పిల్లలకు ఇంటర్నెట్ హక్కు… భద్రత రెండూ అవసరమే!
Internet
ఒకప్పుడు పిల్లల భద్రత అంటే ఇంటి గుమ్మం దాటకుండా చూడటం, అపరిచితులతో మాట్లాడవద్దని హెచ్చరించడం, పాఠశాల నుంచి ఇంటి కి సురక్షితం గా చేరేలా జాగ్రత్త పడటం. ఇప్పుడు ఆ బాధ్యతకు కనిపించని డిజిటల్ ప్రపంచం కూడా తోడైంది. పిల్లల చేతిలోని చిన్న ఫోన్లో పాఠశాల ఉంది.. పుస్తకాలున్నాయి.. విజ్ఞానం ఉంది.. వినోదం ఉంది. అదే తెర వెనుక సైబర్ వేధింపులు, మోసపూరిత పరిచయాలు, వ్యక్తిగత సమాచార దుర్వినియోగం, లైంగిక దోపిడీ ప్రమాదాలూ ఉన్నాయి. అందుకే పిల్లల ఇంటర్నెట్ వినియోగం కుటుంబ సమస్య మాత్రమే కాదు.. బాలల హక్కులు, భద్రత, సాంకేతిక సంస్థల బాధ్యత, ప్రభుత్వాల జవాబుదారీతనానికి సంబంధించిన సామాజిక అంశం.
అక్టోబర్ 15న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఈ చర్చకు కొత్త ప్రాధాన్యం కల్పించాయి. పిల్లలకు ఇంటర్నెట్ వినియోగ హక్కు ఉందని పేర్కొంటూనే, పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్‌ను గుర్తించి తొలగించడంలో ప్రభుత్వాలు, సామాజిక మాధ్యమ సంస్థలు మరింత సమర్థంగా పనిచేయాలని ధర్మాసనం సూచించింది. పిల్లలను రక్షించాలనే పేరుతో ఇంటర్నెట్కు పూర్తిగా దూరం చేయడం పరిష్కారం కాదని, అదే సమయంలో వయసుకు తగిన రక్షణ చర్యలు అవసరమని స్పష్టం చేసింది.
పిల్లలను డిజిటల్ ప్రపంచం నుంచి దూరం చేయడం కాదు.. ఆ ప్రపంచాన్ని పిల్లలకు సురక్షితంగా మార్చడమే అసలు లక్ష్యం!
రాజ్యాంగంలోని 21వ అధికరణం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ కు రక్షణ కల్పిస్తుండగా, 19(1)(ఎ) అధికరణం భావప్రకటన స్వేచ్ఛను గుర్తిస్తుంది. ఇంటర్నెట్ విద్య, సమాచార సేకరణ, భావప్రకటన, ప్రపంచంతో అనుసంధానానికి కీలక వేదికగా మారింది. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు, డిజిటల్ గ్రంథాలయాలు, పోటీ పరీక్షల సమాచారం అందుబాటులోకి వస్తున్నాయి. దివ్యాంగు లు, ప్రత్యేక అవసరాలున్న పిల్లలకూ ఇది ఉపయోగపడుతోంది.
అందువల్ల ఇంటర్నెట్ను పూర్తిగా నిషేధించడం పిల్లల విద్యా, సమాచార అవకాశాలను దెబ్బతీయవచ్చు. అయితే హక్కు ఉందని ఎలాంటి నియంత్రణా అవసరం లేదని భావించడమూ సరికాదు. సెప్టెంబరులో మైనర్ల సామాజిక మాధ్యమ ఖాతాలపై వయసు ఆధారిత నియంత్రణలు, తల్లిదండ్రుల సమ్మతి వంటి అంశాలపై చర్చ జరగగా, అక్టోబర్ 15నాటి ఆదేశాలు పిల్లల హక్కులు, భద్రత రెండింటినీ సమతుల్యం చేయాల్సిన అవసరాన్ని ముందుకు తెచ్చాయి. ఈ అంశాలపై విధాన రూపకల్పనలో స్పష్టత, గోప్యతకు రక్షణ, అమలు సాధ్యత కీలకం.
డిజిటల్ తెర వెనుక ప్రమాదాలు
పిల్లలతో స్నేహం చేస్తున్నట్లు నటించి వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, ఇంటి చిరునామా సేకరించే వ్యక్తులు ఉండవచ్చు. నమ్మకం సంపాదించి న తర్వాత బెదిరింపులు, డబ్బు డిమాండ్లు, అనుచిత చిత్రాల కోసం ఒత్తిళ్లకు దిగవచ్చు. తోటి విద్యార్థుల నుంచి వచ్చే సైబర్ వేధింపులు, అవమానకర సందేశాలు, మార్ఫింగ్ చిత్రాలు పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. వ్యక్తిగత సమాచారం తెలియకుండానే పంచుకోవడం గోప్యతకు ముప్పు కలిగిస్తుంది.
పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన చిత్రాలు, వీడియోలు వ్యాప్తి చెందడం అత్యంత తీవ్రమైన సమస్య. ఒకసారి ఆన్‌లైన్‌లోకి వెళ్లిన కంటెంట్‌ను పూర్తిగా తొలగించడం కష్టమవుతుంది. బాధిత పిల్లలు భయం, అవమానభావం, మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు రాత్రివేళల వరకు ఫోన్ వినియోగించడం, నిద్ర, చదువు, శారీర క ఆటలు, కుటుంబ సంభాషణలకు సమయం తగ్గడం వంటి సమస్యలనూ తల్లిదండ్రులు గమనించాలి.
ఈ ప్రమాదాలన్నింటికీ ఒకే నిషేధం పరిష్కారం కాదు. గోప్యతకు ప్రత్యేక రక్షణ, సైబర్ వేధింపులకు ఫిర్యాదు వ్యవస్థ, లైంగిక దోపిడీకి కఠిన చట్టం అమలు, అధిక వినియోగానికి కుటుంబ క్రమశిక్షణ,
డిజిటల్ అవగాహన అవసరం.
సాంకేతిక సంస్థల బాధ్యత
సుప్రీంకోర్టు ఆదేశాల్లో పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్‌ను గుర్తించి తొలగించే వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఒక వేదికలో తొలగించిన కంటెంట్ మరో వేదికలో మళ్లీ ప్రత్యక్షమవడం, బాహ్య లింకుల ద్వారా వ్యాప్తి చెందడం సమస్యను సంక్లిష్టం చేస్తున్నా యి. ఒకే చిత్రాన్ని లేదా వీడియోను డిజిటల్ గుర్తింపుల ద్వారా గుర్తించే సాంకేతిక పద్ధతులు, హానికర కంటెంట్‌కు సంబంధించిన వెబ్ చిరునామాలను గుర్తించి నిరోధించే చర్యలు ఉపయోగపడవచ్చు.
సామాజిక మాధ్యమ సంస్థలు ఫిర్యాదుల కోసం సులభమైన మార్గా లు కల్పించాలి. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను వేగంగా తొలగించాలి. బాధితుల గోప్యతను కాపాడాలి. పునరావృత వ్యాప్తిని అరికట్టే సాంకేతిక వ్యవస్థలను బలోపేతం చేయాలి. అయితే పర్యవేక్షణ పేరుతో ప్రతి పౌరుడి వ్యక్తిగత సమాచారాన్ని అపరిమితంగా సేకరించడం కూడా సరికాదు. చట్టబద్ధమైన సమాచారాన్ని తప్పుగా తొలగించకుండా, గోప్యత ను కాపాడుతూ చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలపై పురోగతి నివేదిక సమర్పించాల్సి ఉండగా, తదుపరి విచారణ డిసెంబరు 10, 2026న జరగనుంది.
తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్ ఇచ్చి, వారు ఏమి చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే విషయాలను పూర్తిగా పట్టించుకోకపోవడం బాధ్యతారాహిత్యం. అదే సమయంలో ప్రతి సందేశాన్ని రహస్యంగా పరిశీలించడం, నిరంతరం అనుమానించడం కూడా పరిష్కారం కాదు. వయసుకు తగిన వినియోగ నియమాలు, గోప్యతా సెట్టింగులు, తల్లిదండ్రుల నియంత్రణలు, చదువు మధ్య సమతుల్యత అవసరం.
పిల్లలు ఆన్లైన్ వేధింపుల గురించి చెప్పినప్పుడు వారిని నిందించకూడదు. నీ తప్పే అని మందలిస్తే వారు సమస్యలను దాచిపెట్టే ప్రమా దం ఉంది. అపరిచితులు వ్యక్తిగత వివరాలు అడిగినా, రహస్యంగా మాట్లాడాలని ఒత్తిడి చేసినా, అనుచిత చిత్రా లు కోరినా వెంటనే పెద్దల కు చెప్పాలని పిల్లలకు నేర్పాలి. పిల్లలకు భయాన్ని కాదు.. సమస్యను చెప్పగల నమ్మకాన్ని కల్పించాలి.
సుప్రీంకోర్టు ప్రాథమిక స్థాయి నుంచే వయసుకు తగిన రీతిలో శరీర గౌరవం, వ్యక్తిగత హద్దులు, సమ్మతి, ఆరోగ్యకరమైన సంబంధాలు, డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించింది. పిల్లలకు మోసపూరిత పరిచయాలను గుర్తించడం, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవడం, వేధింపులు ఎదురైతే సహాయం కోరడం నేర్పాలి. ఉపాధ్యాయులకు బాధిత పిల్లలతో ఎలా వ్యవహరించాలి, వారి గోప్యతను ఎలా కాపాడాలి, ఎప్పుడు అధికారులకు సమాచారం ఇవ్వాలి అనే అంశాలపై శిక్షణ అవసరం.
విద్యాసంస్థల్లో బాలల సహాయవాణి 1098, సైబర్ నేరాల హెల్ప్‌లైన్ 1930, జాతీయ సైబర్ నేరాల నివేదిక పోర్టల్ వివరాలు అందుబాటులో ఉంచాలి. తెలంగాణలో పాఠశాల విద్యాశాఖ, పోలీసు శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలల హక్కుల కమిషన్ సమన్వయంతో గ్రామీణ ప్రాంతాలకూ తెలుగు భాషలో డిజిటల్ భద్రతా అవగాహన కార్యక్రమాలు విస్తరించాలి.
పిల్లల భవిష్యత్తుకు రక్షణ కవచం నిర్మించాలి
మైనర్ల సామాజిక మాధ్యమ వినియోగంపై పూర్తి నిషేధం విధిస్తే పిల్లలు ప్రత్యామ్నాయ ఖాతాలు లేదా ఇతర మార్గాల ద్వారా ప్రవేశించే అవకాశం ఉంది. వయసు ధ్రువీకరణను తప్పనిసరి చేస్తే వ్యక్తిగత సమాచార సేకరణ, దుర్వినియోగంపై ప్రశ్నలు తలెత్తవచ్చు. అందువల్ల వయసుకు తగిన పరిమితు లు, తల్లిదండ్రుల మార్గదర్శకత్వం, పిల్లలకు ప్రత్యే క భద్రతా సెట్టింగులు, హానికర కంటెంట్‌పై కఠిన చర్యలు, డిజిట ల్ విద్య సమన్వయంతో అమలవ్వాలి.
ప్రభుత్వాలు చట్టాలను సమర్థంగా అమలు చేయాలి. సామాజిక మాధ్యమ సంస్థలు పిల్లల భద్రతను వ్యాపార ప్రయోజనాల కంటే తక్కువగా చూడకూడదు. పాఠశాలలు అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు పిల్లలతో సంభాషించాలి. పోలీసులు బాధితులను నిందించకుండా స్పందించా లి. సమాజం బాధిత పిల్లలపై అపవాదు వేయకుండా అండగా నిలవాలి.
సాంకేతికతను వెనక్కి తిప్పడం సాధ్యం కాదు. పిల్లలను ఇంటర్నెట్ నుంచి పూర్తిగా వేరుచేయడం వాస్తవిక పరిష్కారం కాదు. అయితే రక్షణ లేకుండా డిజిటల్ ప్రపంచంలోకి నెట్టివేయడం మరింత ప్రమాదకరం. హక్కులు ఉండి రక్షణ లేకపోతే పిల్లలు ప్రమాదంలో పడతారు; రక్షణ పేరుతో హక్కులనే తొలగిస్తే వారి విద్య, సమాచార అవకాశాలు దెబ్బతింటాయి. పిల్లల భద్రతకు తాళం వేయడం పరిష్కారం కాదు.. ప్రమాదాలకు తలుపులు మూసి, జ్ఞానానికి మార్గాలు తెరవడమే నిజమైన పరిష్కారం. పిల్లలు స్వేచ్ఛగా నేర్చుకోవాలి, సురక్షితంగా ఎదగాలి, భయం లేకుండా సమస్యలను చెప్పగలగాలి. ఆ బాధ్యత పిల్లలపై మాత్రమే కాదు.. వారి భవిష్యత్తు ను నిర్మిస్తున్న తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వాలు, సాంకేతిక సంస్థలు, సమాజం అందరిపైనా ఉంది.