Skip to content
ఆంధ్రప్రదేశ్ › వార్తలు

YS Jagan Press Meet: ఏపీని రావణ కాష్ఠంగా మారుస్తున్నారంటూ చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం..

jagan 23 Oct 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
YS Jagan Press Meet: ఏపీని రావణ కాష్ఠంగా మారుస్తున్నారంటూ చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం..

YS Jagan Press Meet

YS Jagan Press Meet: ఆంధ్రప్రదేశ్‌ను రావణ కాష్ఠంగా మార్చే విధంగా ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు సర్కార్ అష్టకుట్రలకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుట్రలకు పితామహుడు చంద్రబాబేనని విమర్శించిన జగన్.. ప్రస్తుతం ఫోర్జరీ, మోసాలు, అధికార దుర్వినియోగం తారాస్థాయికి చేరాయని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) , ప్రభుత్వం సంయుక్తంగా ఈ కుట్రలకు తెరలేపాయని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అధికార కూటమి ప్రభుత్వం ఏకంగా ఎనిమిది రకాల కుట్రలకు పాల్పడుతోందని వైఎస్ జగన్ ఆరోపించారు. పోటీ చేయాలనుకునే విపక్ష అభ్యర్థులను పోలీసుల పేరుతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బెదిరించడం, బైండోవర్ చేయడం, ముందస్తు అరెస్టులకు పాల్పడడం వంటి చర్యలకు దిగుతున్నారని చెప్పారు. అభ్యర్థులకు సహకరించే పార్టీ నాయకులను గృహనిర్బంధం (హౌస్ అరెస్ట్) చేసి నామినేషన్లకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. నామినేషన్ కేంద్రాల వద్ద అధికార పార్టీ శ్రేణులను భారీగా మోహరించి ప్రతిపక్ష అభ్యర్థులను లోపలికి వెళ్లనీయకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కేంద్రాల ఎదుటే నామినేషన్‌ పత్రాలను లాక్కొని చింపేయడం, అధికారుల సమక్షంలోనే దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు.

అధికార పార్టీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నప్పటికీ పోలీసులు వాటిని అడ్డుకోకుండా, బాధితులైన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులనే నామినేషన్ కేంద్రాల నుంచి బయటకు పంపించేస్తున్నారని జగన్ విమర్శించారు. దాడులకు గురైన అభ్యర్థులు, వారికి సహకరించిన స్థానిక నాయకులపైనే తిరిగి అక్రమ కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. స్క్రూటినీ పేరుతో ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్లను అన్యాయంగా తిరస్కరించడం, అభ్యర్థుల సంతకాలను ఫోర్జరీ చేసి బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బెదిరింపులు, విపరీతమైన ఒత్తిళ్లతో అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకునేలా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ప్రజలకు తాము చేసిన మంచిని చూపించి, అభివృద్ధిని వివరించి ఓట్లు అడగాల్సిన చంద్రబాబు, ఎన్నికల్లో అసలు పోటీనే లేకుండా చేసేందుకు నీచమైన కుట్రలకు తెరలేపారని జగన్ ఎద్దేవా చేశారు. తమ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కోవిడ్‌ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను నిరంతరం అమలు చేసి, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఏకంగా 95 శాతం నెరవేర్చి ప్రజల ముందుకు వెళ్లామని గుర్తుచేశారు.

గత ఎన్నికల్లో తాము ప్రజలకు చేసిన పనుల ప్రోగ్రెస్‌ రిపోర్టు చూపించి ప్రజాక్షేత్రంలో నిలబడ్డామని చెప్పారు. నేడు ప్రభుత్వం ఇచ్చిన సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీల అమలు తీరుపై ప్రజలు చంద్రబాబును నిలదీస్తున్న పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోవడంతో, ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగనివ్వకుండా ప్రతి అడుగులోనూ అడ్డంకులు సృష్టిస్తున్నారని వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు.