Hyderabad Bus Pass: గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త.. రూ.600లకే ఏడు రోజుల ‘వీక్లీ బస్ పాస్’ అందుబాటులోకి..
RTC Bus Charges: వినాయక చవితి వేళ సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికులకు ఆర్టీసీ అదనపు చార్జీల వడ్డెన..
Hyderabad Bus Pass: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నగర ప్రయాణికులకు మరింత మెరుగైన, అందుబాటు ధరలో ప్రజా రవాణా సేవలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. సీయూఆర్ఈ (CURE) పరిధిలో ప్రతిరోజూ ప్రయాణించే వారి సౌకర్యార్థం రూ.600 ధరతో నూతనంగా ‘వీక్లీ బస్ పాస్’ (Weekly Bus Pass) విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఈ పాస్ ద్వారా కొనుగోలు చేసిన రోజు నుంచి ఏడు రోజుల పాటు నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిరభ్యంతరంగా ప్రయాణించే వెసులుబాటును ఆర్టీసీ కల్పించింది. శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ‘పుష్పక్ ఏసీ ఎయిర్పోర్ట్ లైనర్’ బస్సుల్లో మాత్రం ఈ వీక్లీ పాస్ చెల్లుబాటు కాదని అధికారులు స్పష్టం చేశారు. అయితే మెట్రో లగ్జరీ ఏసీ, మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్ , ఆర్డినరీ సిటీ బస్సుల్లో ఈ పాస్‌తో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆర్టీసీకి చెందిన అన్ని ప్రధాన బస్‌పాస్ కౌంటర్లలో ఈ వీక్లీ పాస్‌లు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది.
ప్రస్తుతం హైదరాబాద్ నగరవ్యాప్తంగా ప్రతిరోజూ 25 లక్షల మందికి పైగా ప్రయాణికులు సిటీ బస్సుల్లో తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని పొందుతున్న సుమారు 18 లక్షల మంది మహిళా ప్రయాణికులను మినహాయిస్తే, మిగిలిన 7 లక్షల మంది పురుష ప్రయాణికులు , ఇతర వినియోగదారులు ఈ వీక్లీ పాస్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే అందుబాటులో ఉన్న డెయిలీ (రోజువారీ) , మంత్లీ (నెలవారీ) పాస్‌లకు అదనపు సదుపాయంగా దీనిని తీసుకువచ్చారు. నగరంలో వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి, ప్రజా రవాణా వ్యవస్థ వాడకాన్ని ప్రోత్సహించడంతో పాటు ప్రయాణికులకు ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశమని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (MD) వై.నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ నూతన వీక్లీ పాస్ సదుపాయాన్ని ప్రయాణికులందరూ విస్తృతంగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.