Skip to content
ప్రపంచం › వార్తలు

Harmeet Dhillon Resigns: ట్రంప్ ప్రభుత్వలో తొలి వికెట్ పడింది.. పౌర హక్కుల విభాగం చీఫ్ హర్మీత్ థిల్లాన్ రాజీనామా.. కారణం ఏంటంటే..

jagan 06 Nov 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
Harmeet Dhillon Resigns: ట్రంప్ ప్రభుత్వలో తొలి వికెట్ పడింది.. పౌర హక్కుల విభాగం చీఫ్ హర్మీత్ థిల్లాన్ రాజీనామా.. కారణం ఏంటంటే..

Harmeet Dhillon Resigns

Harmeet Dhillon Resigns: అమెరికా మధ్యంతర (Midterm) ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వేళ, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. యూఎస్ న్యాయ శాఖలోని (DOJ) పౌర హక్కుల విభాగం (Civil Rights Division) చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారత సంతతి న్యాయవాది, ట్రంప్ గట్టి మద్దతుదారు హర్మీత్ కౌర్ థిల్లాన్ తన పదవికి రాజీనామా చేశారు. మధ్యంతర ఫలితాల అనంతరం వైట్‌హౌస్ యంత్రాంగం నుంచి వైదొలిగిన తొలి సీనియర్ ర్యాంకింగ్ అధికారిణి ఈమె కావడం గమనార్హం.

హర్మీత్ థిల్లాన్ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు అమెరికా అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (X) ద్వారా వెల్లడించారు. “గడిచిన 18 నెలలుగా పౌర హక్కుల విభాగాన్ని హర్మీత్ దృఢ నిశ్చయంతో నడిపించారు. ప్రతి అమెరికన్ పౌర స్వేచ్ఛను కాపాడుతూ చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేశారు. ఆమె సేవలకు న్యాయ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం” అని పేర్కొన్నారు

కాగా, తన రాజీనామా నిర్ణయం ఫలితాల ప్రకటనకు ముందే జరిగిందని హర్మీత్ థిల్లాన్ ‘ఫాక్స్ న్యూస్’ (Fox News) ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. మధ్యంతర ఎన్నికలకు నెల రోజుల ముందే తాను రాజీనామా పత్రాన్ని సమర్పించినప్పటికీ, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పదవిలో కొనసాగాలని ట్రంప్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్ కోరడంతో ఆగినట్లు తెలిపారు. సాధారణంగా అమెరికా రాజ్యాంగ సంప్రదాయం ప్రకారం, మధ్యంతర ఎన్నికలు ముగిసిన వెంటనే అధ్యక్షుడు తన క్యాబినెట్, యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించుకోవడానికి వీలుగా సీనియర్ అధికారులు తమ పదవుల నుంచి వైదొలుగుతుంటారు.

ట్రంప్‌కు , రిపబ్లికన్ పార్టీ విధానాలకు తీవ్ర మద్దతుదారు అయినప్పటికీ, కొన్ని విషయాల్లో ఆమె స్వతంత్రంగా వ్యవహరించారు. ముఖ్యంగా వలసదారుల ముసుగులో అమెరికాలోని సిక్కు ట్రక్కు డ్రైవర్లను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఆమె బహిరంగంగా ఖండించారు. గత ఆగస్టులో జరిగిన ఒక రోడ్డు ప్రమాదాన్ని అదనుగా చేసుకుని సిక్కు డ్రైవర్లపై దాడులకు దిగడాన్ని తప్పుపడుతూ.. “అమెరికాలో చట్టబద్ధంగా ఉంటూ కష్టపడే సిక్కు డ్రైవర్లు అత్యంత దేశభక్తి కలిగిన పౌరులఅని సోషల్ మీడియా ద్వారా మద్దతుగా నిలిచారు.

తన 18 నెలల సేవా కాలంలో హర్మీత్ అనేక కీలక మార్పులు తెచ్చారు. సాంప్రదాయకంగా మైనారిటీల ఓటు హక్కు పరిరక్షణపై దృష్టి పెట్టే పౌర హక్కుల విభాగాన్ని.. మత స్వేచ్ఛ, యూదు వ్యతిరేకతపై పోరాటం, తుపాకీ హక్కుల పరిరక్షణ , మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్ల భాగస్వామ్య నియంత్రణ వైపు మళ్లించారు. చండీగఢ్‌లో జన్మించి చిన్నతనంలోనే కుటుంబంతో కలిసి యూకే, ఆ తర్వాత అమెరికాకు వలస వచ్చిన హర్మీత్, 2024 రిపబ్లికన్ జాతీయ సమావేశంలో (RNC) సిక్కు సంప్రదాయ ప్రార్థన ‘అర్దాస్’ నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.