బిజెపి సందిగ్ధావస్థ
bjp
బంతిని ఎంతగట్టిగా గోడకేసి కొడితే అది అంతవేగంగా తిరిగివచ్చి విసిరిన వ్యక్తికే తగులుతుందనేది నానుడి. ‘సర్’ పేరుతో ‘ఓట్ చోరీ’కి వ్యతిరేకంగా దేశంలో సాగుతున్న ఉద్యమాన్ని, ముఖ్యంగా బొద్దింకల జనతాపార్టీ ఆందోళనను అణచివేయటానికి నరేంద్రమోదీ ప్రభుత్వం ఎంతగట్టిగా ప్రయత్నిస్తే అది అంతగా విస్తరిస్తున్నది, కొత్త రూపాలు సంతరించుకుంటున్నది, కొత్త తరగతులు చేరుతున్నారు. తాజాగా మేధావులతో పాటు రైతులు చేరారు. ‘నీట్’ ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా సిజెపి పిలుపుపై యువత ఆందోళనకు తలొగ్గి విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించిన మోదీ, అమిత్ షాలు ఆ తర్వాత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. జన్ జీ తరాన్ని బుజ్జగించటం కోసం వారిని ఆకర్షించే భాషలో మాట్లాడారు. పిల్లలకు సుద్దులు చెప్పాలని తల్లిదండ్రులకు హితవులు చెప్పారు. మంత్రులు యూనివర్శిటీలు సందర్శించి విద్యార్థులతో సంభాషణ నిర్వహించారు. ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద నిరవధిక ఆందోళనలో సమీప ఉత్తర రాష్ట్రాలనుంచే యువత విరివిగా పాల్గొన్నారు. పిల్లల ద్వారా తల్లిదండ్రులు ప్రభావితం కావటం సులభం గనుక దాన్ని నివారించి తమ ఓటు బ్యాంక్ కాపాడుకునేందుకు ఆ మార్గం ఎంచుకున్నారు. అదే సమయంలో పట్టభద్రుల్లో నైపుణ్యాభివృద్ధి, ఆన్‌లైన్ కోచింగ్, ఉద్యోగ కల్పన వంటి కార్యక్రమాలు కూడా ప్రకటించారు. ఇంతలో ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఎన్నికల కమిషన్‌లో అంతర్గత విభేదాలపై ప్రచురించిన ప్రత్యేక కథనం 13 కోట్ల ఓట్ల తొలగింపు నేపథ్యం లో సిఇసి జ్ఞానేష్‌కుమార్ ఏకపక్ష నిర్ణయాలు, బిజెపి పట్ల పక్షపాతం వ్యవహారం, మిగతా ఇద్దరు కమిషనర్‌లు గత 10నెలల్లో 18సార్లు అభ్యంతరాలు తెలియజేసినా పట్టించుకోని వైనం ఇండియా కూటమి పార్టీల ‘ఓటు చోరీ’ వ్యతిరేక ఆందోళనకు కొత్త విశ్వసనీయత, వ్యాప్తి కలుగజేసింది. సిజెపి కూడా అదే ఉద్యమం చేబట్టటంతో బిజెపిలో దడపుట్టినట్లు ఆ తదుపరి ప్రభుత్వం చేబట్టిన అణచివేత చర్యలు రూఢి చేస్తున్నాయి. ప్రజల ఆందోళనలకు నిర్దేశిత ప్రదేశంగా ఉన్న జంతర్ మంతర్‌ను, అక్టోబర్ 12న డీ నోటిఫై చేసి మూసివేసి, అధికార కేంద్రానికి బహుదూరంగా రెండు వేర్వేరు ప్రదేశా ల్లో ఆందోళన చేసుకో పొమ్మంది. అక్టోబర్ 10న ప్రారంభమైన సిజెపి రెండవ దశ ఆందోళనలో ఢిల్లీ పోలీసులు వేలాదిమందిని అరెస్టు చేశారు, జంతర్‌మంతర్ వైపు రోడ్లు బంద్ చేశారు, అన్ని రకాల రవాణా నిలుపు చేయటమేగాక మెట్రోరైళ్లు, రైళ్లు రద్దు చేశారు, ఇంటర్నెట్ బంద్ చేశారు. జంతర్‌మంతర్‌ను తిరిగి అధీనంలోకి తీసుకుంటామని సిజెపి, ఇండియా కూటమి
ప్రతినబూనాయి.
అక్టోబర్ 13న జంతర్‌మంతర్ వద్ద త్రివర్ణ జాతీయ పతాకాలను చేబూనినందుకు ముగ్గురు సిజెపి నాయకులను, ఇంకా అనేకమంది ఇతరులను అరెస్టు చేశారు. సిజెపి ముఖ్య నాయకులు సౌరవ్‌దాస్, అశుతోష్ రాంకాలను వారం రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. మేజిస్ట్రేట్ ఉత్తర్వుపై వారిని 21వ తేదీన బెయిలుపై విడుదల చేసినా, విచారణకు రావాలంటూ పోలీసులు వేధిస్తున్నారు.
‘ఓట్ చోరీ’ వ్యతిరేక ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధిపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా చేస్తున్న నిందారోపణలు, ఉపయోగిస్తున్న దిగజారుడు భాష చూస్తుంటే వారిలోని అక్కసును గ్రహించవచ్చు. ప్రధానమంత్రి మోదీ ఎన్‌డిటివి ఏర్పాటు చేసిన వరల్డ్ సమ్మిట్‌లోగురువారం నాడు మాట్లాడుతూ ఉపయోగించిన పదాలు ఆయన స్థాయిని దిగజార్చాయి. ప్రపంచ ప్రతినిధుల సమావేశంలో సాధారణ ఎన్నికల సభ భాషలో మాట్లాడారు. భారతదేశ ప్రతిష్టను కాంగ్రెస్ విదేశాల్లో దిగజార్చుతున్నదన్నారు. దాని నాయకుడు రాహుల్ గాంధిని ఒక ‘విఫలం చెందిన వ్యక్తి’ అని, దేశంలో ‘అశాంతిని స్వప్నిస్తున్నాడని’ నిందించారు. ఆయన, హోంమంత్రి అమిత్ షా అదేరోజు ఢిల్లీలో ఒక సభలో మాట్లాడుతూ, రాహుల్ విదేశీ పర్యటనలను ఎద్దేవా చేశారు. ప్రజలు బిజెపికిచ్చిన తీర్పును మీరు తిరస్కరించలేరంటూ, ఇంకో 30 ఏళ్లు బిజెపిదే అధికారం అంటూ గాంభీర్యం ప్రదర్శించారు. ఇదిలా వుండగా, ప్రజల ఓటు హక్కు రక్షణకై సాగుతున్న ప్రజాస్వామిక ఉద్యమానికి వ్యతిరేకంగా బిజెపి వారం రోజులపాటు దేశవ్యాపిత కార్యక్రమం తలపెట్టటం గర్హించదగింది. అయితే ఈ సమావేశాలు ‘ఓట్‌చోరీ’ వ్యతిరేక ఆందోళన ప్రభావాన్ని తగ్గించలేవు. రాజకీయ పార్టీలు, సిజెపి, ఇతర విద్యార్థి సంఘాల ఆందోళనతోపాటు, మేధావులు, భిన్న పౌర సామాజిక తరగతులతో కూడిన ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ అక్టోబర్23(శుక్రవారం)న చేబట్టిన ఆందోళన ప్రాధాన్యత గలది. సిజెపి, ఇండియా కూటమి కూడా ఇందులో పాల్గొన్నాయి. వారి నినాదం ‘హర్ హాత్ మే తిరంగా, హర్ గలీ మే జంతర్ మంతర్’ (ప్రతి చేతిలో జాతీయ జెండా, ప్రతి వీధి జంతర్ మంతర్). నాలుగు ప్రధాన కోర్కెలతో సిఇసి జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలి, సర్ రద్దు చేయాలి, ఎన్నికల కమిషనర్‌ల నియామకానికి సంబంధించిన 2023 చట్టం రద్దు చేయాలి, పేపర్ బ్యాలెట్ల కు తిరిగి వెళ్లాలి ఆందోళన కింది స్థాయి వరకు వెళ్లింది. ఉద్యమాన్ని అణచివేసినా లేక ఉపేక్షించినా బిజెపికి రాజకీయంగా నష్టమే. తక్షణం జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించి ఎన్నికల కమిషన్‌లో విశ్వసనీయత పునరుద్ధరించటమే ప్రధాని ముందున్న మార్గాంతరం!