Cyclone Arnab: ఏపీ వైపు దూసుకొస్తున్న అర్ణబ్ తుపాను.. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
Weather Alert: High Alert for Coastal Areas as Depression Intensifies Over Bay of Bengal
Cyclone Arnab: తూర్పుమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ఈ అల్పపీడనం ఇవాళ రాత్రిలోపు వాయుగుండంగా, రేపటికి తీవ్ర వాయుగుండంగా బలపడనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయానికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఇది తుపానుగా రూపాంతరం చెంది, బుధవారం ఉదయానికి కోస్తాంధ్ర తీరానికి చేరుకునే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా మంగళ, బుధవారాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తీరం వెంబడి గంటకు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని, వాటిని ఇతరులకు షేర్ చేయవద్దని సూచించారు. అత్యవసర సహాయం, తుపాను తాజా వివరాల కోసం ఎస్డీఎంఏ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, అలాగే 18004250101 సంప్రదించాలని కోరారు.