Skip to content
బిజినెస్ › వార్తలు

ఎస్‌బిఐ డేటా లీక్‌ : ఖాతాదారుల వివరాలకు రక్షణ ఎక్కడ?

Prajapaksham 24 Oct 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
ఎస్‌బిఐ డేటా లీక్‌ : ఖాతాదారుల వివరాలకు రక్షణ ఎక్కడ?

SBI

డా. ముచ్చుకోట సురేష్‌ బాబు.

3,897 మంది ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం డార్క్‌ వెబ్‌లో గుర్తింపు.. దర్యాప్తు చేస్తున్న ఎస్‌బీఐ.. ఖాతాదారులకు మాత్రం అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు. అసలు ప్రశ్న ఏమిటంటే.. కస్టమర్ల డేటాను కాపాడాల్సిన బాధ్యత బ్యాంకుదా, లేక తమ సమాచారాన్ని తామే కాపాడుకోవాల్సిన బాధ్యత ఖాతాదారులదా?
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కు సంబంధించిన డేటా లీక్‌ అనుమానాలు బ్యాంకింగ్‌ వ్యవస్థలో సైబర్‌ భద్రత, జవాబుదారీతనంపై కీలక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. డార్క్‌ వెబ్‌లో లభించిన సుమారు 3.75 లక్షల రికార్డులను ప్రాథమికంగా పరిశీలించగా, 3,897 రికార్డుల్లో ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం ఉన్నట్లు గుర్తించినట్టు బ్యాంకు వెల్లడించింది.
ఖాతాదారుల పేర్లు, మొబైల్‌ నంబర్లు, పుట్టిన తేదీలు, ఈ-మెయిల్‌ చిరునామాలు, నివాస చిరునామాలతో పాటు బ్యాంకు శాఖలు, CIF గుర్తింపు సంఖ్యలు, రుణాలకు సంబంధించిన వివరాలు కూడా ఆ రికార్డుల్లో ఉన్నట్లు నివేదిక పేర్కొ ంది.
అక్టోబర్‌ 16న హెచ్చరికలు అందుకున్న బ్యాంకు దర్యాప్తు ప్రారంభించింది. అక్టోబర్‌ 21న స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది. అయితే, సమాచారం ఎక్కడి నుంచి బయటపడింది, దాని పూర్తి పరిధి ఎంత అనే విషయాలు ఇంకా నిర్ధారణ కాలేదు.
భద్రత బ్యాంకు బాధ్యత.. అప్రమత్తత మాత్రం
ఖాతాదారులకేనా?
బ్యాంకు ఖాతా తెరవాలంటే ఆధార్‌, పాన్‌, చిరునామా, మొబైల్‌ నంబర్‌, ఇతర వ్యక్తిగత వివరాలు సమర్పించాల్సిందే. ఖాతాదారుల గుర్తింపును ధ్రువీకరించేందుకు బ్యాంకులు కఠినమైన నిబంధనలు అమలు చేస్తాయి. మరి అదే సమాచారా న్ని భద్రంగా ఉంచడంలో కూడా అంతే కఠినమైన ప్రమాణా లు పాటిస్తున్నాయా?
డేటా లీక్‌ అనుమానాలు వచ్చినప్పుడు ఖాతాదారులకు సాధారణంగా వినిపించే సూచనలు మాత్రం మారవు: ఒటిపి చెప్పొద్దు, అనుమానాస్పద లింకులపై క్లిక్‌ చేయొద్దు, మోసపూరిత కాల్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ సూచనలు అవసరమే. కానీ వాటితోనే బ్యాంకు బాధ్యత ముగిసిపోదు. ఖాతాదారులు తమ పాస్‌వర్డ్‌ను కాపాడుకోవాలి. మరి ఖాతాదారు ల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
డేటా లీక్‌ కాలేదని నిరూపించాల్సిన అవసరం లేదా?
ప్రస్తుత ఘటనలో సమాచారం నిజమైనదా, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ వ్యవస్థ ద్వారా బయటపడింది అనే అంశాలపై ఎస్‌బిఐ దర్యాప్తు చేస్తోంది. కాబట్టి బ్యాంకు నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఇప్పుడే తేల్చడం సరికాదు. అయితే, ఒక పెద్ద బ్యాంకుకు సంబంధించిన ఖాతాదారుల సమాచారం డార్క్‌ వెబ్‌లో కనిపించిందనే విషయం స్వతంత్రంగా పరిశీలించాల్సిన తీవ్రమైన హెచ్చరిక. కస్టమర్ల నుంచి ప్రతి వివరాన్నీ అడిగే వ్యవస్థలు, తమ వద్ద ఉన్న ఆ వివరాలను ఎవరు యాక్సెస్‌ చేస్తున్నారు, అవి ఎక్కడ నిల్వ ఉన్నాయి, థర్డ్‌పార్టీ సంస్థలకు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి అనే విషయాల్లోనూ పారదర్శకంగా ఉండాలి. బ్యాంకింగ్‌లో నమ్మకం అనేది ప్రకటనలతో నిలబడదు. డేటా భద్రత, పారదర్శకత, తప్పు జరిగితే బాధ్యత స్వీకరించడంతోనే నిలబడుతుంది.
డార్క్‌ వెబ్‌లో సమాచారం.. ఖాతాదారుల ముందుకు మోసగాళ్లు?
పేరు, ఫోన్‌ నంబర్‌, చిరునామా, రుణ వివరాలు వంటి సమాచారం మోసగాళ్ల చేతికి చేరితే, వారు బ్యాంకు అధికారుల్లా నటించడం సులభమవుతుంది. ఖాతాలో సమస్య ఉందని, రుణ దరఖాస్తు నిలిచిపోయిందని లేదా KYC వివరాలను నవీకరించాలని చెప్పి ఖాతాదారులను మోసంచేసే ప్రమాదం ఉం ది.
ఇలాంటి సందర్భాల్లో ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలి. కానీ వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుం డా ముందస్తు రక్షణ కల్పించడం కూడా బ్యాంకింగ్‌ వ్యవస్థ బాధ్యతే. సైబర్‌ నేరగాళ్లు కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతుంటే, బ్యాంకుల భద్రతా వ్యవస్థలు కూడా అంతే వేగం గా మెరుగుపడాలి. ఘటన జరిగిన తర్వాత స్పందించడం మాత్రమే కాకుండా, ప్రమాదాలను ముందుగానే గుర్తించే వ్యవస్థలు ఉండాలి.
బ్యాంకింగ్‌ వ్యవస్థపై ఉండాల్సిన కఠినమైన
నిబంధనలు
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు దర్యాప్తు ప్రకటనతో సరిపెట్టకుండా, బ్యాంకులు తమ భద్రతా వ్యవస్థలపై సమగ్ర సమీక్ష చేపట్టాలి. డేటా లీక్‌కు మూలం ఏమిటి, ఎన్ని రికార్డు లు ప్రభావితమయ్యాయి, ఏ భద్రతా లోపాలు ఉన్నాయి, భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా ఏ చర్యలు తీసుకుంటున్నారు అనే వివరాలను సాధ్యమైనంత పారదర్శకంగా వెల్లడించాలి. బ్యాంకింగ్‌ వ్యవస్థలో మరింత కఠినమైన సైబర్‌ భద్రతా ఆడిట్లు, థర్డ్‌పార్టీ సేవలందించే సంస్థలపై సమర్థవంతమైన పర్యవేక్షణ, అవసరానికి మించిన డేటా యాక్సెస్‌పై నియంత్రణ, అనుమానాస్పద కార్యకలాపాలపై తక్షణ హెచ్చరికలు తప్పనిసరిగా ఉండాలి.
అలాగే, డేటా ఉల్లంఘన నిర్ధారణ అయినప్పుడు ప్రభావిత ఖాతాదారులకు సకాలంలో సమాచారం అందించడం, మోసాల ప్రమాదాన్ని తగ్గించేందుకు అవసరమైన సహాయం అందించడం, సంబంధిత నియంత్రణ సంస్థలకు నివేదించ డం వంటి చర్యలకు స్పష్టమైన జవాబుదారీతనం ఉండాలి. నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘన నిర్ధారణ అయితే,
వర్తించే చట్టాలు, నియంత్రణ నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలి.
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సంబంధిత నియంత్రణ సంస్థలు కూడా ఈ తరహా ఘటనల్లో భద్రతా ప్రమాణాల అమలు, నివేదికల సమర్పణ, దిద్దుబాటు చర్యలు, అవసరమైన చోట జరిమానాల విషయంలో కఠినంగా వ్యవహరించాలి.
ఎస్‌బిఐ ప్రకారం, ఈ ఘటన వల్ల బ్యాంకు ప్రధాన కార్యకలాపాలకు గణనీయమైన అంతరాయం కలగలేదు. అయితే, సేవలు సాధారణంగా కొనసాగుతున్నాయన్న విషయం ఒక్కటే కస్టమర్ల డేటా భద్రతపై ఉన్న ప్రశ్నలకు సమాధానం కాదు. బ్యాంకు దర్యాప్తు పూర్తి చేసి, సమాచారం ఎక్కడి నుంచి బయటపడిందో, ఎన్ని మంది ఖాతాదారులు ప్రభావితమయ్యే అవకాశం ఉందో, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏ చర్యలు తీసుకుంటుందో స్పష్టంగా తెలియజేయాలి.
ఖాతాదారుల నుంచి నమ్మకాన్ని కోరే బ్యాంకింగ్‌ వ్యవస్థ, ఆ నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యతను కూడా సమానంగా తీసుకోవాలి. డిజిటల్‌ బ్యాంకింగ్‌ యుగంలో భద్రత అనేది అదనపు సౌకర్యం కాదు. అది బ్యాంకింగ్‌ సేవలో అంతర్భాగం.