Literature: ప్రజల పక్షాన నిలిచిన అక్షరాలకు ‘ప్రజాకవి మల్లావఝుల’ పురస్కారం
తెలంగాణ సాహిత్య చరిత్రలో ప్రజల జీవితాలను ప్రతిబింబించిన కవిత్వానికి, సామాజిక అన్యాయాలను ప్రశ్నించిన రచనలకు, మరుగునపడిన చరిత్రను వెలుగులోకి తెచ్చిన పరిశోధనలకు విశిష్టమైన స్థానం ఉంది. ఈ సాహిత్య వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ప్రజాకవి ‘మల్లావఝుల సదాశివుడు’ పేరుతో తెలంగాణ వికాస సమితి అందిస్తున్న స్మారక సాహిత్య పురస్కారాలకు 2024 సంవత్సరానికిగాను ప్రముఖ కవి, కథా రచయిత డా. చెమన్, 2025 సంవత్సరానికిగాను ప్రముఖ సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ ఎంపికయ్యారు. విభిన్న సాహిత్య ప్రక్రియల్లో కృషిచేస్తున్న ఈ ఇద్దరినీ ఒకే స్మారక పురస్కారంతో గౌరవించడం వెనుక అర్థవంతమైన సాంస్కృతిక సందేశం ఉంది. ఒకరు ప్రజల సమకాలీన జీవిత సంఘర్షణలను సృజనాత్మకంగా ఆవిష్కరిస్తే, మరొకరు తెలంగాణ సాహిత్య చరిత్రలో విస్మృతమైన అధ్యాయాలను వెలికితీస్తున్నారు.
ప్రజల గొంతుక… మల్లావఝుల
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ముర్మూర్ గ్రామంలో జన్మించిన మల్లావఝుల సదాశివుడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే కవిగా, గాయకుడిగా, ఉద్యమకారుడిగా ప్రజల మధ్య జీవించారు. కులవివక్ష, సామాజిక అసమానతలు, దళితులపై కొనసాగుతున్న వివక్షను ప్రశ్నిస్తూ తన రచనలను సామాజిక చైతన్యానికి సాధనంగా మలిచారు. గోదావరి పరివాహక ప్రాంత రైతుల జీవితాలు, సింగరేణి కార్మికుల కష్టాలు, అణగారిన వర్గాల ఆత్మగౌరవ ఆకాంక్షలు ఆయన పాటల్లో ప్రతిధ్వనించాయి. ‘తలాపున పారుతుంది గోదారి’ అంటూ సాగే ఆయన ప్రసిద్ధ గేయం తెలంగాణ జీవితంలోని మౌలిక వైరుధ్యాన్ని ఆవిష్కరిస్తుంది. అపారమైన ప్రకృతి సంపద ఉన్నప్పటికీ దాని ఫలాలు ప్రజలకు అందని పరిస్థితిని ప్రశ్నిస్తుంది.
ప్రజల భాషలోనే ప్రజల బాధను పలికించడం సదాశివుడి ప్రత్యేకత. తెలంగాణ మాండలికంలోని సహజత్వం, నుడికారం ఆయన పాటలకు జీవం పోశాయి. ‘ఎర్రకుంకుమ’ పాటల సంకలనం, ‘సైరన్’ వచన కవితా సంపుటి ఆయన సాహిత్య నిబద్ధతకు నిదర్శనాలు. దళిత ఆత్మగౌరవం, ప్రజాస్వామిక విలువలు, సామాజిక సమానత్వం కోసం ఆయన సాగించిన సాహిత్య, ఉద్యమ ప్రయాణం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది.
మల్లావఝుల సదాశివుడి ప్రాంతానికే చెందిన పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామంలో జన్మించిన డా. చెమన్ వైద్యవృత్తిని కొనసాగిస్తూనే సాహిత్య, సామాజిక రంగాల్లో చురుకుగా పనిచేస్తున్నారు. విద్యార్థి దశ నుంచి విప్లవ విద్యార్థి ఉద్యమాలు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వరకు వివిధ ప్రజా ఉద్యమాలతో ఆయనకు అనుబంధం ఉంది. తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ రచయితల వేదిక వంటి సంస్థల ద్వారా తెలంగాణ ఆకాంక్షలకు మద్దతుగా నిలిచారు.
గోదావరి ప్రాంతం, సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఆయన కవిత్వం రూపుదిద్దుకుంది. భూగర్భంలో ప్రాణాలను పణంగా పెట్టి సమాజానికి వెలుగునిచ్చే కార్మికుల జీవితాల్లోని చీకట్లు ఆయనను కదిలించాయి. ‘ఎడారి స్వప్నం మధ్య’, ‘ఆవిష్కరించని దృశ్యం’ వంటి కవితా సంపుటుల్లో జీవిత సంఘర్షణలు, సామాజిక అసమానతలు, ఆశలు, నిరాశలు, మానవ సంబంధాల సంక్లిష్టత వ్యక్తమవుతాయి. ప్రకృతి దృశ్యాలను, ప్రతీకలను సామాజిక వాస్తవికతను ఆవిష్కరించే సాధనాలుగా ఉపయోగించడం ఆయన శైలిలోని ప్రత్యేకత.
జిల్లా రాజాపేట మండలం రఘునాథపురంలో 1965 అక్టోబరు 10న జన్మించిన సంగిశెట్టి శ్రీనివాస్ తెలంగాణ సాహిత్య పరిశోధనకు విశేషమైన సేవలందించారు. ప్రముఖ రచయితలకే పరిమితం కాకుండా పాత పత్రికలు, విస్మృత రచయితలు, తొలి కథలు, ప్రాంతీయ సాహిత్య సంప్రదాయాలను వెలికితీయడంలో ఆయన కృషి ప్రశంసనీయం. ‘షబ్నవీస్’, ‘దస్త్రమ్’, ‘తెలంగాణ సాయుధ పోరాటం – ఒక సబాల్టర్న్ దృక్కోణం’, ‘ఇంగితం’ వంటి గ్రంథాలు ఆయన పరిశోధనా విస్తృతిని తెలియజేస్తాయి.
ముఖ్యంగా తెలంగాణ పత్రికా చరిత్ర, తొలి తెలుగు పత్రికలు, కథా సాహిత్య వికాసం వంటి అంశాలపై ఆయన చేసిన పరిశోధనలు ప్రాంతీయ సాహిత్య చరిత్రకు విలువైన ఆధారాలను అందించాయి. విస్తృత దృక్పథంతో తెలంగాణ సాహిత్యాన్ని అధ్యయనం చేయడం సంగిశెట్టి ప్రత్యేకత. పరిశోధకుడిగా, సంపాదకుడిగా, అనువాదకుడిగా, రచయితగా ఆయన అందించిన సేవలకు పలు సాహిత్య పురస్కారాలు లభించాయి.
డా. చెమన్, సంగిశెట్టి శ్రీనివాస్ రచనా మార్గాలు భిన్నమైనప్పటికీ వారి లక్ష్యంలో సామాజిక బాధ్యత ప్రధానంగా కనిపిస్తుంది. అందుకే, ఈ ఇద్దరి ఎంపికలో మల్లావఝుల సదాశివుడి సాహిత్య వారసత్వం ప్రతిఫలిస్తోంది. తమ తమ రంగాల్లో కొనసాగిస్తున్న సాహితీవేత్తలకు ఆయన పేరుతో పురస్కారాలు అందించడం సముచితమైన నిర్ణయం. ప్రజల జీవితాలను పలికించే రచనలు, వారి చరిత్రను వెలుగులోకి తెచ్చే పరిశోధనలు కొనసాగినప్పుడే తెలంగాణ సాహిత్య వారసత్వం మరింత సుసంపన్నమవుతుంది. అదే మల్లావఝుల సదాశివుడికి నిజమైన నివాళి.
డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు