Skip to content
లైఫ్ స్టైల్ › వార్తలు

సరిహద్దులు దాటుతున్న సాహిత్య స్వరం

Prajapaksham 26 Oct 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
సరిహద్దులు దాటుతున్న సాహిత్య స్వరం

Prajapaksham

ఒకప్పుడు సాహిత్యానికి కూడా సరిహద్దులు ఉండేవి. ఒక భాషకు ఒక ప్రపంచం, ఒక దేశానికి ఒక సాహిత్య సంప్రదాయం, ఒక సంస్కృతికి ఒక కథనం అన్నట్లుగా ప్రపంచ సాహిత్యం విభజించబడి ఉండేది. కొన్ని ప్రాచీన కావ్యాలు, కొన్ని భౌగోళిక ప్రాంతాలు, కొన్ని ఆధిపత్య భాష మాత్రమే ‘ప్రపంచ సాహిత్యం’ అనే పదానికి ప్రతినిధులుగా నిలిచేవి. కానీ కాలం తన అడుగులు మార్చింది. సాంకేతికత ప్రపంచాన్ని దగ్గర చేసినట్లే, సాహిత్య ప్రపంచాన్నీ విశాలం చేసింది. ఇప్పుడు ఒక మూలన రాసిన కథకు మరో మూలన ఉన్న పాఠకుడి హృదయంలో చోటు దొరుకుతోంది. ఆఫ్రికా నేల నుంచి వినిపించే స్వరం, లాటిన్‌ అమెరికా జ్ఞాపకాల నుంచి పుట్టిన కథ, దక్షిణాసియా జీవితాల నుంచి వెలువడిన అనుభవం, మధ్యప్రాచ్యపు వేదన వంటి ఎన్నో భావాలు, విషయాలు, ఆలోచనలు నేడు భా షల సరిహద్దులను దాటి ప్రపంచ పాఠకుల ముందుకు వస్తున్నాయి. అనువాదం ఈ ప్రయాణానికి వంతెనగా నిలుస్తోంది. నేటి సాహిత్యంలో ప్రక్రియల మధ్య గోడలు కూడా కూలిపోతున్నాయి. చరిత్రతో కల్పన చేయి కలుపుతోంది. సైన్స్‌ ఫిక్షన్‌లో మానవ అనుభూతులు పలుకుతున్నాయి. మాయా వాస్తవికతలో జీవితపు లోతైన సత్యాలు దర్శనమిస్తున్నాయి. ఒకే కథలో అనేక ప్రపంచాలు కలిసిపోతూ పాఠకుడికి కొత్త సాహిత్యానుభూతిని అందిస్తున్నాయి. ప్రకృతి కూడా నేటి సాహిత్యంలో ఒక పాత్రగా మారింది. వాతావరణ మార్పు, అడవుల విధ్వంసం, నీటి కొరత, ప్రకృతి విపత్తులు వంటి ఎన్నో అంశాలు శాస్త్ర నివేదికలలోని గణాంకాల పరిధిని దాటి, మనిషి కన్నీటిలో, కుటుంబాల ఆందోళనలో, భవిష్యత్తుపై పిల్లల భయంలో ప్రతిధ్వనిస్తున్న కథలుగా మారుతున్నాయి. అలాగే, రచయిత తన జీవితాన్నే కథగా మలుచుకునే ‘ఆటోఫిక్షన్‌’ ధోరణి వ్యక్తిగత జ్ఞాపకాలకు సాహిత్యపు కొత్త కిటికీ తెరిచింది. తనలోని మనిషిని ప్రపంచం ముం దు నిలబెట్టే ఈ రచనలు పాఠకుడికి ఒక విచిత్రమైన సాన్నిహిత్యాన్ని కలిగిస్తున్నాయి. ఒకప్పుడు పుస్తకాన్ని పాఠకుడి చేతికి చేర్చేది ప్రచురణ సంస్థ. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఒక పాఠకుడి మాట వేలాది మందిని ఒక పుస్తకం వైపు నడిపించగలదు. ‘బుక్‌టాక్‌’ వంటి వేదికలు పఠన సంస్కృతికి కొత్త ఊపిరినిస్తున్నాయి. అయితే సాహిత్యపు అసలు ప్రయాణం సాంకేతికతలో కాదుమనిషి హృదయంలో. భాషలు వేరైనా కన్నీటి రుచి ఒక్కటే; సంస్కృతులు వేరైనా ప్రేమకు స్పందించే హృదయం ఒక్కటే. అం దుకే నేటి ప్రపంచ సాహిత్యం కేవలం దేశాల మధ్య సంభాషణ కాదు; మ నిషి నుంచి మనిషికి, హృదయం నుంచి హృదయానికి సాగే ఒక నిశ్శబ్ద సంభాషణ. సరిహద్దులు మారవచ్చు. భాషలు మారవచ్చు. కాలం మారవ చ్చు. కానీ ఒక మంచి కథ మాత్రం తన దారిని తానే వెతుక్కుంటుంది. చివరకు అది చేరేది మాత్రం పాఠకుడి హృదయానికే.