Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

ట్రంప్‌ అహంకారానికి అమెరికన్ల చెంపపెట్టు

Prajapaksham 05 Nov 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
ట్రంప్‌ అహంకారానికి అమెరికన్ల చెంపపెట్టు

US-Venezuela oil deal: వెనుజులా ఆయిల్ వ్యాపారంలోకి అమెరికా...మీకు మూరెడు...మాకు బారెడు : చమురు వ్యాపారంలో పెంటగాన్‌కు 35% వాటా..?

అమెరికా రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన నాయకత్వంలోని రిపబ్లికన్‌ పార్టీకి అమెరికా ఓటర్లు గట్టి హెచ్చరిక పంపిం చారు. అధికారంలో ఉన్న అధ్యక్షుడి రాజకీయ బలాన్ని అంచనా వేసే మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ ఆధిక్యం సాధించడం సాధారణ రాజకీయ పరిణామం కాదు. ట్రంప్‌ రెండో విడత పాలనపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి ఇది స్పష్టమైన సంకేతం. కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు ఆధిక్యతలోకి వచ్చారు. మొత్తం 435 ఓటింగ్‌ సభ్యుల్లో డెమొక్రాట్ల సంఖ్యా బలం కనీస మెజారిటీ సంఖ్య 218 దాటింది. కాగా ఎగువ సభ సెనేట్‌లో రిపబ్లికన్‌ల 52 బలం 46 తిరగబడినట్లు తెలుస్తున్నది. పూర్తి ఫలితాలు రావలసి ఉంది. రెండేళ్ల క్రితం ట్రంప్‌కు పట్టం కట్టిన ఓటర్లే ఇప్పుడు ఆయన విధానాలకు వ్యతిరేకంగా నిలబడటం అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం. టెక్సస్‌, జార్జియా, అయోవా, ఓహియో, ఉత్తర, దక్షిణ కరోనిలాలు, మియానె వంటి సంప్రదాయకంగా రిపబ్లికన్లకు అనుకూలమైన రాష్ట్రాలలో డెమోక్రాట్లు సాధించిన విజయాలు ఈ ఎన్నికల ప్రాధాన్యతను మరింత పెంచాయి. టెక్సస్‌లో డెమొక్రాట్లు జేమ్స్‌ టలారికో సెనేట్‌ స్థానాన్ని కైవసం చేసుకోవడం, గినా హినోజోసా గవర్నర్‌గా విజయం సాధించడం చారిత్రాత్మక పరిణామాలు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత టెక్సస్‌ నుంచి డెమోక్రటిక్‌ సెనేటర్‌ ఎన్నిక కావడం రిపబ్లికన్లకు గట్టి దెబ్బ. జార్జియాలో కీషా లాన్స్‌ బాటమ్స్‌, అయోవాలో రాబ్‌ సాండ్‌ విజయాలు కూడా ఇదే రాజకీయ మార్పునకు నిదర్శనాలు. ఓహియోలో డొనాల్డ్‌ ట్రంప్‌ సన్నిహితుడిగా భావించే ఇండియన్‌ వివేక్‌ రామస్వామి ఓటమి కూడా రిపబ్లికన్‌ శిబిరానికి ఎదురుదెబ్బే. ఈ ఫలితాలను డెమోక్రాట్ల విజయంగా మాత్రమేగాక, ట్రంప్‌ పాలనా విధానాలపై ప్రజలు ఇచ్చిన తీర్పు కోణంలోనూ చూడాలి.
అమెరికా ఓటరుకు దేశభక్తి, జాతీయ భద్రత, సరిహద్దుల పరిరక్షణ వంటి అంశాలు ఎంత ముఖ్యమో, నిత్యజీవితంలో ఎదురయ్యే ధరల పెరుగుదల, ఉద్యోగ భద్రత, వైద్య ఖర్చులు, అద్దెలు, కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతే ముఖ్యం. ఎన్నికల ఫలితాల్లో ఈ అంశాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ట్రంప్‌ ప్రకటించిన సుంకాల యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతవరకు మేలు చేసిందన్న ప్రశ్న ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తోంది. ఇరాన్‌తో యుద్ధం అమెరికా రాజకీయాల్లో మరో కీలక అంశం. విదేశాల్లో సైనిక ఘర్షణలకు భారీగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, స్వదేశంలో ప్రజల జీవన వ్యయాన్ని నియంత్రించలేకపోతే ప్రజల ఆగ్రహం సహజం. డీజిల్‌, ఇంధన ధరలు పెరగడం రవాణా నుంచి వ్యవసాయం వరకు అనేక రంగాలను ప్రభావితం చేస్తుంది. అమెరికా ప్రజలు మరో అంతులేని యుద్ధంలో చిక్కుకోవాలని కోరుకోవడం లేదు. జాతీయ భద్రత పేరుతో యుద్ధాలకు ప్రాధాన్యం ఇవ్వడం, అదే సమయంలో ప్రజల ఆర్థిక సమస్యలను నిర్లక్ష్యం చేయడం ట్రంప్‌కు రాజకీయంగా ఎదురుదెబ్బగా మారింది. యుద్ధోన్మాదంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్‌కు ట్రంప్‌ ప్రభుత్వం అందిస్తున్న మద్దతు కూడా అమెరికా సమాజంలో చర్చనీయాంశమైంది. అమెరికాలోని యువత, విద్యార్థులు, ముస్లిం సమాజాలు, ప్రగతి శీల ప్రజాస్వామ్య వాదులు ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఇరాన్‌తో ఎడతెగని సైనిక చర్యలు, ఇజ్రాయెల్‌కు మద్దతు, మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక జోక్యం వంటి అంశాలు ప్రభుత్వ విదేశాంగ విధానంపై అసంతృప్తిని పెంచాయి. వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను అరెస్టు చేయడం, క్యూబాపై ఆంక్షలను కఠినం చేయటం వంటి చర్యలు కూడా అమెరికా విదేశాంగ విధానంలో జోక్యందారీ ధోరణిపై చర్చను పెంచాయి. ఒక దేశంలో ప్రజాస్వామ్యం లేదని చెబుతూ మరో దేశంపై తన రాజకీయ, ఆర్థిక శక్తిని ప్రయోగించే ట్రంప్‌ వైఖరి అమెరికా విధాన నైతిక వైరుధ్యానికి పరాకాష్ట. ట్రంప్‌ రాజకీయాలకు ఒకప్పుడు బలమైన మద్దతుగా నిలిచిన వలస వ్యతిరేక నినాదాలే ఇప్పుడు ఆయనకు సమస్యగా మారుతున్నాయి. హెచ్‌-1బి వీసాలపై కఠిన వైఖరి, విద్యార్థి వీసాలపై ఆంక్షలు, విదేశీ విద్యార్థుల పట్ల అనిశ్చితి, పుట్టుకతోనే పౌరసత్వం కల్పించే రాజ్యాంగ హక్కును పరిమితం చేయాలన్న ప్రయత్నాలు అమెరికాలో నివసిస్తున్న వలస కుటుంబాల్లో ఆందోళన కలిగించాయి. ఈ పరిణామాలు భారతీయ అమెరికన్లను ప్రభావితం చేసి ఉండవచ్చు.
ట్రంప్‌ రాజకీయ అజెండాలో మరో వివాదాస్పద అంశం మహిళల పునరుత్పత్తి హక్కులు. అబార్షన్‌ హక్కులపై అమెరికా సమాజంలో పరస్పర విరుద్ధమైన భావనలు ఉన్నాయి. 2022లో సుప్రీంకోర్టు దేశవ్యాప్త అబార్షన్‌ హక్కును రద్దు చేసిన తరువాత అనేక రాష్ట్రాల్లో ప్రజలు ఈ అంశంపై నేరుగా ఓటు వేస్తున్నారు. తాజాగా మిస్సౌరీలో అబార్షన్లపై మరిన్ని ఆంక్షలు విధించే ప్రతిపాదనను ఓటర్లు తిరస్కరించడం, వర్జీనియాలో పునరుత్పత్తి స్వేచ్ఛకు రాజ్యాంగ రక్షణ కల్పించే ప్రతిపాదనకు మద్దతు లభించడం గమనార్హం. ఓటర్లు కాలిఫోర్నియా, కొలరాడోలలో ప్రతిపాదించిన కొత్త ఓటరు గుర్తింపు నిబంధనలను తిరస్కరించడం, మిస్సౌరీలో రిపబ్లికన్లు రూపొందించిన నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకించడం కూడా ముఖ్యమైన పరిణామాలు. అధికార పార్టీ తన ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్య ప్రక్రియలను మార్చాలని ప్రయత్నిస్తే ఓటర్లు దాన్ని ప్రశ్నిస్తారని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి.
ఈ ఎన్నికల పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాత అమెరికా రాజకీయాలకు అసలైన పరీక్ష ప్రారంభం కానుంది. కాంగ్రెస్‌ ఉభయసభల్లో డెమోక్రాట్లకు ఇప్పటికే ఆధిక్యం రావడంతో ట్రంప్‌ ప్రభుత్వం ఇకపై తాను అనుకున్న ప్రతీ నిర్ణయాన్ని సులభంగా అమలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అమెరికా రాజ్యాంగ వ్యవస్థలో అధ్యక్షుడికి విస్తృత అధికారాలున్నప్పటికీ, బడ్జెట్‌ ఆమోదం, ప్రభుత్వ నిధుల కేటాయింపు, చట్టాల రూపకల్పన, ఉన్నతాధికారుల నియామకాలకు ఆమోదం, ప్రభుత్వ విధానాలపై విచారణలు వంటి అంశాల్లో కాంగ్రెస్‌ది కీలక పాత్ర. ముఖ్యంగా ప్రతినిధుల సభలో డెమోక్రాట్ల ఆధిపత్యం ఏర్పడటం వల్ల ట్రంప్‌ ప్రభుత్వంపై దర్యాప్తులు, విచారణలు, పత్రాల సమర్పణకు ఆదేశాలు, అధికారుల నుంచి వివరణలు కోరడం వంటి చర్యలకు మార్గం సుగమమవుతుంది. ఈ ఫలితాల వల్ల ట్రంప్‌ అధికారాలు ఒక్కసారిగా కుప్పకూలిపోతాయనిగానీ, అమెరికా రాజకీయాల ముఖచిత్రం హఠాత్తుగా మారి పోతుందనిగానీ అనుకోవడానికి వీల్లేదు. అయితే, మధ్యంతర ఎన్నికల్లో ఓటర్లు తీర్పు, 2028 అధ్యక్ష ఎన్నికల్లో పునరావృతమయ్యే అవకాశాలు లేకపోలేదు. అమెరికా ప్రజలు ఒక వ్యక్తి ఓటమిని కాదు, తమ జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాల్లో తమకు ప్రాధాన్యం ఉండాలని కోరుకుంటున్నారు. ప్రపంచానికి నాయకత్వం వహించే దేశం ముందుగా తన ప్రజల సంక్షేమం, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ వ్యవస్థల గౌరవాన్ని కాపాడాలని ఆశిస్తున్నారు. ఈ ఎన్నికల తీర్పు ట్రంప్‌, ఆయన మద్దతు దారులకు రాజకీయంగా హెచ్చరిక. అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థలో అధ్యక్షునికి కాంగ్రెస్‌ నిర్ణయాలను తిరస్కరించేందుకు వీటో అధికారం ఉన్నప్పటికీ ఆయన అధికారానికి హద్దులున్నాయని గుర్తుచేసిన ప్రజా సందేశం. దేశం ఒక అధ్యక్షుడి వ్యక్తిగత రాజకీయ ప్రయోగాలకు వేదిక కాదు. ప్రజలే యజమానులు. ప్రజాస్వామ్యానిదే అంతిమ అధికారం.
ట్రంప్‌కు ఉన్నది ఇక రెండేళ్లే. ఈ వాస్తవాన్ని ఇప్పటికైనా తెలుసుకుంటే కొంత మేలు. ఇరాన్‌, రష్యా యుద్ధాలను ముగించటంపై తక్షణం దృష్టిపెడితే, పాలస్తీనియన్‌లపై ఇజ్రాయెల్‌ దుందుడుకుతనాన్ని ఆపగలిగితే కొంత సానుకూలత ఏర్పడుతుంది. ఇరాన్‌తో యుద్ధం ముగింపు ట్రంప్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంది. హోర్ముజ్‌ జలసంధి ద్వారా స్వేచ్ఛా రవాణా పునఃప్రారంభమైతే ఆయిలు ధరలు తగ్గి అమెరికాయేకాదు ఆయిలు దిగుమతి చేసుకునే దేశాలన్నీ సంతోషిస్తాయి. ఇప్పుడు బంతి ట్రంప్‌ కోర్టులో ఉంది.

ట్యాగ్‌లు: editorial US Midterm Election Results