Skip to content
ఆంధ్రప్రదేశ్ › వార్తలు

Bay of Bengal Cyclone Alert: సోమవారం నాటికి తుపానుగా మారనున్న అల్పపీడనం.. ఏపీలో విస్తారంగా వర్షాలు, ఏపీఎస్డీఎంఏ హెచ్చరిక..

jagan 23 Oct 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Bay of Bengal Cyclone Alert: సోమవారం నాటికి తుపానుగా మారనున్న అల్పపీడనం.. ఏపీలో విస్తారంగా వర్షాలు, ఏపీఎస్డీఎంఏ హెచ్చరిక..

Weather Alert: High Alert for Coastal Areas as Depression Intensifies Over Bay of Bengal

Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం శరవేగంగా వాయుగుండంగా మారే సూచనలతో.. ఆంధ్రప్రదేశ్ వైపు తుపాను ముప్పు పొంచి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ఈ అల్పపీడనం సోమవారానికి తుపానుగా రూపాంతరం చెంది ఏపీ, దక్షిణ ఒడిశా తీరాల వైపు పయనించే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు, పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా రైతాంగం తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.

తూర్పు మధ్య , ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడినట్లు ప్రఖర్ జైన్ వివరించారు. ఈ వాతావరణ వ్యవస్థ పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తూ రాబోయే 24 గంటల్లో, అంటే శనివారం నాటికి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత మరింత తీవ్రరూపం దాల్చి ఆదివారానికి తీవ్ర వాయుగుండంగా, సోమవారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలమైన తుపానుగా (Cyclonic Storm) మారే అవకాశం ఉందని వాతావరణ నమూనాలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు.

తుపానుగా బలపడిన అనంతరం ఇది ఉత్తరాంధ్ర , దక్షిణ ఒడిశా తీరాల వైపుగా కదిలే సూచనలు ఉన్నాయని ప్రఖర్ జైన్ వెల్లడించారు. వర్షాలు, ఈదురుగాలులు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇక బంగాళాఖాతంలో సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారనున్న నేపథ్యంలో, ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు ఎలాంటి జాప్యం చేయకుండా వెంటనే సమీప తీరాలకు, సురక్షిత ప్రాంతాలకు తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. విపత్తుల నిర్వహణ సంస్థ , వాతావరణ శాఖ నిరంతరం ఈ తుపాను కదలికలను పరిశీలిస్తున్నాయని, ప్రజలు కేవలం అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మి అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.