Adulterated Milk: హైదరాబాద్‌లో కల్తీ పాల కలకలం.. రంగారెడ్డి జిల్లాలో గుట్టురట్టు.. 100 లీటర్ల పాలు స్వాధీనం
Adulterated Milk
Adulterated Milk: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ రసాయనాలతో కల్తీ పాలను తయారుచేస్తున్న ఒక ముఠా గుట్టును మహేశ్వరం జోన్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) పోలీసులు రట్టు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కల్తీ పాల తయారీ కేంద్రంపై గురువారం రాత్రి ఎస్‌వోటీ పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ దందాకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో పాటు తయారీకి ఉపయోగిస్తున్న ప్రమాదకర రసాయనాలు, పాలపొడిని స్వాధీనం చేసుకున్నారు.
పోచారం గ్రామానికి చెందిన ఆండే శ్రీశైలం (43) అనే వ్యక్తి స్వగృహంలోనే రహస్యంగా ఈ సింథటిక్ పాల తయారీ కేంద్రాన్ని నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించేందుకు పాల పొడికి నీళ్లు కలపడంతో పాటు, పాలు విరిగిపోకుండా , చిక్కగా కనిపించేందుకు తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీసే ‘హైడ్రోజన్ పెరాక్సైడ్’ (Hydrogen Peroxide) అనే ప్రమాదకర రసాయనాన్ని మిశ్రమంలో కలుపుతున్నట్లు దర్యాప్తులో తేలింది. పక్కా సాంకేతిక సమాచారంతో ఎస్‌వోటీ బృందం దాడి చేసి నిందితుడిని నిర్బంధంలోకి తీసుకుంది.
ఘటనా స్థలం నుంచి పోలీసులు 100 లీటర్ల తయారుచేసిన కల్తీ పాలను, 35 కిలోల ‘ధోల్‌పూర్’ బ్రాండ్ పాలపొడిని, అలాగే ఒక లీటరు హైడ్రోజన్ పెరాక్సైడ్ కెమికల్‌ను జప్తు చేశారు. ఈ కల్తీ పాలను ప్రతిరోజూ ఉదయాన్నే హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లోని హోటళ్లు, డెయిరీలు , సాధారణ వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో నిందితుడు అంగీకరించాడు. నిందితుడిపై ఆహార కల్తీ నిరోధక చట్టాల కింద కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. ఈ కల్తీ పాల సరఫరా నెట్‌వర్క్ వెనుక ఇంకా ఎవరైనా వ్యాపారులు ఉన్నారా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.