Skip to content
జాతీయం › వార్తలు

Election Commission Rift: ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు.. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సీనియర్‌ అధికారి గార్గ్‌పై ఫిర్యాదు..

jagan 23 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Election Commission Rift: ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు.. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సీనియర్‌ అధికారి గార్గ్‌పై ఫిర్యాదు..

Election Commission

Election Commission Rift: భారత ఎన్నికల సంఘంలో (ఈసీఐ) అంతర్గత విభేదాలు మరొకసారి తీవ్రస్థాయిలో రచ్చకెక్కాయి. కేంద్ర ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, డాక్టర్ వివేక్‌ జోషి.. ఆ సంఘంలోని సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మనీష్‌ గార్గ్‌ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి టీవీ సోమనాథన్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు. 2026 జులై 29న రాసిన ఈ సంచలన లేఖలకు సంబంధించిన వివరాలు, సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) దరఖాస్తు ద్వారా బయటకు వచ్చిన కేబినెట్ సచివాలయ అంతర్గత ఫైలు నోట్ల ఆధారంగా తాజాగా వెలుగులోకి వచ్చాయి.

ఎన్నికల సంఘంలో అత్యున్నత స్థాయిలో విధుల కేటాయింపు మార్పులపైనే ఈ ప్రధాన వివాదం రాజుకుంది. సీనియర్‌ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న మనీష్‌ గార్గ్‌, ఇతర ఉన్నతాధికారుల మధ్య విధుల పునర్విభజన చేస్తూ జులై 28న సంచలన ఉత్తర్వులు జారీ చేశారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై ఎన్నికల కమిషనర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేబినెట్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. కమిషనర్లతో కానీ, సంబంధిత విభాగాధిపతులతో కానీ ముందుగా ఎలాంటి చర్చలు జరపకుండానే తప్పుడు మార్గంలో ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. తనకు, తనతో పాటు సీనియర్ లేదా సమాన స్థాయి అధికారులకు కేటాయించిన పనుల బాధ్యతల్లోనూ మార్పులు చేశారని ఆయన తన లేఖలో వేలెత్తి చూపారు.

ఇదే అంశంపై మరో కమిషనర్ వివేక్ జోషి కూడా కేబినెట్ కార్యదర్శికి వేరుగా లేఖ రాస్తూ మనీష్ గార్గ్ తీరును తప్పుబట్టారు. విధుల సవరణ విషయంలో ఎన్నికల సంఘం నిర్ణయధికారాన్ని పక్కనబెట్టారని ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించి శాఖాపరమైన ఫైలును కోరినప్పటికీ, పరిపాలనా విభాగం తనకు ఆ ఫైలును సమర్పించలేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టమైన రాతపూర్వక ఆదేశాలు ఇచ్చినప్పటికీ మనీష్ గార్గ్ ఈ చర్యలకు దిగడం ‘ముఖ్య ఎన్నికల కమిషనర్ , ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టం, 2023’ నిబంధనలను ఉల్లంఘించడమేనని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ఇద్దరు కమిషనర్లు తమ ఫిర్యాదుల్లో కోరారు.

కమిషనర్ల నుంచి వచ్చిన లేఖలపై కేబినెట్‌ సెక్రటేరియట్‌ ఉన్నతాధికారులు లోతుగా చర్చించారు. అయితే ఇద్దరు కమిషనర్లు తమ వ్యక్తిగత హోదాలోనే ఈ లేఖలు రాశారని, ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా వచ్చిన ఉమ్మడి ఫిర్యాదుగా దీనిని పరిగణించలేమని కేబినెట్ సచివాలయం స్పష్టం చేసింది. ఈ దశలో ప్రభుత్వం కల్పించుకుని నేరుగా చర్యలు తీసుకుంటే, రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘం యొక్క స్వతంత్ర ప్రతిపత్తి, పరిపాలనా పనితీరులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్లవుతుందని భావించి ఎలాంటి ప్రత్యక్ష చర్యలు తీసుకోలేదు.

ఆగస్టు 5వ తేదీన కేబినెట్‌ కార్యదర్శి టీవీ సోమనాథన్‌ ఇద్దరు కమిషనర్ల నుంచి లేఖలు అందినట్లు ధ్రువీకరిస్తూ, ఆ లేఖల ప్రతులను సిబ్బంది, శిక్షణ రంగానికి (DoPT), ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీసర్‌కు , ప్రధాన ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి పంపించారు. భవిష్యత్తులో సదరు అధికారికి సంబంధించిన నియామకాలు, డెప్యుటేషన్ నిర్ణయాల్లో ఈ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. సెప్టెంబరు 24న మాజీ నౌకాదళ అధికారి, సామాజిక కార్యకర్త కమోడోర్‌ లోకేశ్‌ కె.బాత్రా దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుతో ఈ అంతర్గత వ్యవహారాలు బహిర్గతమయ్యాయి.