Skip to content
తెలంగాణ › వార్తలు

Conductor Pravalika: కండక్టర్ ప్రవళికకు కన్నీటి వీడ్కోలు.. మణుగూరులో అంత్యక్రియలు.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన యువతి..

jagan 05 Nov 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Conductor Pravalika: కండక్టర్ ప్రవళికకు కన్నీటి వీడ్కోలు.. మణుగూరులో అంత్యక్రియలు.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన యువతి..

Conductor Pravalika

Conductor Pravalika: విధి నిర్వహణలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ గుండు ప్రవళిక (28) మృతి ఆర్టీసీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని, ఆగ్రహాన్ని నింపింది. అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద గత నెల 25న బస్సులోని తోపులాటలో ఒక ప్రయాణికురాలు తోసేయడంతో బస్సు టైర్ల కింద పడి తీవ్రంగా గాయపడిన ప్రవళిక, హైదరాబాద్‌లోని సాయి సంజీవని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచింది. బుధవారం మృతదేహాన్ని మణుగూరుకు తీసుకురాగా, తోటి ఉద్యోగులు, ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రవళిక మృతి నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని , ఆర్టీసీ సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు బుధవారం విధుల బహిష్కరణ, బంద్ నిర్వహించారు.

కండక్టర్ ప్రవళిక మృతికి నిరసనగా భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు డిపోల వద్ద ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. మధ్యాహ్నం వరకు బస్సులు డిపోలకే పరిమితం కాగా, మణుగూరు డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. ఈ బంద్ కారణంగా కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు డిపోల పరిధిలో సుమారు రూ. 44 లక్షల ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోయింది. మణుగూరులో ఆర్టీసీ జేఏసీ, ఔట్‌సోర్సింగ్ కండక్టర్ల ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి, అంబేడ్కర్ చౌరాస్తా వద్ద భారీ మానవహారం చేపట్టారు. ఈ నిరసనకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పూర్తి మద్దతు తెలిపాయి.

ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ వద్ద ప్రవళిక పార్థివదేహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి నివాళులర్పించారు. మృతురాలి తల్లి విజయలక్ష్మిని పరామర్శించిన మంత్రి, ప్రవళిక కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం , ఆర్టీసీ తరఫున రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించడంతో పాటు, ప్రమాద బీమా కింద బ్యాంకింగ్ నిబంధనల మేరకు రూ. 1 కోటి పరిహారం అందుతుందని వెల్లడించారు. భవిష్యత్తులో ఉద్యోగుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ ఘటనలో కండక్టర్‌ను తోసేసిన పిచుకలపాడుతండాకు చెందిన ప్రయాణికురాలు మౌనికపై పోలీసులు ఇదివరకు నమోదు చేసిన హత్యాయత్నం కేసును, కండక్టర్ మరణంతో ‘హత్య కేసు’గా మార్చి దర్యాప్తు చేస్తున్నట్లు అశ్వాపురం సీఐ ఎల్లయ్య తెలిపారు. ఇదిలా ఉండగా, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ప్రభుత్వం, దానికి తగ్గట్టుగా బస్సుల సంఖ్యను పెంచకపోవడం వల్లే బస్సుల్లో తీవ్ర రద్దీ పెరిగి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు విమర్శించారు. ప్రమాదానికి ముందు ప్రయాణికులను ఆత్మీయంగా ఆహ్వానిస్తూ ప్రవళిక చేసిన పాత వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఆమె ఆకస్మిక మృతిపై సహచరులు తీవ్రంగా విలపించారు.

ట్యాగ్‌లు: Telangana Telangana news TGSRTC