Strait of Hormuz: హార్ముజ్ జలసంధి తెరవాలంటే ఇరాన్ షరతులు అంగీకరించాల్సిందే.. అమెరికా ముందు టెహ్రాన్ ఏడు కండీషన్లు..
Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిని తెరవాలంటే ఇరాన్‌తో ట్రంప్ రాజీ పడాల్సిందే
Strait of Hormuz: అమెరికా-ఇరాన్‌ల మధ్య తీవ్ర సైనిక ఉద్రిక్తతలు , ప్రాంతీయ యుద్ధ వాతావరణం కొనసాగుతున్న తరుణంలో దౌత్యపరంగా ఒక సంచలన ముందడుగు పడింది. గల్ఫ్ దేశం ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ సర్కార్ అమెరికాకు ఒక అణు ఒప్పంద (Nuclear Proposal) ప్రతిపాదనను చేరవేసింది. అయితే, తమతో దౌత్యపరమైన చర్చలు ప్రారంభించాలన్నా లేదా వ్యూహాత్మక ప్రాంతమైన ‘హార్మూజ్ జలసంధి’ (Strait of Hormuz) ని పునరుద్ధరించాలన్నా అమెరికా ముందుగా తమ ‘ఏడు షరతులను’ (7 Conditions) భేషరతుగా నెరవేర్చాలని తేహ్రాన్ స్పష్టం చేసింది. ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ పంపిన ఈ ప్రతిపాదన ప్రాధాన్యత సంతరించుకుంది.
అంతర్జాతీయ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ (Reuters) ప్రచురించిన కథనం ప్రకారం, ఇరాన్ పంపిన ఈ నూతన ప్రతిపాదన పత్రాన్ని వాషింగ్టన్‌లోని అమెరికా యంత్రాంగం పరిశీలిస్తున్నట్లు ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. దీనికి ముందే ఇరాన్ భద్రతా మండలి అధికారి మొహసెన్ రెజాయీ (Mohsen Rezaee) స్పందిస్తూ.. “అమెరికా ముందు మేం 7 స్పష్టమైన షరతులు ఉంచాం. ఆ డిమాండ్లను వాషింగ్టన్ నెరవేర్చే వరకు హార్మూజ్ జలసంధిని తెరవబోం, దౌత్యపరమైన చర్చల ప్రసక్తే లేదు” అని కుండబద్దలు కొట్టారు.
ఇరాన్ ఏడు షరతుల్లోని కీలక అంశాలు:
ఇరాన్ అధికారికంగా తమ షరతుల జాబితాను బహిర్గతం చేయనప్పటికీ, దౌత్య వర్గాల సమాచారం ప్రకారం ఆ షరతులలో ఇవే ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది:
- లెబనాన్‌తో సహా తమపై , తమ భాగస్వామ్య బలగాలపై అమెరికా అన్ని రకాల శత్రుత్వాలను నిలిపివేయడం.
- ఇరాన్ కీలక ఓడరేవులపై విధించిన అమెరికా నావికా దిగ్బంధనాన్ని (Naval Blockade) తక్షణమే ఎత్తివేయడం.
- ఇరాన్‌పై ఉన్న ఆర్థిక ఆంక్షలన్నింటినీ పూర్తిగా తొలగించడం.
- వివిధ విదేశీ బ్యాంకుల్లో స్తంభింపజేసిన (Frozen Assets) ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం.
- పశ్చిమాసియా (మధ్యప్రాచ్యం) ప్రాంతం నుండి అమెరికా సైనిక బలగాలను వెనక్కి తగ్గించడం.
- యుద్ధం వల్ల ఇరాన్‌కు జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాలకు పరిహారం చెల్లించడం.
- ఇరాన్ సార్వభౌమ భూభాగంపై ఎలాంటి దాడులు చేయబోమని హామీ ఇవ్వడం.
అయితే ఏ రకమైన చర్చలు మొదలైనా, అవి కేవలం ఇరాన్ అణు కార్యక్రమ నిరోధం (Nuclear Restraint) అంశాలపైనే కేంద్రీకృతం కావాలని వాషింగ్టన్ పట్టుబడుతోంది.
ఫిబ్రవరి 28 నుంచి గల్ఫ్ రగులుతున్న తీరు
ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా ఇరాన్ అణు స్థావరాలపై దాడులు జరపడంతో ఈ ప్రాంతీయ యుద్ధం మొదలైంది. ప్రతికారంగా ఇరాన్.. ఇజ్రాయెల్‌పైనే కాకుండా అమెరికా సైనిక స్థావరాలున్న పలు గల్ఫ్ దేశాలపై క్షిపణి దాడులు చేసింది. ఈ వివాదం లెబనాన్‌లోని హిజ్బుల్లా , యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల వరకు పాకింది. సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలపై హౌతీల దాడులు ప్రపంచ ఇంధన రంగాన్ని ఊపేసాయి. అమెరికా మధ్యంతర ఎన్నికల (Midterm Elections) అనంతరం యుద్ధ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయన్న భయాల మధ్య, ఖతార్ జరిపిన ఈ దౌత్య ప్రయత్నంపై డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.