Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

క్యాన్సర్‌ పీడితులకు భారీ ఊరట

Prajapaksham 01 Nov 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
క్యాన్సర్‌ పీడితులకు భారీ ఊరట

US Pharma Tariff

సుప్రీంకోర్టు జోక్యంతో క్యాన్సర్‌ ఔషధాల ధరలు తగ్గనున్నాయి. క్యాన్సర్‌ చికిత్సకు సంబంధించిన 137 ఔషధాలకు చెందిన 543 బ్రాండ్ల ధరల తగ్గింపు నవంబర్‌ 9 నుంచి అమలులోకి రానుంది. ఇకపై నిర్ణీత క్యాన్సర్‌ ఔషధాల తయారీ ధరపై 30 శాతానికి మించి గరిష్ట ధర (ఎంఆర్‌పీ) ఉండకూడదని నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా ప్రైవేటు ఫార్మా ధరలతో పాటు, క్యాన్సర్‌ జెనరిక్‌ మందుల ధరలు 93 శాతం తగ్గుతాయి. ఈ చర్య ఫలితంగా రిటైల్‌ ధరలు 70 శాతం వరకు తగ్గి, రోగులకు ఏటా రూ.2,500 కోట్లు ఆదా అవుతాయని అంచనా.

క్యాన్సర్‌ వ్యాధి బారిన పడిన వారి కుటుంబసభ్యుల బాధ వర్ణనాతీతం. ఒకవైపు బాధితులను కుటుంబసభ్యులు ఓదార్చడం, మరోవైపు చికిత్సకు అయ్యే ఖర్చుతో కుదేలవడం కళ్లకు కనిపిస్తూనే ఉంది. క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులు దాని నుంచి బయటపడినా కుటుంబం అప్పుల ఊబిలో చిక్కుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇటీవల భారతదేశంలో క్యాన్సర్‌ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. లక్షమందిలో 60 మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఏటా 15 లక్షల కొత్త కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగించే అంశం.

ఈ నేపథ్యంలో క్యాన్సర్‌ చికిత్స అత్యంత ఖరీదైనది. ఔషధాల ధరలు రూ.38,000 నుంచి రూ.3.80 లక్షల వరకు ఉంటాయి. క్యాన్సర్‌ థెరపీ వ్యాధి దశను బట్టి ఎన్ని దఫాలుగా ఇవ్వాలో నిర్ణయిస్తారు. ఈ వ్యాధి బారిన పడితే మధ్యతరగతి, పేదల పరిస్థితి అంతే. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద కుటుంబానికి రూ.5 లక్షల వరకు బీమా వర్తిస్తోంది. ఈ మొత్తం రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స చేసే కాడ్సిలా అనే ఒక ఔషధం ఒక్క డోసు కొనుగోలుకే సరిపోతుంది. ఇలాంటివి రోగికి 14 డోసుల వరకు అవసరమంటే ప్రభుత్వ పథకం ఏ మూలకు వస్తుందో అర్థం చేసుకోవచ్చు.

నిజానికి క్యాన్సర్‌ ఔషధాలు ఖరీదైనవే అయినప్పటికీ, అవి కంపెనీల నుంచి ఆసుపత్రులకు చేరేవరకు పంపిణీదారుల వ్యవస్థ కలుపుకొని దండుకునే లాభాలతో గరిష్ట ధరను అమాంతం అందుకోలేనంత ఎత్తుకు పెంచేస్తారు. అసలు ధరకు ఎంఆర్‌పీకి మధ్య 170 శాతం నుంచి 700 శాతం వరకు, కొన్ని మందులకు అంతకంటే ఎక్కువ శాతం ఎంఆర్‌పీని కంపెనీలు నిర్ణయిస్తున్నాయి. అంటే అసలు ధరకంటే వెయ్యి శాతం వరకు రోగి నుంచి వసూలు చేసుకోవడం అత్యంత కిరాతకం. ఈ వివరాలను సేకరించి, వెలుగులోకి తీసుకురావడంలో కర్ణాటక ప్రభుత్వం కీలక పాత్ర నిర్వహించింది. దాని ఫలితంగానే అసలు ధరపై ఎంఆర్‌పీ 30 శాతం మాత్రమే ఉండాలనే నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వ ఔషధ సంస్థలు రాగలిగాయి.

క్యాన్సర్‌ ఔషధాల దోపిడీ ధరలు తెరపైకి రావడం వెనుక ఒక మహిళ న్యాయపోరాటం దాగి ఉంది. కేరళ రాష్ట్రానికి చెందిన సరోజం రాధాకృష్ణన్‌ అనే రిటైర్డ్‌ బ్యాంక్‌ ఉద్యోగి 2021లో క్యాన్సర్‌ బారిన పడ్డారు. క్యాన్సర్‌ చికిత్సకు నెల నెలా రూ.63 వేలకు పైగా ఆమె ఖర్చు చేయాల్సి వచ్చింది. ఆ దెబ్బకు వారి కుటుంబం దాచుకున్న పొదుపు మొత్తం, పెన్షన్‌ డబ్బులు ఆవిరైపోయాయి. తనలాగే చికిత్స కారణంగా వేలాది క్యాన్సర్‌ బాధితుల కుటుంబాలు వీధుల్లోకి వచ్చే పరిస్థితి వచ్చిందని గుర్తించి, ఆమె 2022లో కేరళ హైకోర్టులో అధిక ధరలపై కేసు దాఖలు చేశారు. దురదృష్టవశాత్తు 2022లో సరోజం రాధాకృష్ణన్‌ మరణించారు. అయినప్పటికీ, ఆమె దాఖలు చేసిన కేసు నిష్ఫలం కాకుండా, దానిని ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద మార్చి కేరళ హైకోర్టు విచారణను కొనసాగించింది.

2026 జులై 17న సుప్రీంకోర్టు క్యాన్సర్‌ ఔషధాల భారీ ధరల వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది. రిటైలర్‌ నిర్ణయించిన ధర (పిటిఆర్‌), గరిష్ట రిటైల్‌ ధర (ఎంఆర్‌పీ) మధ్య 1000 శాతానికి పైగా వ్యత్యాసం చూసి కేసు చేపట్టిన జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆసుపత్రి ఫార్మసీకి రూ.2,700లకు సరఫరా చేసిన క్యాన్సర్‌ నిరోధక ఇంజెక్షన్‌ ఎంఆర్‌పీ ధర రూ.27,000గా విక్రయించటంపై విస్మయం వ్యక్తం చేశారు. ఇది పట్టపగలే బరితెగించిన దోపిడీ, మారణహోమమనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఔషధ తయారీదారుడు పంపిణీదారునికి ఒక సీసాను సరఫరా చేసే ధర (పిటిఆర్‌)కు, ప్యాకింగ్‌పై ముద్రించిన ఎంఆర్‌పీకి మధ్య అధిక తేడాను కోర్టు గుర్తించింది. అంటే 900 శాతం లాభాలు ఆసుపత్రి నెట్‌వర్క్‌లకు, సరఫరా గొలుసుల మధ్యవర్తుల జేబుల్లోకి వెళ్తున్నాయి. ఫలితంగా చౌక ఔషధాలకు బదులు నిర్దిష్ట బ్రాండ్‌ను మాత్రమే రాసేలా ప్రోత్సహిస్తోంది. దీనిని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించటంతో కేంద్ర ప్రభుత్వం ధరల తగ్గింపు నిర్ణయాన్ని వెల్లడించింది.

విదేశీ కంపెనీల పేటెంట్‌ ఉన్న 155 క్యాన్సర్‌ ఔషధాలకు 30 శాతం పరిమితి వర్తించదు. కాబట్టి వాటి ధరలు తగ్గవు. కంపెనీలు తయారు చేసే ఒక్కో ఇంజెక్షన్‌ ధర రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. వీటిని తగ్గించాలంటే, ఆ విదేశీ కంపెనీల ఔషధాలను భారత కంపెనీలతో తక్కువ ధరకు ఉత్పత్తి చేయించేలా చట్టాన్ని తీసుకురావడమే విరుగుడు.

భారీ లాభాలకు అలవాటు పడిన కంపెనీలు, బడా కార్పొరేట్‌ ఆసుపత్రులు చట్టంలో లొసుగులను తీసుకొని క్యాన్సర్‌ మందుల ధరపై 30 శాతం పరిమితిని కూడా అధిగమించే ప్రయత్నాలు చేయకమానరు. కర్ణాటక ప్రభుత్వం ఇటీవల నవంబర్‌ 1వ తేదీలోగా అన్ని ఆసుపత్రులు మందులు సేకరించిన వాస్తవ ధర, ఎంఆర్‌పీ ధరలను తెలియజేయాలని సర్క్యులర్‌ జారీ చేసింది. దీనికి వ్యతిరేకంగా కర్ణాటక ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌ హోమ్‌ల సంఘం, కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, వైద్యులు హైకోర్టును ఆశ్రయించటమే ధరల తగ్గింపు నిర్ణయం అమలుకు సవాలు విసురుతోంది.

సుప్రీంకోర్టు మరో విషయం కూడా అడిగింది. ఈ తగ్గింపు కేవలం క్యాన్సర్‌కే ఎందుకు పరిమితం చేయాలి? ఇతర ఔషధాలకు ఎందుకు కాదు? అనే ప్రశ్న వేయడం సబబే. సాధారణ సెలైన్‌ బాటిల్‌ తయారీకి రూ.11 ఖర్చవుతుంటే, దానిని రూ.270కి విక్రయించటం ఆశ్చర్యం కలిగించకమానదు.

నిజానికి ఇది కేవలం ఔషధాల ధరకు మాత్రమే సంబంధించిన వ్యవహారం కాదు. మొత్తం వైద్య వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. గత రెండు దశాబ్దాలుగా కార్పొరేట్‌ సంస్థలు వైద్య రంగంలో విస్తరిస్తున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతులు, సరిపడా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో సామాన్యులు ప్రైవేటు ఆసుపత్రులకే క్యూ కడుతున్నారు.

స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలవుతున్నా ప్రభుత్వ వైద్యరంగానికి కేవలం జీడీపీలో 1.8 శాతం నిధులను మాత్రమే కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తోంది. ఇది 2025 నాటికి జీడీపీలో 2.5 శాతానికి పెరగాలన్నది జాతీయ ఆరోగ్య విధానం లక్ష్యం. అలాగే అంతర్జాతీయంగా వైద్య, ఆరోగ్య రంగానికి సగటున జీడీపీలో 6 శాతం కేటాయించాలి. దానికి మనం ఎంతో దూరంలో ఉన్నాం.

ఔషధాల తయారీలో ప్రభుత్వరంగ సంస్థలను ఏర్పాటు చేసి, ప్రోత్సహించాలి. ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్టపరచాలి. కార్పొరేట్‌, ప్రైవేటు ఆసుపత్రుల ఫీజులపై అవినీతికి తావులేని బలమైన నియంత్రణ, నిఘా ఏర్పాటు చేస్తేనే మార్పు సాధ్యం. ఇదంతా చేయాలంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి అవసరం. మొత్తానికి న్యాయస్థానాల చొరవతో క్యాన్సర్‌ ఔషధాల ధరలు తగ్గనుండడం ఎంతోమందికి ఊరట కలిగిస్తుంది. ఇది ఇతర ప్రాణరక్షక ఔషధాలకూ విస్తరించాలి. సంబంధిత అథారిటీ దీనిపై దృష్టి సారించాలి.

ట్యాగ్‌లు: pharmaceutical regulation