Skip to content
జాతీయం › వార్తలు

ప్రజాస్వామ్యం- స్థానిక ప్రభుత్వాలు – ప్రజల భాగస్వామ్యం

Prajapaksham 24 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
ప్రజాస్వామ్యం- స్థానిక ప్రభుత్వాలు – ప్రజల భాగస్వామ్యం

Graduate MLC Elections: పట్టభద్రుల ఓటరు నమోదుపై మీకున్న సందేహాలివే.. ఈ విషయాలు తెలుసుకోండి!

తుంగా లక్ష్మీ నాారాయణ

ప్రజాస్వామ్యానికి అసలైన పరీక్ష అధికారంలో ఉన్నవారి ప్రవర్తనలోనే ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వేచ్ఛ, నిష్పక్షపాతం, పారదర్శకతలను కాపాడటం కేవలం రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత మాత్రమే కాదు, అది ప్రభుత్వానికి ఉన్న రాజ్యాంగపరమైన బాధ్యత కూడా. అధికారంలో ఉన్నవారికి ఇది ఒక కీలక పరీక్ష; ఎన్నికల ప్రక్రియలో అక్రమాలను అరికట్టడం, పరిపాలనా యంత్రాంగం తటస్థం గా పనిచేసేలా చూడటం, మరియు అన్ని రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు సమాన అవకాశాలను కల్పించడం ద్వారా వారు తమ నిబద్ధతను నిరూపించుకోవచ్చు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు నిర్వహించడం మాత్రమే కాదు; ప్రజలు తమ ప్రతినిధులను స్వేచ్ఛగా ఎన్నుకోగలిగే వాతావరణం ఉన్నప్పుడే అది నిజంగా
పరిఢవిల్లుతుంది.
ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పన, సమగ్ర అభివృద్ధి, స్థానిక ప్రభుత్వాల పాత్ర, పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలపై బహిరంగ ప్రజా చర్చను ప్రోత్సహించే పండుగ వాతావరణంలో ఎన్నికలు నిర్వహించ
బడాలి. స్వయంప్రతిపత్తి గల ఎన్నికల సంఘం దృఢంగా, నిశ్చయంగా నిలబడుతూ, ఒక పటిష్టమైన రాజ్యాంగ సంస్థగా పనిచేయాలి. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నాయకత్వం పరిణతితో వ్యవహరించి, పూర్తి సహకారాన్ని అందించాలి. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, జవాబుదారీగా జరిగిందనే ప్రజల భావనలోనే ఒక విజయవంతమైన ఎన్నికకు నిజమైన కొలమానం ఉంటుంది.
స్థానిక పాలనా సంస్థల ఎన్నికలు నేడు పదవుల అమ్మకం, రాజకీయ బేరసారాలు, ’ఓటు బ్యాంకు’ రాజకీయాల కోసం కులమత విభజనలను ప్రేరేపించడం, అలాగే ఆధిపత్యం కోసం హింస, ప్రతీకారం, విధ్వంసానికి పాల్పడటం వంటి దుష్ప్రవృత్తులకు పర్యాయపదాలుగా మారాయి. ఇటువంటి ధోరణులు సామాజిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. గ్రామీణాభివృద్ధి, పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక సమస్యల పరిష్కారం, పౌరుల క్రియాశీల భాగస్వామ్యం వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా ఎందుకు ఉండటం లేదు? ప్రజాస్వామ్యం అంటే కేవలం ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించి, కొందరు వ్యక్తులను అధికార పీఠాలపై కూర్చోబెట్టడం మాత్రమే కాదు. ప్రజలు తమ జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాత్మక ప్రక్రియల్లో నిరంతరం భాగస్వాములు అయినప్పుడు, ప్రభుత్వంలో ఉన్నవారిని జవాబుదారీగా నిలదీసినప్పుడు, తమ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి స్వరూపాన్ని తామే నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలను పరిశీలిస్తే, రాజ్యాంగం ఆశించిన ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు, క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులకు మధ్య చాలా పెద్ద అగాధం ఉన్నది.గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండే ప్రభుత్వ సంస్థలు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారు లు, డ్రైనేజీ వ్యవస్థలు, వీధి దీపాలు, వ్యర్థాల నిర్వహణ, పాఠశాల విద్య, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి నిత్య జీవితానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఈ స్థానిక పాలనా సంస్థలపైనే ఉంటుంది. అయితే, విధానపరమైన చర్చలకు వేదికలు గా ఉండాల్సిన ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, రాజకీయ పార్టీల మధ్య ఆధిపత్యం కోసం జరిగే అధికార పోరాటాలుగా మారిపోయాయి. ఇది కేవలం ఎన్నికల ప్రక్రియ లో ఉన్న లోపం మాత్రమే కాదు; స్థానిక ప్రజాస్వామ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభానికి స్పష్టమైన నిదర్శనం.
73,74వ రాజ్యాంగ సవరణల
ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?:
1992లో ప్రవేశపెట్టబడినఈ సవరణలు, జాతీయ, రాష్ట్ర స్థాయిలలోనే కాకుండా, గ్రామీణ – పట్టణ స్థాయిల లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో రూపొందించబడ్డాయి. 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీ రాజ్‌ సంస్థలకు, 74వ రాజ్యాంగ సవరణ పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధమైన హోదాను కల్పించి, వాటిని స్థానిక స్వపరిపాలన సంస్థలుగా ఏర్పాటు చేశా యి. 1993 నుండి అమలులోకి వచ్చిన ఈ సవరణల ప్రకారం, స్థానిక సంస్థలకు ప్రతి ఐదేళ్లకోసారి క్రమబద్ధంగా ఎన్నికలు జరిగేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘానిది. అంతేకాకుండా, ఆర్థిక వనరుల పంపిణీపై సిఫార్సులు చేయడానికి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 73వ సవరణ ద్వారా చేర్చబడిన పదకొండవ షెడ్యూల్‌లో గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన 29 అంశాలు ఉండగా, 74వ సవరణ ద్వారా చేర్చబడిన పన్నెండవ షెడ్యూల్‌లో పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన 18 అంశాలు ఉన్నాయి. ఈ అంశాలు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్యం మరియు పేదరిక నిర్మూలన వంటి వివిధ రంగాలను కలిగి ఉంటాయి. రాజ్యాంగంలోని 243(జి) మరియు 243(డబ్ల్యూ) అధికరణాల ప్రకారం, ఈ అంశాలకు సంబంధించి స్థానిక ప్రభుత్వాలకు అధికారాలను బదలాయించేందుకు రాష్ట్ర శాసనసభలు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.కేవలం ఈ రాజ్యాంగ సవరణలను చేయడం వల్ల మాత్రమే అధికారాలు, సిబ్బంది మరియు ఆర్థిక వనరులు స్థానిక ప్రభుత్వాలకు స్వయంచాలకంగా బదిలీ కావు.రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అధికారాలను బదలాయించాల్సి ఉంటుంది ఇదే అసలైన సవాలు. స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు లభించినప్పటికీ, అవి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగల సంస్థలుగా ఎదగడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కీలకమైనది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బాధ్యత ను చిత్త
శుద్ధితో నెరవేర్చకపోవడంతో, రాజ్యాంగ సవరణల వెనుక ఉన్న ఆశయాలు కాగితాలకే పరిమితమయ్యాయి.
ఎన్నికలు అనేవి ఈ ప్రక్రియలో ఒక భాగం మాత్రమే కానీ అసలైన అధికారం ఎక్కడ ఉంది? స్థానిక ప్రభుత్వాలు బలహీనంగా ఉండటానికి ప్రధాన కారణం అధికార వికేంద్రీకరణ లేకపోవడమే. సర్పంచులు, ఎంపిటిసి, జడ్‌పిటిసి సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్‌పర్సన్లు, మేయర్ల వంటి ఎన్నికైన ప్రతినిధులకు, తమ పరిధిలోని సమస్యలను పరిష్కరించడాని కి అవసరమైన అధికారాలు, నిధులు మరియు సిబ్బంది లేకపోతే, వారు సమర్థవంతంగా పనిచేయలేరు. రాజ్యాంగంలోని 73, 74వ సవరణల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని విధులను, నిధులను, సిబ్బందిని స్థానిక సంస్థలకు బదిలీ చేయాలి. ప్రస్తుత ప్రభుత్వా లు స్థానిక స్వపరిపాలనను ఎంతవరకు బలోపేతం చేశాయో పౌరులు నిరంతరం పర్యవేక్షించాలి.
గ్రామ సభ
‘గ్రామ సభ’ స్థానిక ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉంటుంది; ఒక గ్రామంలోని ఓటర్లందరూ ఇందులో భాగస్వాములుగా ఉంటారు. గ్రామసభ ద్వారా పౌరులు తమ గ్రామానికి అవసరమైన అంశాలను గుర్తించవచ్చు, అభివృద్ధి ప్రాధాన్యతలను నిర్ణయించవచ్చు, పథకాల అమలును పర్యవేక్షించవచ్చు మరియు స్థానిక ప్రతినిధులను జవాబుదారీగా ఉంచవచ్చు. అదేవిధంగా, పట్టణ ప్రాంతాల్లో కూడా వార్డు స్థాయిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా స్థానిక పాలనను బలోపేతం చేయాలి స్థానిక అవసరాలను గుర్తించడం, బడ్జెట్‌ ప్రాధాన్యతలపై చర్చించడం వంటివి ఉంటాయి. అయితే, వాస్తవానికి స్థానిక పరిపాలనలో ప్రజలకు ఎటువంటి ప్రత్యక్ష పాత్ర లేదు. ప్రజల భాగస్వామ్యం లేని స్థానిక పాలనను నిజమైన స్వపరిపాలన గా పరిగణించలేము. పంచాయతీలు మరియు మున్సిపాలిటీలు తమ పరిధిలోని సేవలను నిర్వహించడానికి తగిన ఆదాయ వనరులను కలిగి ఉండాలి. స్థానిక పన్నులు, రుసుములు, రాష్ట్ర ప్రభుత్వం నుండి బదిలీ చేయబడిన నిధులు, కేంద్ర ఆర్థిక సంఘం అందించే గ్రాంట్లు, ఇతర ఆదాయ వనరుల మధ్య సరైన సమతుల్యత ఉండాలి.
మౌలిక సదుపాయాలు ప్రధాన
అజెండాగా మారాలి?
గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ సవాళ్లను ఒక స్థానిక ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా పరిష్కరిస్తుందనే దానిలోనే ఆ ప్రభుత్వ పనితీరుకు నిజమైన కొలమానం ఉంటుంది. సురక్షితమైన తాగునీటి లభ్యత, చక్కగా నిర్వహించబడే రహదారులు, పారిశుధ్యం, మురుగునీటి వ్యవస్థలు, దోమల నియంత్ర ణ, వర్షపు నీటి పారుదల, వరద నివారణ, సాగునీటి కాలువలపై ఆక్రమణల తొలగింపు, వీధి దీపాలు, పాఠశాలలు, ఆరోగ్య సంరక్షణ సేవలు, పట్టణ ప్రాంతాల్లోని పబ్లిక్‌ పార్కులు, పేదల కోసం మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, విద్యుత్‌ శ్మశానవాటికలు వంటివి కీలక ప్రాధాన్యతలలో ఉన్నాయి. ఈ అంశాలను తమ ఎన్నికల అజెండాలు మరియు ప్రచారాలలో చేర్చడం ద్వారా, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అభివృద్ధిపై కేంద్రీకృతమైన ప్రజా చర్చను ప్రోత్సహించగలరు. ప్రతి స్థానిక సంస్థ తన అధికార పరిధిలోని నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ఒక పంచవర్ష అభివృద్ధి ప్రణాళికను రూపొందించుకోవాలి, ఇందులో తక్షణ అవసరాలు, మధ్యకాలిక ప్రాధాన్యతలు, దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాల మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపాలి. పెరుగుతున్న పట్టణీకరణ, జనాభా పెరుగుదల, కొత్త నివాస ప్రాంతాల ఆవిర్భావంతో, స్థానిక ప్రభుత్వాల బాధ్యతలు విస్తరిస్తున్నాయి; ఈ పట్టణ విస్తరణకు అనుగుణం గా అభివృద్ధి కూడా సాగాలి. నిర్ణయ ప్రక్రియలో స్థానిక సంస్థలు బలమైన భాగస్వాములుగా వ్యవహరించేందుకు సాధికారత కల్పించకపోతే, సమగ్ర పట్టణాభివృద్ధిని సాధించడం కష్టం. అభ్యర్థులు కేవలం రాజకీయ ఆధిప త్యం కోసం కాకుండా, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాల ఆధారంగా ఎన్నికలలో పోటీ చేయాలి.