Skip to content
జాతీయం › వార్తలు

పాఠ్యపుస్తకాల్లో సెంగోల్‌ : చరిత్రా? రాజకీయ ప్రతీకవాదమా?

Prajapaksham 29 Oct 2026 0 నిమిషాల పఠనం జాతీయం
పాఠ్యపుస్తకాల్లో సెంగోల్‌ : చరిత్రా? రాజకీయ ప్రతీకవాదమా?

Modi

డా.ముచ్చుకోట సురేష్‌ బాబు


పాఠశాల పాఠ్యపుస్తకాల్లో సెంగోల్‌ చేర్పు చారిత్రక ఆధారాలకు, రాజకీయ వ్యాఖ్యానాలకు మధ్య స్పష్టమైన తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ముందుకు తెస్తోంది. ఎన్‌సిఇఆర్‌టి తాజాగా విడుదల చేసిన తొమ్మిదో తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో సెంగోల్‌ను చేర్చడం ఒక మౌలిక ప్రశ్నను లేవనెత్తుతోంది: వివాదాస్పదమైన చారిత్రక కథనాన్ని స్థిరపడిన వాస్తవం గా విద్యార్థులకు బోధిస్తున్నారా? పాలన, సుపరిపాలనకు సంబంధించిన సాంస్కృతిక చిహ్నంగా పేర్కొన్న ఈ రాజదండానికి, 2023 మేలో కొత్త పార్లమెంటు భవనంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠించినప్పటి నుంచి రాజకీయ ప్రాధాన్యం పెరిగింది.
సెంగోల్‌ను జాతీయ పాఠ్యపుస్తకంలో చేర్చడం ద్వారా, బ్రిటిష్‌ పాలన నుంచి స్వతంత్ర భారతదేశానికి అధికార బదిలీకి అది ప్రతీకగా నిలిచిందనే వాదనకు సంస్థాగత గుర్తింపు లభిస్తోంది. అయితే, 1947లోజవహర్‌లాల్‌ నెహ్రూకు సెంగోల్‌ను బహూకరించినట్లు చారిత్రక కథనాలు సూచిస్తున్నప్పటికీ, అధికార బదిలీకి అదే అధికారిక చిహ్నంగా నిర్ణయించబడిందనే వాదన వివాదాస్పదంగానే ఉంది. నమోదైన చారిత్రక సంఘటనకు, దానికి ఆ తర్వాత ఆపాదించిన రాజకీయ అర్థానికి మధ్య తేడాను గుర్తించడం చరిత్ర రచనలో అత్యంత కీలకం. మొఘలులు, ఢిల్లీ సుల్తానుల పాలనకు సంబంధించిన అంశాలను ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాల నుంచి తొలగించడం లేదా తగ్గించడం వంటి మార్పుల నేపథ్యంలో ఈ వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. భారతీయ నాగరికత వారసత్వంపై దృష్టి పెడుతున్నామనే వివరణతో చేపట్టిన ఈ మార్పులు, పాఠ్యప్రణాళిక రూపకల్పనకు చారిత్రక పరిశోధన మార్గదర్శకమా, సమకాలీన భావజాల ప్రాధాన్యతలా అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు ఆధారపడే పాఠ్యపుస్తకాలు ఎంపిక చేసిన చరిత్రను మాత్రమే బోధించే సాధనాలుగా మారకూడదు.
చారిత్రక ఆధారాలా? అధికారిక కథనమా?
2023లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వెల్లడించిన కథనం ప్రకారం, అధికార బదిలీకి భారతీ య సంప్రదాయాలకు అనుగుణమైన చిహ్నం ఏమిటని అప్పటి వైస్రాయ్‌ లార్డ్‌ మౌంట్‌బాటన్‌ నెహ్రూను అడిగారు. అనంతరం నెహ్రూ, చరిత్రపై ఆసక్తి కలిగిన సి. రాజగోపాలాచారిని సంప్రదించగా, ఆయన చారిత్రక పరిశోధన అనంతరం సెంగోల్‌ను తగిన చిహ్నంగా సూచించినట్లు పేర్కొన్నారు. అయితే, నెహ్రూకు ఒక రాజదండాన్ని బహూకరించారనే వాస్తవం ఒక్కటే, బ్రిటిష్‌ సార్వభౌమాధికారాన్ని భారతదేశానికి బదిలీ చేసిన అధికారిక చిహ్నం అదే అని నిరూపించదు. మౌంట్‌బాటన్‌, రాజగోపాలాచారిలకు సంబంధించిన ఈ కథనానికి స్వతంత్ర చారిత్రక ఆధారాల ధ్రువీకరణ అవసరం.
చారిత్రక ఆధారాలు నిర్ధారిస్తున్న అంశాలు,
చరిత్రకారులు చేస్తున్న విశ్లేషణలు, ఇంకా వివాదాస్పదంగా ఉన్న విషయాల మధ్య తేడాను బాధ్యతాయుతమైన పాఠ్యపుస్తకం స్పష్టంగా వివరించాలి. రాజకీయంగా ప్రాచుర్యం పొందిన ఒక వ్యాఖ్యానాన్ని స్థిరపడిన చారిత్రక వాస్తవంగా చూపించడం చరిత్ర విద్య లక్ష్యా న్నే దెబ్బతీస్తుంది. తమిళ శైవ సంప్రదాయాలు, రాజరిక ప్రతీకలతో సంబంధం ఉన్న సెంగోల్‌కు సాంస్కృతిక, మతపరమైన ప్రాధాన్యం ఉంది. రాజాధికారానికి, న్యాయబద్ధమైన పాలనకు సంబంధించిన భావనలను ప్రతిబింబించే చారిత్రక వస్తువుగా దాన్ని అధ్యయనం చేయవచ్చు. అయితే, రాజరికానికి సంబంధించిన చిహ్నా న్ని ఆధునిక గణతంత్ర రాజ్య ప్రజాస్వామ్య సార్వభౌమాధి కారంతో సమానంగా చూడలేం.
లౌకిక గణతంత్రంలో మతపరమైన చిహ్నం
సెంగోల్‌కు సంబంధించిన రాజకీయ అర్థాన్ని 1947లోనే ప్రశ్నించారు. ఆ తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసి, ద్రవిడ మున్నేట్ర కళగం (డిఎంకె)ను స్థాపించిన సి.ఎన్‌.అన్నాదురై, స్వాతంత్య్ర సమయంలో ఒక లౌకిక రాజకీయ నాయకుడికి మతపరమైన చిహ్నాన్ని అందించడం ఎంతవరకు సముచితమనే అంశాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించారు. పరిశోధకురాలు, అనువాదకురాలు వి.గీత వివరించిన ప్రకారం, మతాధికారం, సంపద, రాజకీయ అధికారా ల మధ్య ఉన్న సంబంధాన్ని అన్నాదురై ప్రశ్నించారు. కొత్త రాజకీయ వ్యవస్థలోనూ తమ ప్రభావాన్ని కొనసాగించుకోవాలనే ఉద్దేశం మత సంస్థలకు ఈ బహూకరణ వెనుక ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
సెంగోల్‌ను జాతీయ విముక్తికి తిరుగులేని చిహ్నం గా అందరూ అంగీకరించలేదని ఆయన విమర్శ స్పష్టం చేస్తోంది. అది అప్పట్లోనూ రాజకీయ, భావజాల చర్చలకు కేంద్రంగా నిలిచింది. ఈ దృక్పథాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చడం ద్వారా, స్వాతంత్య్రాన్ని ఒకే ఉత్సవపూర్వక సంఘటనకు పరిమితం చేయకుండా, సంక్లిష్టమైన చారిత్రక పరివర్తనగా విద్యార్థులు అర్థం చేసుకునే
అవకాశం ఉంటుంది.
భారతీయ సాంస్కృతిక చరిత్రలో మతపరమైన చిహ్నాలకు స్థానం ఉందా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. వాటికి నిస్సందేహంగా స్థానం ఉంది. రాజరిక, మతపరమైన అధికారాలతో సంబంధం ఉన్న ఒక చిహ్నానికి రాజ్యాంగ ప్రజాస్వామ్య చరిత్రలో నిర్దిష్టమైన, తిరుగులేని అర్థాన్ని ఆపాదించవచ్చా అన్నదే అసలు ప్రశ్న. భారతదేశ స్వాతంత్య్రం వలస పాలనకు ముగింపు పలికి, ప్రజలను స్వతంత్ర దేశ పౌరులుగా నిలబెట్టింది. భారత గణతంత్రానికి పునాదులు ప్రజల సార్వభౌమాధికారం, చట్టం ముందు సమాన త్వం, ప్రజాస్వామ్య సంస్థలు. రాజరిక అధికారాన్ని పవిత్రీకరించడం కాదు. సెంగోల్‌ను ఈ విస్తృత రాజ్యాంగ పరివర్తన నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి.
చోళుల వారసత్వం రాజకీయ స్వాధీనత

సెంగోల్‌కు తిరిగి ప్రాధాన్యం కల్పించడం, తమిళనాడులో బిజెపి తన రాజకీయ ఉనికిని విస్తరించుకునే ప్రయత్నాలతోనూ ముడిపడి ఉంది. లార్డ్‌ ఆఫ్‌ ఎర్త్‌ అండ్‌ సీ: ఎ హిస్టరీ ఆఫ్‌ ది చోళ ఎంపైర్‌ గ్రంథ రచయి త, ప్రజా చరిత్రకారుడు అనిరుధ్‌ కనిసెట్టి అభిప్రాయం ప్రకారం, చోళుల చరిత్రను విస్తృత హిందుత్వ కథనంలో భాగం చేయడం వల్ల ప్రాంతీయ చరిత్ర సమకాలీ న రాజకీయ లక్ష్యాలకు లోబడి పోయే ప్రమాదం ఉంది.
చోళ రాజవంశం పరిపాలన, సముద్ర వాణిజ్యం, వాస్తుశిల్పం, దేవాలయాల నిర్మాణం, కళారంగాల్లో విశేష కృషి చేసింది. దాని చారిత్రక వారసత్వాన్ని సమగ్రంగా, ఆధారాలతో అధ్యయనం చేయాలి. దాన్ని మత జాతీయవాదానికి లేదా సమకాలీన సాంస్కృతిక ప్రతిఘటనకు ప్రతీకగా మాత్రమే కుదించడం దక్షిణ భారత చరిత్రపై ప్రజల అవగాహనను పరిమితం చేస్తుంది.
చారిత్రక వ్యక్తులు, చిహ్నాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం ఏ ఒక్క పార్టీ కి మాత్ర మే పరిమితం కాదు. వివిధ భావజాలాలకు చెందిన ప్రభుత్వాలు ప్రస్తుత అధికారానికి చారిత్రక సమర్థన కల్పించేందుకు గతాన్ని ప్రస్తావిస్తుంటాయి. అయితే, విద్యాసంస్థల బాధ్యత అటువంటి కథనాలను యథాతథంగా ఆమోదించడం కాదు; వాటిని విమర్శనాత్మకం గా పరిశీలించడం. సెంగోల్‌ తమిళ సాంస్కృతిక వారసత్వాన్ని, శైవ సంప్రదాయాలను, న్యాయబద్ధమైన పాలనకు సంబంధించిన ఆదర్శాలను సూచించవచ్చు. ఈ అర్థాలు పరస్పర విరుద్ధమైనవి కావు. కానీ రాజరిక చిహ్నాన్ని ప్రజాస్వామ్య అధికార బదిలీతో సమానంగా చూపించే ఏకపక్ష రాజకీయ కథనంలో వాటన్నింటినీ ఇమిడ్చకూడదు.
పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు ఏమి అందించాలి?
ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాలకు ప్రజల్లో విశేషమైన విశ్వసనీయత ఉంది. ఆధారాలను, వ్యాఖ్యానాలను వేరు చేయడం, చారిత్రక భిన్నాభిప్రాయాలను గుర్తించడం, భావజాలపరమైన సరళీకరణకు దూరం గా ఉండడం ద్వారానే ఆ విశ్వసనీయత నిలబడుతుంది.
సెంగోల్‌ను సాంస్కృతిక వారసత్వ చిహ్నంగా పేర్కొంటే, రాజరికం, శైవ సంప్రదాయాలతో దానికున్న సంబంధాన్ని పాఠ్యపుస్తకం వివరించాలి. 1947లో నెహ్రూకు దాన్ని అందించిన సంఘటనను ప్రస్తావి స్తే, ఆ బహూకరణకు సంబంధించిన ఆధారాలను, అధికార బదిలీకి అదే అధికారిక చిహ్నమనే వివాదాస్పద వాదనను వేరుగా చూపించాలి. సమకాలీన రాజకీయ చర్చలో సెంగోల్‌కు ఆపాదిస్తున్న అర్థాలనూ విద్యార్థులకు పరిచయం చేయాలి. ఇలాంటి విధానం సెంగోల్‌
సాంస్కృతిక ప్రాధాన్యాన్ని తగ్గించదు. చారిత్రక చిహ్నా లు వేర్వేరు కాలాల్లో, రాజకీయ సందర్భాల్లో కొత్త అర్థాలను ఎలా సంతరించుకుంటాయో విద్యార్థులు అర్థం చేసుకునేందుకు దోహదపడుతుంది.
భారత చరిత్రలోని ప్రతి కాలానికీ ఇదే ప్రమాణాలు వర్తించాలి. మొఘలులు, ఢిల్లీ సుల్తానులు, ప్రాంతీయ రాజవంశాలు, మత సంస్థలు, కుల వ్యతిరేక ఉద్యమాలు వంటి అంశాలను ఆనాటి రాజకీయ ప్రాధాన్యతలను బట్టి చేర్చడం లేదా తొలగించడం కాకుండా, ఆధారాలు, విమర్శనాత్మక విచారణల ఆధారంగా బోధించాలి. చరిత్ర విద్య లక్ష్యం ఎంపిక చేసిన పాలకు లు, మత సంప్రదాయాలు లేదా రాజకీయ కథనాల పట్ల గుడ్డి భక్తిని పెంపొందించడం కాదు. గతాన్ని, వర్తమానంపై దాని ప్రభావాన్ని విద్యార్థులు సమగ్రంగా అర్థం చేసుకునేలా చేయడం. సెంగోల్‌కు భారత చరిత్రలో స్థానం ఉంది. కానీ దాన్ని పాఠ్యపుస్తకంలో చేర్చినంత మాత్రాన వివాదాస్పద వ్యాఖ్యానం ప్రశ్నించరాని జాతీయ కథనంగా మారకూడదు. చారిత్రక ఆధారాల కు, రాజకీయ వాదనలకు మధ్య; సాంస్కృతిక స్మృతికి, రాజకీయ స్వాధీనతకు మధ్య; రాజరిక ప్రతీకవాదానికి, ప్రజాస్వామ్య సార్వభౌమాధికారానికి మధ్య తేడాను గుర్తించడం నేర్పడమే విద్య అసలు లక్ష్యం.

ట్యాగ్‌లు: history Modi Today news