Skip to content
బిజినెస్ › వార్తలు

Driving Licence New Rules 2026: డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్.. భారతీయులు, విదేశీయులకు వేర్వేరు రంగులు..

jagan 23 Oct 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
Driving Licence New Rules 2026: డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్.. భారతీయులు, విదేశీయులకు వేర్వేరు రంగులు..

Driving Licence New Rules 2026

Driving Licence New Rules 2026: దేశంలో డ్రైవింగ్ లైసెన్సింగ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా భారత పౌరులకు , విదేశీయులకు వేర్వేరు రంగుల్లో డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. కొత్త విధానం ద్వారా వాహనదారులను సులభంగా గుర్తించడంతో పాటు, కార్డుపై వారి జాతీయతను (Nationality) కూడా స్పష్టంగా ముద్రించనున్నారు. ఈ మేరకు కేంద్ర మోటారు వాహన నిబంధనల సవరణల కోసం మంత్రిత్వ శాఖ ఒక కీలక ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

బోగస్ పత్రాలు, నకిలీ సర్టిఫికెట్లతో అక్రమంగా లైసెన్సులు పొందడాన్ని అరికట్టడమే ఈ ప్రతిపాదిత మార్పుల ప్రధాన లక్ష్యం. ఇప్పటివరకు వయసు, చిరునామా ధ్రువీకరణల కోసం నోటరీ లేదా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు ఇచ్చే అఫిడవిట్లను, జీవిత బీమా (ఎల్ఐసీ) పాలసీలను ఆధారాలుగా సమర్పించే వెసులుబాటు ఉండేది. అయితే వీటిని దుర్వినియోగం చేస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు గుర్తించడంతో, ఇకపై అఫిడవిట్లు, ఎల్ఐసీ పాలసీలను ధ్రువీకరణ పత్రాలుగా అంగీకరించబోమని ముసాయిదా నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

వాహనదారుల భద్రతను మెరుగుపరిచేందుకు ఆన్‌లైన్‌లో నిర్వహించే సేఫ్-డ్రైవింగ్ ట్యుటోరియల్ అసెస్‌మెంట్ నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. ఇందులో అర్హత సాధించడానికి ఇప్పటివరకు ఉన్న 60 శాతం పాస్ మార్కును 75 శాతానికి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ సేఫ్-డ్రైవింగ్ ట్యుటోరియల్ కనీసం 30 నిమిషాల పాటు వ్యవధి కలిగి ఉంటుందని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల సమయంలో వేగంగా వైద్య సహాయం అందించడానికి వీలుగా ప్రతి లైసెన్సుపై వాహనదారుడి రక్తపు గ్రూపు (Blood Group), మొబైల్ నంబర్ , అత్యవసర కాంటాక్ట్ (Emergency Contact) వివరాలను తప్పనిసరిగా ముద్రించనున్నారు. అదే సమయంలో, ఆధార్ ప్రామాణీకరణ (Aadhaar Authentication) ద్వారా ఆన్‌లైన్‌లో తమ చిరునామా, పేరు లేదా ఇతర వివరాలను మార్చుకునే దరఖాస్తుదారులకు సంబంధిత ఫీజుల నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు.

చిరునామా, వయసు, గుర్తింపు నిరూపణ కోసం ఏయే అధికారిక పత్రాలు చెల్లుబాటు అవుతాయో ప్రభుత్వం సవరించిన నిబంధనల్లో స్పష్టంగా పేర్కొంది. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, ఈ-రేషన్ కార్డ్, ఇటీవలి కరెంట్ లేదా గ్యాస్ బిల్లులను మాత్రమే చిరునామా రుజువుగా అనుమతిస్తారు. అలాగే లైసెన్సులలో మార్పులు చేర్పుల కోసం చేసుకునే దరఖాస్తులను 15 రోజుల్లోగా, చిరునామా మార్పు దరఖాస్తులను 30 రోజుల్లోగా పరిష్కరించాలని ఆర్టీవో అధికారులకు కాలపరిమితి విధించారు. ఒకవేళ నిర్దేశిత 30 రోజులు దాటినా అధికారుల నుంచి నిర్ణయం రాకపోతే, ఆ దరఖాస్తు ఆటోమేటిక్‌గా ఆమోదం పొందినట్లుగా (Deemed Approved) భావిస్తారు.

ప్రస్తుతం ఈ నూతన సవరణలన్నీ ముసాయిదా (Draft) దశలోనే ఉన్నాయని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ నుంచి 30 రోజుల పాటు ప్రజలు, నిపుణుల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించిన అనంతరం తుది నిబంధనలను ఖరారు చేసి అమలులోకి తీసుకురానున్నారు.

ట్యాగ్‌లు: business news Driving Licence