లులాకే బ్రెజిలియన్ల పట్టం
Lula da Silva
లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, కమ్యూనిస్టు భావాల ప్రాబల్యం ఉన్న బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా
అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతుగల మితవాదులు మట్టికరిచారు. ప్రస్తుత అధ్యక్షుడు, కార్మికవర్గ నాయకుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వ దేశాధ్యక్షునిగా నాల్గవ పర్యాయం, వరుసగా రెండవ పర్యాయం ఎన్నికైనారు. ఆదివారం జరిగిన రెండవ రౌండ్ పోలింగ్‌లో వామపక్ష కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్న లులాకు 51.79 శాతం ఓట్లు లభించగా, పచ్చి మితవాద ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుని కుమారుడు ఫ్లావియో బోల్సనారోకు 48.21 శాతం ఓటర్ల మద్దతు లభించింది. అక్టోబర్ 4న జరిగిన ఎన్నికల్లో లులాకన్నా 2శాతం ఎక్కువ ఓట్లు పొందిన ఎఫ్.బోల్సనారో రెండవ రౌండ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే లులా వర్కర్స్ పార్టీ, బ్రెజిలియన్ కమ్యూనిస్టు పార్టీతో కూడిన కూటమి నాయకులు, కార్యకర్తలు తొలి దఫా లులాకు ఓటు చేయని కార్మికులకు, ఎవరికీ ఓటుచేయని తటస్థులకు నచ్చజెప్పి పెద్ద సంఖ్యలో ఓటింగ్‌కు తీసుకురావటం వల్ల ఈ విజయం సాధ్యమైంది. బ్రెజిల్ సహా లాటిన్ అమెరికా దేశాల రాజ్యాంగాల నిర్దేశన ప్రకారం ఎన్నికల తొలి దఫా పోలింగ్‌లో ఏ అభ్యర్థికైనా 50శాతం పైగా ఓట్లు లభించకపోతే, ఆ ఎన్నికల్లో మొదటి, రెండవ స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల మధ్య రెండవ దఫా పోలింగ్ జరపాలి. మన దేశంలోలాగా అభ్యర్థుల్లో ఎకువ ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటించే అవకాశం లేదు. అందువల్ల మైనారిటీ ఓటుతో అందలమెక్కి మెజారిటీ ప్రజలను పరిపాలించే వీలు లేదు. రెండవ రౌండ్లో 80సంవత్సరాల వయస్కుడైన లులాకు 45ఏళ్ల ఫ్లావియో బోల్సనారో కన్నా 3.58 శాతం ఓట్లు అదనంగా లభించాయి. అంటే లులాకు తొలి దఫాకన్నా 5.58శాతం ఓట్లు అదనంగా లభించాయి. పరిపూర్ణ సంఖ్యలు లులా విజయం లోతును తెలియజేస్తాయి. లులా తొలిరౌండ్ లో ప్రత్యర్థికన్నా 22 లక్షల ఓట్లు వెనుకబడ్డారు. కాగా రెండవ రౌండ్లో తొలి రౌండ్‌తో పోల్చితే 65 లక్షల ఓట్లు అదనంగా లభించాయి. ఇది వామపక్ష కూటమి మూడు వారాల్లో సాధించిన అద్భుతమైన విజయం. ఒపీనియన్ పోల్స్ చివరి దశవరకు మితవాదులదే పైచేయిగా చిత్రించాయి.
ఇదెలా సాధ్యమైంది? వర్కర్స్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలకు ట్రేడ్ యూనియన్లలో పెద్ద పునాది ఉంది. తొలి రౌండ్ ఓటమి తర్వాత ప్రతి టియు సభ్యుడూ ఒక కొత్త ఓటరును కలిసి మితవాద ప్రమాదం గూర్చి నచ్చజెప్పి లులాకు అనుకూలంగా ఓటు చేసేటట్లు ప్రయత్నించాలని కోరటం జరిగింది. బ్రెజిల్ అమెరికన్ల వలసపాలన ప్రాంతం కాకుండా నివారించేందుకు లులాకు ఓటు చేయాలంటూ ఎన్నికల ప్రచారంలోకి జాతీయవాదం చొప్పించారు. లులా కూడా సవాలుగా తీసుకుని అధ్యక్షుడు ట్రంప్ తొత్తు అయిన పచ్చి మితవాది బోల్సనారో పాలననుంచి దేశాన్ని కాపాడుకోవలసిందిగా బ్రెజిలియన్లకు విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తి వామపక్షయేతర పౌరులను కూడా తాకినట్లు ఎన్నికల ఫలితం నుంచి అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ పని
గట్టుకుని లాటిన్ అమెరికా దేశాల్లో పచ్చి మితవాద ప్రభుత్వాల స్థాపనకు సహాయపడుతున్న నేపథ్యంలో, వామపక్షపాలన కింద ఉన్న అతిపెద్ద దేశమైన బ్రెజిల్ అధ్యక్ష ఎన్నిక ఫలితం కోసం లాటిన్ అమెరికా దేశాల్లోని వామపక్షాలన్నీ ఆసక్తితో ఎదురుచూశాయి. అందువల్ల లులా ఎన్నిక ఒక్క బ్రెజిల్కేగాక అమెరికా ఖండంలోని వామపక్ష, ప్రజాతంత్ర పార్టీలకు, నాయకులకు, కార్యకర్తలందరికీ, ప్రగతిశీల ప్రజలందరికీ సంతోషకరం, ఉత్తేజదాయకం.
శనివారం జరిగిన తుది ఎన్నికల సభకు హాజరైన 10లక్షలమంది, అప్పటికే విజయం ఖాయమైనదన్నట్లుగా వేడుక జరుపుకున్నారు. ఫలితం ప్రకటన అనంతరం శావొపాల్లో సభలో లులా ప్రసంగిస్తూ,
“దేశంలో పరిపాలన తీరును మార్చుతాం. ఈ ఎన్నిక నిరాకరణ వాదానికి ఓటమి. భగవంతునికీ, బ్రెజిలియన్ ప్రజలకు నా ధన్యవాదాలు. ప్రజాస్వామ్యం వల్ల ఇది సాధ్యమైంది” అన్నారు. “అధ్యక్షా, మీరు రెండవసారి బ్రెజిలియన్ డెమొక్రసీని కాపాడారు” అని ఉపాధ్యక్షుడు గెరెల్లో అలెక్మిన్ కొనియాడారు. జెయిర్ బోల్సనారో సాగించిన ప్రజావ్యతిరేక పాలన, లులాను తప్పుడు కేసులతో జైల్లో నిర్బంధించటం, కోర్టు ఆదేశంపై నిర్దోషిగా విడుదలైన లులా నాలుగేళ్ల క్రితం అధ్యక్ష ఎన్నికల్లో మూడవసారి గెలిచి తొలిసారి ప్రజాస్వామ్యాన్ని రక్షించారు. మాజీ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో 2022 ఎన్నికల్లో లులా గెలిచిన తదుపరి దాన్ని అంగీకరించ కుండా తిరుగుబాటుకు ప్రయత్నించిన నేరారోపణపై సుప్రీంకోర్టు విధించిన 27 మాసాల శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన కుమారుడైన ఫ్లావియో బోల్సనారో తన ఓటమిని అంగీకరించకుండా, ఈ ఎన్నిక రద్దు కోసం తన లీగల్ టీం పోరాడుతుందని చెప్పటం విచారకరం. గత రెండు సంవత్సరాల్లో అర్జెంటీనా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, బొలీవియాల్లో ట్రంప్ ప్రత్యక్ష, పరోక్ష జోక్యాలతో పచ్చి మితవాదులు అధికారంలోకి వచ్చారు. ఆ క్రమాన్ని బ్రెజిలియన్లు అడ్డుకున్నారు. అయితే 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో మలుపులు చూసిన డా సిల్వాకు వయోభారంతోపాటు కొత్త అసెంబ్లీలో మైనారిటీలో ఉండటం ఇబ్బందికర పరిస్థితి. ఆయన అధ్యక్షునిగా ఎన్నికైనప్పటికీ, డిప్యూటీల ఛాంబర్(పార్లమెంటు), రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆయన కూటమి మైనారిటీలో ఉంది. అందువల్ల తన విధానాల అమలుకోసం అధ్యక్షుడు లులాకు
గడసాము తప్పదు.