Skip to content
జాతీయం › వార్తలు

India-China Border Tensions: చైనా ఉల్లంఘనలతోనే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు..స్పష్టం చేసిన కేంద్ర విదేశాంగ శాఖ..

jagan 24 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
India-China Border Tensions: చైనా ఉల్లంఘనలతోనే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు..స్పష్టం చేసిన కేంద్ర విదేశాంగ శాఖ..

India-China Border Tensions

India-China Border Tensions: భారత్-చైనా సరిహద్దుల్లో (LAC) పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) సైన్యం నిర్దేశిత గస్తీ విధానాలకు భిన్నంగా వ్యవహరించినప్పుడల్లా పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారుతున్నాయని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో చైనా సైనికులతో ముఖాముఖి (Face-off) పరిస్థితులు కొనసాగుతున్నాయని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) డైరెక్టర్ జనరల్ శత్రుజీత్ కపూర్ సంచలన ప్రకటన చేసిన మరుసటి రోజే విదేశాంగ శాఖ ఈ మేరకు స్పందించింది.

ఐటీబీపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వ్యూహాత్మకంగా స్పందించారు. భద్రతా దళాల మోహరింపునకు సంబంధించిన నిర్దిష్ట వివరాల కోసం రక్షణ మంత్రిత్వ శాఖను సంప్రదించాలని సూచించారు. అయితే, చైనా బలగాలు పరస్పర అంగీకారం ఉన్న గస్తీ నిబంధనలను ఉల్లంఘించిన ప్రతీసారి సరిహద్దు వాతావరణం దెబ్బతింటోందని, గతంలోనూ భారత్ ఇదే విషయాన్ని స్పష్టంగా తెలిపిందని ఆయన గుర్తుచేశారు.

వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి ఎలాంటి అపోహలు, తప్పుడు అంచనాలకు తావులేకుండా ఉండేందుకు భారత్ , చైనాలు నిరంతరం దౌత్య, సైనిక మార్గాల్లో చర్చలు జరుపుతున్నాయని రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. సరిహద్దు నిర్వహణను మరింత పటిష్ఠం చేసేందుకు , కొన్ని వివాదాస్పద ప్రాంతాల్లో ఎల్‌ఏసీపై పరస్పర స్పష్టత పెంచుకునే అంశంపైనా చర్చించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని చెప్పారు. సరిహద్దుల్లో పూర్తిస్థాయి శాంతి, ప్రశాంతత నెలకొనడం అనేది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సాధారణీకరణకు అత్యంత కీలకమని పునరుద్ఘాటించారు.

రాజస్థాన్‌లోని ఐటీబీపీ ప్రాంగణంలో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో డీజీ శత్రుజీత్ కపూర్ మాట్లాడారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో చైనా సైన్యంతో మన బలగాలకు ముఖాముఖి పరిస్థితులు ఏర్పడ్డాయని, అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో ఐటీబీపీ నూతనంగా రూపకల్పన చేసిన ‘శౌర్య’ కమాండోలు తమ ప్రతిభను చాటుకున్నారని తెలిపారు. దేశ రక్షణలో చైనా సరిహద్దు తమ దళానికి అత్యంత సవాలుతో కూడుకున్న ప్రాంతమని అభివర్ణించారు.

చైనా సైనిక ఆధునికీకరణను ప్రస్తావించిన కపూర్, కేవలం సంప్రదాయ యుద్ధ పద్ధతుల్లో చైనాతో పోటీపడటం కష్టమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలపై భారత్ మరింత భారీగా దృష్టి సారించాలని సూచించారు. డ్రోన్ సాంకేతికత రాకతో సరిహద్దుల్లో సంప్రదాయ దళాల పాత్ర గణనీయంగా మారిందని పేర్కొన్నారు. అయితే, ఆయన ఏ నిర్దిష్ట సరిహద్దు ఘర్షణను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని, సాధారణ సన్నద్ధత సందర్భంలోనే మాట్లాడారని అధికార వర్గాలు వివరణ ఇచ్చాయి.

భారత్-చైనా మధ్య దాదాపు 3,488 కిలోమీటర్ల మేర విస్తరించిన వాస్తవాధీన రేఖ ఉంది. 2020 జూన్‌లో గల్వాన్ లోయలో చోటుచేసుకున్ ప్రతీకార ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులైన నాటి నుంచి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఎల్‌ఏసీ వద్ద పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి ఇటీవల ప్రకటించగా, సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరణ జరిగితేనే చైనాతో మిగతా సంబంధాలు సాధారణ స్థితికి వస్తాయని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు.