INDIA Bloc Rally: ఓటర్ల తొలగింపు వ్యవహారం దేశద్రోహం కిందకు వస్తుంది.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు తీవ్ర హెచ్చరిక జారీ చేసిన రాహుల్ గాంధీ..
Rahul Gandhi
INDIA Bloc Rally: దేశ రాజధాని ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరుగుతున్న ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ ‘ఇండియా’ కూటమి మహాసభ వేదికగా విపక్ష అగ్రనేతలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీరుపై నిప్పులు చెరిగారు. దేశంలో మైనారిటీల దేశభక్తిని శంకించడం, ఓటర్ల జాబితాల సవరణ పేరుతో ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడంపై లోక్ సభ ప్రతపక్ష నేత రాహుల్ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగారు.
‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ విపక్ష ‘ఇండియా’ (INDIA) కూటమి మెగా ర్యాలీలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వేలాదిగా తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు ఆయన నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. “నరేంద్ర మోదీ ఎక్కడికీ వెళ్లలేరు, ప్రధాని, అమిత్ షాలు దేశ పౌరులను, విపక్షాలను ఎదుర్కోక తప్పదని పేర్కొన్న రాహుల్ గాంధీ, రాజ్యాంగాన్ని దెబ్బతీసే చర్యలను ఎంతమాత్రం సహించేది లేదని తేల్చిచెప్పారు.
ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పేరుతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల ఓట్లను చట్టవిరుద్ధంగా జాబితాల నుంచి తొలగించడాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఓటర్ల హక్కులను కాలరాయడం నిస్సందేహంగా “దేశద్రోహం”, “ద్రోహం” కిందకే వస్తుందని దుయ్యబట్టారు. ఈ తరహా అక్రమాలు ప్రజాస్వామ్య మూలాలనే దెబ్బతీస్తాయని, ఇది “అరుదైన వాటిలోకెల్లా అరుదైన” (Rare of the rarest) నేరమైనందున ఓట్ల హరింపునకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించకుండా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తోందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఓట్ల దొంగతనం ద్వారా ప్రజాస్వామ్యాన్ని రక్షించే రాజ్యాంగ వ్యవస్థలను మోదీ, అమిత్ షాలు తమ గుప్పిట్లో ఉంచుకున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ పదవిలో కొనసాగే అర్హత కోల్పోయారని, ఆయనను వెంటనే విచారించి రాజ్యాంగ ఉల్లంఘనకు బాధ్యుడిని చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా వేదికపై నుంచి మాట్లాడుతూ సభను తీవ్ర భావోద్వేగానికి గురిచేశారు. దేశంలో ముస్లింల దేశభక్తిని పదే పదే ప్రశ్నిస్తూ, వారిని పాకిస్థానీలుగా ముద్ర వేసేందుకు అధికార బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కుట్రలు పన్నుతున్నాయని ధ్వజమెత్తారు. “ఈ దేశ స్వాతంత్ర్యం, రక్షణ కోసం ముస్లింలు తమ రక్తాన్ని ధారపోశారు. మున్ముందు కూడా ఈ భారతావని రక్షణ కోసం రక్తం ధారపోస్తూనే ఉంటారని నేను స్పష్టంగా చెబుతున్నాను” అని అబ్దుల్లా ప్రకటించారు. ముస్లింలు ఈ దేశంలో పరాయివారు కాదని, తమ మాతృభూమి హక్కులను ఎవరూ గుంజుకోలేరని స్పష్టం చేశారు.
సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేశ్ యాదవ్ ప్రసంగిస్తూ, ఓటర్ల జాబితా తొలగింపులపై స్పష్టమైన ఆధారాలను బయటపెట్టారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వేలాది మంది ఓటర్ల పేర్లను దొంగతనంగా తొలగించడం వల్లే వారు 2022 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయలేకపోయారని ఆరోపించారు. ఈ అక్రమాల ఆధారాలతో తమ పార్టీ ఎన్నికల సంఘానికి లాంఛనంగా అఫిడవిట్ సమర్పించినప్పటికీ దర్యాప్తు చేయకుండా బుట్టదాఖలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు, ప్రజలు ఇప్పుడు రోడ్లెక్కి గళమెత్తడంతోనే ఈసీ తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని అరకొర చర్యలు ప్రారంభించిందని ఎద్దేవా చేశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ, ప్రత్యేక విస్తృత సవరణ (SIR) పేరుతో చేపడుతున్న ప్రక్రియ వల్ల బెంగాల్ ప్రజలు, ముఖ్యంగా సామాన్య ఓటర్లు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి ఎన్నికల సంఘం పనిచేస్తోందని, ఈ అన్యాయమైన ఓట్ల తొలగింపునకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయి వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. వేదికపై ఉన్న సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఫరూఖ్ అబ్దుల్లా తదితర విపక్ష నాయకులకు మమత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ముందుకు వచ్చిన విద్యార్థులు, ‘జెన్ జెడ్’ (Gen Z) యువత , పౌర సమాజానికి ఆమె ప్రత్యేకంగా సంఘీభావం తెలిపారు.