Jon Ossoff: 2028 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో జాన్ ఒసాఫ్.. ఒబామా తర్వాత డెమోక్రాట్లలో ఈ యువ నేతపైనే ఆశలు..
Jon Ossoff
Jon Ossoff: అమెరికా మధ్యంతర (Midterm) ఎన్నికలలో డెమోక్రాటిక్ పార్టీ చారిత్రక విజయాలు సాధించడంతో పాటు, జార్జియా రాష్ట్రం నుంచి సెనేటర్‌గా డెమోక్రటిక్ యువ నాయకుడు జాన్ ఒసాఫ్ (Jon Ossoff) విజయం సాధించడంతో ఆయన పేరు ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్‌కు గట్టి మద్దతు దక్కిన స్వింగ్ స్టేట్ జార్జియాలో రిపబ్లికన్ ప్రత్యర్థి మైక్ కాలిన్స్‌ను ఓడించి ఒసాఫ్ తన సెనేట్ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో.. 2028 నాటి వైట్‌హౌస్ (White House) అధ్యక్ష రేసులో డెమోక్రాట్ల తరఫున ఆయన ప్రధాన అభ్యర్థిగా ఎదిగే అవకాశాలున్నాయనే విశ్లేషణలు ఊపందుకున్నాయి.
ప్రస్తుతం 39 ఏళ్ల వయస్సు ఉన్న ఒసాఫ్‌ను పొలిటికల్ పండితులు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో (Barack Obama) పోలుస్తున్నారు. 2021లో 33 ఏళ్ల అతి చిన్న వయసులోనే తొలిసారి జార్జియా నుంచి సెనేట్‌లోకి అడుగుపెట్టిన ఆయన, ప్రసంగ శైలి, వక్తృత్వం, సోషల్ మీడియా వేదికలపై యువతను ఆకట్టుకునే తీరులో ఒబామాను గుర్తుచేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఒబామా కూడా ఈ ఎన్నికల ప్రచారంలో ఒసాఫ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తూ, పౌరహక్కుల నాయకుడు జాన్ లూయిస్ నుంచి నేర్చుకున్న సేవా విలువలతో ఒసాఫ్ నవతరం నాయకత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారని కొనియాడారు.
ఎన్నికల ప్రచారంలో , అట్లాంటా విజయ సభలో ఒసాఫ్ మాట్లాడుతూ.. ట్రంప్ యంత్రాంగంలో పెరిగిపోయిన అవినీతి , అసమర్థతను అమెరికా ప్రజలు ఈ ఎన్నికల తీర్పు ద్వారా స్పష్టంగా తిరస్కరించారని వ్యాఖ్యానించారు. “రాజకీయాల్లో అవినీతి అనేది కేవలం డబ్బుకే పరిమితం కాలేదు, అది నైతికమైన క్షీణత” అని ఉద్ఘాటిస్తూ పారదర్శకమైన ప్రజాస్వామ్యం కోసం పిలుపునిచ్చారు.
2028 అధ్యక్ష బరిలో దిగే ఆలోచన ప్రస్తుతం లేదని, ఆరేళ్ల సెనేట్ పదవీకాలాన్ని పూర్తిస్థాయిలో జార్జియా ప్రజల సేవకే అంకితం చేస్తానని ఒసాఫ్ గతంలో ప్రకటనలు చేసినప్పటికీ, ఈ తాజా విజయంతో డెమోక్రాటిక్ పార్టీలో భవిష్యత్తు నాయకుడిగా ఆయన పేరు తెరపైకి వచ్చింది. అయితే, 2028 అధ్యక్ష అభ్యర్థిత్వం (2028 Presidential Nomination) పై ఆయన వైపు నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.