Skip to content
లైఫ్ స్టైల్ › వార్తలు

ఆకాశం వైపు అడుగులు..నేలను కోల్పోతున్నామా?

Prajapaksham 29 Oct 2026 0 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
ఆకాశం వైపు అడుగులు..నేలను కోల్పోతున్నామా?

Village life

ఫిరోజ్‌ ఖాన్‌


చంద్రుడిపై అడుగులు వేయాలని, అంగారకుడి రహస్యాలను ఛేదించాలని, అంతరిక్షంలో కొత్త ప్రపంచాలను అన్వేషించాలని మానవ మేధస్సు నిరంతరం ముందుకు సాగుతోంది. ఈ విజయాలు శాస్త్రీయ పురోగతికి గర్వకారణా లు. అయితే అంతరిక్షంలో కొత్త చరిత్రను లిఖిస్తున్న మనిషి, తాను జీవిస్తున్న భూమి భవిష్యత్తును కూడా అంతే శ్రద్ధతో కాపాడుకోవాలి. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 2026 ఫిబ్రవరి 27న ప్రకటించిన ఆర్టెమిస్‌ కార్యక్రమ మార్పులు చంద్రుడిపై మానవ అన్వేషణను మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యాన్ని చాటాయి. ఈ సాంకేతిక విజయాల స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యం ఇచ్చి కార్యాచరణ సాగితే అభివృద్ధికి మరింత సార్థకత చేకూరుతుంది. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల నివేదిక ప్రకారం, 2000 నుంచి 2020 మధ్య ప్రపంచ అటవీ విస్తీర్ణం సుమారు పది కోట్ల హెక్టార్లు తగ్గింది. 2020 నాటికి ప్రపంచ భూభాగంలో అడవుల వాటా 31 శాతంగా నమోదైంది. అటవీ నష్టానికి వ్యవసాయ విస్తరణ ప్రధాన కారణం. ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, శాస్త్రీయ పరిజ్ఞానం, సమర్థవంతమైన విధానాలు, ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి సంపదను పునరుద్ధరించే అవకాశాలు ఇంకా ఉన్నాయి.
స్థానిక జ్ఞానం ప్రపంచానికి వెలుగు
తెలంగాణలోని ఆదిలాబాద్‌ ప్రాంతంతో పాటు మధ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో గోండు సమాజం ప్రకృతి తో ముడిపడిన ప్రత్యేక జీవన సంప్రదాయాలను కొనసాగిస్తోంది. అడవులు, నీటి వనరులు, స్థానిక జీవవైవిధ్యం, సామూహిక ఆచారాలు వారి సాంస్కృతిక వారసత్వంలో భాగం. ఈ వారసత్వాన్ని భావితరాలకు అందించడంలో భాషకు కీలక స్థానం ఉంది. ఆదిలాబాద్‌ జిల్లా గుంజాల గ్రామంతో అనుబంధం కలిగిన గుంజాల గోండి లిపికి యూనికోడ్‌ ప్రమాణంలో ప్రత్యేక కోడ్‌ పరిధి ఉండటం భాషా పరిరక్షణలో ముఖ్యమైన ముందడుగు. దీనివల్ల కంప్యూటర్లు, డిజిటల్‌ పరికరాల్లో ఈ లిపిని ఉపయోగించడం, పుస్తకాలు, పత్రాలను భద్రపరచడం, భాషా సమాచారాన్ని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం సాధ్యమైంది. అయినప్పటికీ డిజిటల్‌ గుర్తింపుతోనే సంస్కృతి పరిరక్షణ పూర్తి కాదు. మాతృభాషలో విద్యకు ప్రోత్సాహం, స్థానిక చరిత్రను పత్రబద్ధం చేయడం, సంప్రదాయ జ్ఞానాన్ని సంబంధిత సమాజా ల సమ్మతితో భద్రపరచడం, యువతకు తమ వారసత్వాన్ని పరిచయం చేయడం అవసరం. గోండు సమా జం ప్రకృతితో ఏర్పరచుకున్న అనుబంధాన్ని గౌరవిస్తూ, వారి భాషకు ఆధునిక సాంకేతిక ప్రపంచంలో తగిన స్థానం కల్పించడం సమ్మిళిత అభివృద్ధికి దోహదపడుతుంది. స్థానిక సంస్కృతిని కాపాడటం అంటే గతాన్ని మాత్రమే సంరక్షించడం కాదు. భవిష్యత్తుకు అవసరమైన జ్ఞానాన్ని కూడా భద్రపరచ డం.
పర్యావరణ సమతుల్యతే అసలైన ప్రగతి
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి ఎదురవుతున్న సవాళ్లు తీవ్రమైనవే అయినప్పటికీ, కొన్ని రంగాల్లో ఆశాజనక మార్పులు కనిపిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి 2025 నివేదిక ప్రకారం, ప్రపంచంలో వార్షిక అటవీ నష్టం 2010 మధ్య సుమారు 1.2 కోట్ల హెక్టార్లుగా ఉండగా, 2015 మధ్య సుమారు కోటి హెక్టార్లకు తగ్గింది. ఇది సానుకూల పరిణామమే అయినా, అడవుల నష్టం పూర్తిగా ఆగలేదన్న వాస్తవాన్ని గుర్తించాలి. మరోవైపు భూక్షీణతకు గురైన భూభాగం ప్రపంచవ్యాప్తంగా 2015లో 11.3 శాతంగా ఉండగా, 2019 నాటికి 15.5 శాతానికి పెరిగింది. దీని ప్రభావం సుమారు 320 కోట్లమంది ప్రజల జీవనంపై పడినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ పరిస్థితుల్లో అటవీ పునరుద్ధరణ, నేల నాణ్యత మెరుగుదల, నీటి వనరుల సంరక్షణ, స్థానిక సమాజాల భాగస్వామ్యానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. మొక్కలు నాటిన సంఖ్య ఒక్కటే విజయానికి కొలమానం కాకూడదు.నాటిన మొక్కలు బతికి పెరుగుతున్నాయా, స్థానిక జీవవైవిధ్యానికి తోడ్పడుతున్నాయా, నేల ఆరోగ్యం మెరుగు పడుతోందా అనే అంశాలను కూడా పరిశీలించాలి.
హక్కుల గౌరవంతోనే సమగ్ర అభివృద్ధి
భారతదేశంలో ఆదివాసీ సమాజాల హక్కులు, జీవనోపా ధి, సాంస్కృతిక గుర్తింపును పరిరక్షించేందుకు రాజ్యాంగం, చట్టాలు కీలకమైన ఆధారాలను కల్పిస్తున్నాయి. రాజ్యాంగంలోని 342వ అధికరణం షెడ్యూల్డ్‌ తెగల గుర్తింపునకు సంబంధించినది. షెడ్యూల్‌ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనకు 1996 పీసా చట్టం, అటవీ నివాసుల హక్కుల గుర్తింపునకు 2006 అటవీ హక్కుల చట్టం ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. అయితే చట్టాల ప్రయోజనం అర్హులైన ప్రజలకు చేరినప్పుడే వాటి లక్ష్యం నెరవేరుతుంది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2026 ఆగస్టు 12న రాజ్యసభకు అందించిన సమాచా రం ప్రకారం, జూన్‌ 30 నాటికి దేశవ్యాప్తంగా అటవీ హక్కుల చట్టం కింద దాదాపు 54,01,561 దరఖాస్తులు అందాయి. వాటిలో 25,42,359 హక్కుల పత్రాలు జారీ కాగా, 18,13, 232 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి; 10,45,970 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. జారీ చేసిన పత్రాల్లో 24,18,197 వ్యక్తిగత హక్కులకు, 1,24,162 సామూహిక హక్కులకు సంబంధించినవిగా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వా లు, స్థానిక సంస్థలు, అటవీ శాఖలు, గ్రామసభలు సమన్వయంతో పనిచేస్తే హక్కుల అమలు మరింత మెరుగుపడుతుంది. అంతరిక్షాన్ని చేరడం మానవ మేధస్సుకు నిదర్శనం. భూమిని భావితరాలకు భద్రంగా అందించడం ఆ మేధస్సుకు అసలైన బాధ్యత. ప్రకృతిని కాపాడే అభివృద్ధి, ఆదివాసీ హక్కులను గౌరవించే పాలన, స్థానిక జ్ఞానానికి గుర్తింపు కలిసినప్పుడే ప్రగతికి సంపూర్ణ అర్థం చేకూరుతుంది. భావితరాలు గర్వం గా చదివే అంతరిక్ష విజయాల చరిత్రను లిఖించడమే కాదు.. అవి గర్వంగా జీవించేలా పచ్చని భూమిని వారసత్వంగా అందించడమే మానవ ప్రగతికి అసలైన విజయం.