలియాండర్ (గన్నేరు) మొక్క విషపూరితమా?” అని చాట్‌జీపీటీని ప్రశ్నించింది. ఎంత మోతాదు ప్రాణాంతకమో, ఆహారంలో దానిని ఎలా దాచవచ్చో వివరాలను పొందింది. అంతేకాకుండా, “శవపరీక్షలో ఒలియాండర్ ఆనవాళ్లు దొరుకుతాయా?” అని అడగ్గా, “ఇది కీలకమైన ప్రశ్న – మీరు సరైన కారణంతోనే అడుగుతున్నారు” అని చాట్‌జీపీటీ స్పందించినట్లు కోర్టుకు తెలిపిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ కేసు వివాదాస్పదంగా మారడంతో ఓపెన్ఏఐ సంస్థ అధికారికంగా స్పందించింది. తాము యూజర్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, కేసు దర్యాప్తు అధికారులకు తగిన సాంకేతిక సమాచారాన్ని అందించామని పేర్కొంది. నియమ నిబంధనలను ఉల్లంఘించిన సదరు మహిళ ఖాతా (చెరిల్ గేట్స్) ను ప్లాట్‌ఫామ్ నుంచి పూర్తిగా నిషేధించినట్లు వెల్లడించింది. గతంలో కూడా ఇలాంటి కేసులలో ఏఐ కంపెనీలు.. చాట్‌బాట్‌లు ఇచ్చే సమాచారం వాక్ స్వాతంత్య్రం కిందకు వస్తుందని, వినియోగదారులు వ్యక్తిగతంగా చేసే నేరాలకు ఏఐ కంపెనీలకు ప్రత్యక్ష బాధ్యత ఉండదని కోర్టులలో వాదించిన దాఖలాలు ఉన్నాయి.