Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

10 రోజుల్లో 4 ఎన్నికలు నిరంకుశత్వానికి ఎదురుదెబ్బ

Prajapaksham 31 Oct 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
10 రోజుల్లో 4 ఎన్నికలు నిరంకుశత్వానికి ఎదురుదెబ్బ

Editorial: విశిష్ట సాహిత్య ధోరణి ‘మేజిక్‌ రియలిజం’

ప్రపంచ పరిణామాలు అనూహ్యమైన మలుపులు తీసుకుంటున్నాయి. వాటిలో ఎన్నికల్లో ప్రజల తీర్పులు ఒక భాగం. ఎడతెగని యుద్ధాలు మరోభాగం, చివరిగా, ఫ్రాన్స్‌ తదితర యూరప్‌ దేశాల్లో విద్యార్థుల వీధిపోరాటాలు మరో ముఖ్యమైన పరిణామం. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచ దేశాల్లో పెచ్చుపెరుగుతున్న పచ్చి మితవాదానికి, నిరంకుశాధికారానికి ఎదురుదెబ్బ ఈ పరిణామాల్లో ఎన్నదగిన లక్షణం.
ప్రజాస్వామ్య ఎన్నికలు తీసుకుందాం. అక్టోబర్‌ 25 నవంబర్‌ 3 మధ్య కేవలం 10రోజుల్లో నాలుగుదేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిలో బ్రెజిల్‌, సెర్బియాల్లో అక్టోబర్‌ 25న, ఇజ్రాయెల్‌లో అక్టోబర్‌ 27న ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడ్డాయి. అమెరికాలో నవంబర్‌ 3న కాంగ్రెస్‌కు మధ్యంతర ఎన్నికలు జరుగనున్నాయి. తొలి మూడు ఎన్నికల ఫలితాల్లో నిరంకుశాధికారానికి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పు ఉంది. బ్రెజిల్‌లో రన్‌ఆఫ్‌ ఎన్నికల్లో లాటిన్‌ అమెరికాలోని అతిపెద్ద ఆర్థికవ్యవస్థను అమెరికా వలసగా మార్చటానికి ప్రయత్నించిన పచ్చి మితవాదుల అభ్యర్థి ఫ్లావియో బోల్సనారోకు వ్యతిరేకంగా బ్రెజిలియన్‌లు తమ దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకున్న సూచన ఉంది. ఆతని పన్నాగాన్ని భగ్నం చేసిన ఓటర్లు వామపక్ష కూటమి అభ్యర్థి లులాకు అనుకూలంగా మెజారిటీ ఇచ్చి ఆయన్ను నాల్గవసారి అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టారు. భార్యబిడ్డలతో ఫ్లావియో అమెరికా పారిపోవటం బ్రెజిలియన్‌ పచ్చిమితవాదులను ఆశ్చర్యపరిచింది. 2022 అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన తండ్రి జైర్‌ బోల్సనారో, తిరుగుబాటు కుట్రకుగాను సుప్రీంకోర్టు విధించిన 27 సంవత్సరాల శిక్షను అనుభవిస్తున్నాడు. తొలి విడత ఎన్నికల్లో ఫ్లావియోకన్నా 20 లక్షల ఓట్లు వెనుకబడిన లులా, రన్‌ ఆఫ్‌ లో 40లక్షలపై చిలుకు మెజారిటీ సాధించటం అంటే 60లక్షలకుపైగా అదనపు ఓట్లు సంపాదించటం ఒక అద్భుతం. లాటిన్‌ అమెరికాలో వామపక్ష ప్రభావాన్ని నిర్మూలించేదుకై అధ్యక్షుడు ట్రంప్‌ గత సంవత్సరకాలంగా అనుసరిస్తున్న బెదిరింపు విధానాలకు బ్రెజిలియన్‌లు అడ్డుకట్టవేశారు. బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు అర్జెంటీనా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్‌ తదితర దేశాల్లో ట్రంప్‌ అనుకూల నిరంకుశ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేసేందుకు ఆ దేశాల్లోని వామపక్షాలను ఉత్తేజితం చేస్తున్నాయి. అయితే లులా అధ్యక్షునిగా తిరిగి ఎన్నికైనప్పటికీ ఆయన ఎజండా అమలు జరపటం సులభం కాదు. ఎందుకంటే చాంబర్‌లోని- 513సీట్లలో 303,
సెనేట్‌లో మూడింట రెండు వంతులు మితవాదులు గెలుచుకున్నారు. మొత్తం ఎన్నికల క్రమం సక్రమంగా జరిగిందని కోర్టు ప్రెసిడెంట్‌ కాన్సియో నునెస్‌ మార్క్యుస్‌ సర్టిఫై చేశారు. ఆయన జైర్‌ బోల్సనారో నియమించిన జడ్జీ.
సెర్బియా యుగోస్లావియా విభజనతో ఏర్పడిన చిన్న దేశం. అలెక్సాండర్‌ ఉసిక్‌ 14 సంవత్సరాలుగా సాగిస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువత ‘స్టూడెంట్‌ స్ట్రీట్‌ పార్టీ’ బ్యానర్‌ కింద ఏకమై జాతీయ ఎన్నికల్లో పోటీ చేశారు. పార్లమెంటులోని 250లో 140 సీట్లను ఓటర్లను అనూహ్యంగా ఆ పార్టీకి కట్టబెట్టారు. ఇప్పుడు ఆ యువత ముఖ్యనాయకత్వ బృందాన్ని, నాయకుణ్ణి ఎంచుకునే పనిలో ఉంది. సెర్బియా నిరసనలకు నేపాల్‌, బంగ్లాదేశ్‌లోని పరిణామాలతో పోలికలున్నాయి. అయితే తేడా ఏమంటే సెర్బియన్‌ ఆందోళనకారులు ఉసిక్‌ ప్రభుత్వాన్ని కూల్చివేయలేదు, జాతీయ ఎన్నికల కోసం వేచి చూచారు.
సెర్బియా ఎన్నికల్లో విద్యార్థి ఉద్యమ విజయం ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌, పోర్చుగల్‌ తదితర దేశాల్లో నిరసన ఉద్యమాలపై ప్రభావం చూపుతున్నది. ఫ్రాన్స్‌లో ఆరు వారాలకుపైగా విద్యార్థుల నిరసన ప్రదర్శనలు కొనసాగు
తున్నాయి. మాక్రాన్‌ ప్రభుత్వం ఆందోళనకారులతో చర్చలు జరపకపోగా,
భద్రతాదళాలను ప్రయోగిస్తున్నది. ఫ్రాన్స్‌లో ఎన్నికలు 2027 మేలో జరుగుతాయి. విద్యార్థుల నిరసనను తమకు అనుకూలంగా ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని మితవాది మారీ లీపెన్‌ పార్టీ, వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఎవరు లబ్దిపొందుతారో ఇప్పుడే స్పష్టంగా చెప్పటం కష్టం.
ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ప్రధాని ఇమ్మాన్యూల్‌ నెతన్యాహు లుకిడ్‌ పార్టీ కూటమి కనీస మెజారిటీ సీట్లు గెలుచుకోలేకపోవటం పచ్చిమితవాదులకు ఎదురుదెబ్బ. అయితే ప్రతిపక్షపార్టీ అంతకన్నా మితవాది. ప్రభుత్వం ఏర్పాటుకు మ్యాజిక్‌ ఫిగర్‌ 61కాగా నెతన్యాహుకు 53, అతని ప్రత్యర్థి ఐసెన్‌కోట్‌కు 48 సీట్లు వచ్చాయి. అరబ్‌ పార్టీలు ఎన్నడూ లేనంతగా 19సీట్లు గెలవటం విశేషం. వారి తోడ్పాటు లేకుండా ఏ ప్రభుత్వమూ ఏర్పడదు. వారి తోడ్పాటుకోరే కూటమి పాలస్తీనియన్‌ల విషయంలో తమ దుందుడుకు విధానాలను సడలించుకోవల్సి ఉంటుంది. రెండు వారాల్లో ఎవరూ మెజారిటీ కూడగట్టుకోలేకపోతే మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. ఈ లోపు నెతన్యాహు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు. అరబ్‌ ప్రజల ఓటుహక్కు రద్దు చేస్తానని అతను తాజాగా ప్రకటించాడు. రెండు యూదు జాత్యహంకార పార్టీలు ఎత్తుగడలను వేచిచూడాల్సి ఉంది.
నవంబర్‌ 3న అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీనుంచి ప్రమాదం ఎదురవుతున్న రాష్ట్రాల్లో అధ్యక్షుడు ట్రంప్‌ తమ రిపబ్లికన్‌లకోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ట్రంప్‌ పాపులారిటీ రేట్‌ 30 శాతానికి తగ్గింది. దానికీ, అంతిమంగా ఓటింగ్‌కు సంబంధం ఉండదు. ప్రతినిధుల సభ లో డెమొక్రాట్‌లు మెజారిటీ సాధిస్తారని ఒపీనియన్‌ పోల్స్‌ చెబుతున్నాయి. ఇప్పటికే 4కోట్లమంది ముందుగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సెనేట్‌లో మెజారిటీకి డెమొక్రాట్లకు మరో నాలుగు సీట్లు చాలు. ఈ ఫలితాలవల్ల ట్రంప్‌ అధ్యక్ష పదవికి ప్రమాదం లేకపోయినా అవి పాలనపై నైతికంగా అభిశంసన అవుతాయి. ఆయన అంతర్జాతీయ వ్యవహారాల్లో దూకుడు తగ్గించి దేశీయ సమస్యలపై కేంద్రీకరించాల్సి ఉంటుంది. లేకపోతే 2028 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పరిస్థితి ఇబ్బందిలో పడుతుంది.

ట్యాగ్‌లు: editorial Elections Today news