Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

గణాంకాల్లో వెలుగులు.. జీవితాల్లో ఒత్తిళ్లు..

Prajapaksham 29 Oct 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
గణాంకాల్లో వెలుగులు.. జీవితాల్లో ఒత్తిళ్లు..

Population

భారత దేశంలో విపరీతంగా పెరుగుతున్న ఆర్థిక అంతరాలపై కాంగ్రెస్‌ పార్టీ బుధవారం లేవనెత్తిన అంశాలపై లోతైన చర్చ అవసరం. ఆహార ద్రవ్యోల్బణం సామాన్యుడి జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుండగా, అసాధారణ వేగంతో అభివృద్ధి పథంలో పరుగులు తీస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు, విడుదల చేస్తున్న గణాంకాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిజానికి, దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి గురించి చర్చించేటప్పుడు స్థూల దేశీయోత్పత్తి (జిడిడి) వృద్ధి రేటును ఒకటే కొలమానంగా తీసుకోవడం సరైన ఆర్థిక విశ్లేషణకు దారితీయదు. దేశం ఎంత సంపదను సృష్టిస్తోంది అనే ప్రశ్నతోపాటు, ఆ సంపద ఎవరికి చేరుతోంది, సామాన్య కుటుంబాల ఆదాయాలు ఎంత పెరుగుతున్నాయి, వారి పొదుపులు ఎంత భద్రంగా ఉన్నాయి, నిత్యావసరాల ధరలు వారి జీవన ప్రమాణాలను ఏ మేరకు ప్రభావితం చేస్తున్నాయి అనే ప్రశ్నలకు కూడా సమాధానాలు వెతకాలి. ఆర్థికాభివృద్ధి గణాంకాల్లో కనిపించే వెలుగులకు, సామాన్యుల కుటుంబ బడ్జెట్లలో కనిపించే ఒత్తిళ్లకు మధ్య అంతరం పెరిగితే, ఆర్థిక విధానాల ఫలితాలను సమీక్షించడం అనివార్యం. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, కుటుంబాల అప్పుల భారం, తగ్గుతున్న పొదుపులపై జరుగుతున్న చర్చ ఈ ప్రాథమిక అంశాలనే ముందుకు తెస్తోంది. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతల ను అత్యంత తీవ్రమైన సమస్యల్లో ఒకటిగా కాంగ్రెస్‌ అభివర్ణించడం ఎంతైనా సముచితం. ధరల పెరుగుదలను నియంత్రించాలని, ఉపాధి అవకాశాలను విస్తరించాలని, ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్‌ చేయడం కూడా సరైనదే. దేశ సంపద పెరుగుతున్నప్పుడు మధ్యతరగతి కుటుంబాలు తమ నెలవారీ ఖర్చులను నిర్వహించడానికి అప్పు లపై ఆధారపడాల్సి వస్తే, ఆర్థికాభివృద్ధి నాణ్యతను పరిశీలించాల్సిందే. 2025 ఆర్థిక సంవత్సరంలో కుటుంబాల నికర ఆర్థిక పొదుపులు తగ్గాయంటూ వెలువడిన నివేదిక ఈ చర్చకు మరింత ప్రాధాన్యం కల్పించింది. ఆ నివేదిక ప్రకారం, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.22.57 లక్షల కోట్లుగా ఉన్న నికర కుటుంబ ఆర్థిక పొదుపులు 2025 రూ.21.69 లక్షల కోట్లకు పడిపోయాయి. అంటే దాదాపు నాలుగు శాతం తగ్గుదల నమోదైంది. బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్‌ ఫండ్లు, ఇతర ఆర్థిక సాధనాల్లో కుటుంబాలు పెట్టుబడులు పెడుతున్నప్పటికీ, వాటి కంటే వేగం గా కొత్త అప్పులు పెరిగాయి. ఈ గణాంకాలను అర్థం చేసుకోవాలంటే స్థూల పొదుపులకు, నికర పొదుపులకు మధ్య తేడాను గుర్తించాలి. కుటుంబాలు కూడబెట్టిన ఆర్థిక ఆస్తుల నుంచి వాటి అప్పులను తీసివేసిన తర్వాత మిగిలే మొత్తమే నికర ఆర్థిక పొదుపులకు ప్రధాన సూచిక. ఆ మొత్తం తగ్గితే, కుటుంబాల ఆర్థిక భద్రతపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కుటుంబాలు భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న సొమ్మును ప్రస్తుత జీవన వ్యయాలకు వినియోగించాల్సి వస్తోందా? విద్య, వైద్యం, గృహవసతి, రవాణా వంటి తప్పనిసరి ఖర్చులు ఆదాయాలను మించిపోతున్నాయా? ఉపాధి అస్థిరత వల్ల కుటుంబాలు అప్పుల వైపు మళ్లుతున్నాయా? ఈ ప్రశ్నలకు
సమాధానాలు అవసరం.
ధరల ఒత్తిడి, అప్పుల పెరుగుదల, పొదుపుల తగ్గుదల ఒకేసారి చోటుచేసుకుంటే కుటుంబాల కొనుగోలు శక్తిపై వాటి సమష్టి ప్రభావాన్ని ప్రభుత్వం అధ్యయనం చేయాలి. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నప్పటికీ, ఆ వృద్ధి ఫలాలు కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమైతే అసమానతలు మరింత పెరుగుతాయి. పెద్ద సంస్థల లాభాలు పెరగడం, ఆస్తుల విలువలు ఎగబాకడం ఆర్థిక చైతన్యానికి సంకేతాలు కావచ్చు. కానీ అదే సమయంలో సాధారణ కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోవడం అభివృద్ధిపై అనుమానాలకు తావిస్తుంది. ఆర్థిక వృద్ధి రేటు పెరగడం కంటే, సదరు వృద్ధి ఫలాలను సమాజంలోని విస్తృత వర్గాలకు చేరవేయడమే ప్రభుత్వం ముందున్న నిజమైన సవాలు. కుటుంబాల పొదుపులు తగ్గుతున్నాయనే సంకేతాన్ని నిర్లక్ష్యం చేస్తే, భవిష్యత్తులో వినియోగం, పెట్టుబడులు, ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావాలు పడవచ్చు. ధరల భారం, ఉపాధి అనిశ్చితి, అప్పుల ఒత్తిడి మధ్యతరగతి నుంచి పేద కుటుంబాల వరకు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంటే, దేశం అభివృద్ధి సాధిస్తున్నదని, ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నదని భుజాలు చరుచుకోవడంలో అర్థం లేదు. కాగితాల్లో కనిపించే వృద్ధి.. కేవలం లెక్కలకే పరిమితమయ్యే అభివృద్ధి సామాన్యుడికి ఊరటనివ్వవు. జీవన ప్రమాణాలను మెరుగుపరచవు. ఆర్థిక సమస్యలను దూరం చేయవు. ఆర్థిక వ్యవస్థ
విజయాన్ని కొలిచే గణాంకాలు ప్రజల జీవితాల్లో కనిపించే మెరుగుదలతో సరిపోలినప్పుడే అభివృద్ధిపై విశ్వాసం బలపడుతుంది. లేకపోతే వృద్ధి గణాంకాలు ఒక కథ చెబుతుంటే, కుటుంబాల ఖర్చుల పుస్తకాలు మరో కథ చెబుతాయి. ఆ రెండు కథల మధ్య అంతరాన్ని తగ్గించడమే బాధ్యతాయుతమైన ఆర్థిక పాలనకు నిజమైన పరీక్ష. అలాంటి పరీక్షను ఎదుర్కోవడానికిగానీ, వాస్తవ పరిస్థితులను అంగీకరించడానికిగానీ మోదీ సర్కారు సిద్ధంగా ఉన్నదా? అనేది ప్రశ్న. నిజాన్ని అంగీకరించి, పరిస్థితులను సమీక్షించి, గణాంకాలను వాస్తవాలతో సమీక్షించినప్పుడే పారదర్శకమైన ఆర్థిక ముఖచిత్రం ఆవిష్కృతమవుతుంది. నిజాలను మరుగున ఉంచి, ఎవరికీ ప్రయోజ నం లేని లెక్కలను ప్రస్తావించి, వేగవంతమైన అభివృద్ధి పేరుతో ప్రకటనలు గుప్పించడం ఆత్మవంచనే అవుతుంది.
ఆర్థిక వృద్ధి గణాంకాలను ప్రస్తావిస్తూ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతను వివరించినంత మాత్రాన ప్రజలు వృద్ధి ఫలాలను అనుభవిస్తున్నారని అనుకోవడానికి వీల్లేదు. ధరల పెరుగుదల, అప్పుల భారం, ఉద్యోగ అవకాశాల క్షీణత వంటి అంశాలపై కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శల్లో నిజాయితీ ఉంది. దీనిని, ఒక రాజకీయ ప్రకటనగానో, ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఉపయోగిస్తున్న అస్త్రంగానో భావించడం తప్పు. ప్రజలకు మేలు జరగనప్పుడు, జరిగిన అభివృద్ధి ఫలితం ఏమిటి? పారదర్శకమైన గణాంకాలు, నిరంతర పరిశీలన, వాస్తవ పరిస్థితులకు అనుగుణమైన విధానాలు అవసరం. ద్రవ్యోల్బణం తగ్గుతోందని చెప్తున్న ప్రభుత్వం, ఆ తగ్గుదల ప్రజల రోజువారీ ఖర్చుల్లో ఎంతవరకు ప్రతిబింబిస్తోందో కూడా వివరించాలి. వృద్ధి రేటు పెరిగిందని ప్రకటిస్తే, ఉద్యోగాలు, వేతనాలు, కుటుంబ పొదుపులు, వినియోగ సామర్థ్యంలో వచ్చిన మార్పులను కూడా వెల్లడించాలి. ఆర్థిక వృద్ధి ప్రజల జీవితాల్లో భద్రతను, అవకాశాలను, కొనుగోలు శక్తిని పెంచాలి. ఇందుకోసం ప్రభుత్వం ఉపాధి సృష్టికి ప్రాధాన్యం ఇవ్వాలి, ధరల నియంత్రణకు సమర్థమైన చర్యలు తీసుకోవాలి, వేతనాల వాస్తవ విలువను కాపాడాలి, కుటుంబాల అప్పుల పరిస్థితిపై క్రమబద్ధమైన సమాచారాన్ని అందించాలి. అలాంటి నిజాయితీ ఉంటే, తక్షణమే గణాంకాలను విశ్లేషించి, వృద్ధి ఫలాలు సామాన్యుల వరకూ ఎందుకు చేరడం లేదో గుర్తించాలి. పెరుగుతున్న ఆర్థిక అసమానతల మూలాలను వెతికి పట్టుకోవాలి. నివారణ చర్యలు చేపట్టాలి. అప్పుడే అభివృద్ధిపై వెలువడుతున్న ప్రకటనలకు, గణాంకాలకు విలువ. ప్రజలకు ఆర్థిక భద్రత.

ట్యాగ్‌లు: editorial life style