Fine Rice Supply Scam: ఎఫ్‌సీఐ బియ్యం సరఫరాలో భారీ అక్రమాలు: 14 మంది రైస్ మిల్లర్లను అరెస్ట్ చేసిన తెలంగాణ సీఐడీ..
Rice
Fine Rice Supply Scam: తెలంగాణలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు బియ్యం సరఫరా చేసే ప్రక్రియలో భారీ అక్రమాలకు పాల్పడిన 14 మంది రైస్ మిల్లర్లను రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. 2025–26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎఫ్‌సీఐకి ‘సన్న రకం’ బియ్యాన్ని సరఫరా చేయాల్సి ఉండగా, వాటి స్థానంలో నాసిరకం ‘దొడ్డు బియ్యాన్ని’ అందజేసినట్లు వీరిపై తీవ్ర అభియోగాలు నమోదయ్యాయి.
ఈ కుంభకోణంపై పౌరసరఫరాల సంస్థ జనరల్ మేనేజర్ (ప్రొక్యూర్మెంట్) అక్టోబర్ 24న ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు సీఐడీ ప్రత్యేక విభాగం రంగంలోకి దిగి లోతైన దర్యాప్తు చేపట్టింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మిల్లింగ్ కోసం కేటాయించిన నాణ్యమైన సన్న రకం ధాన్యాన్ని మిల్లర్లు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించుకున్నారని అధికారులు గుర్తించారు. ఆ తర్వాత సన్న బియ్యం స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇతర పొరుగు రాష్ట్రాల నుంచి అత్యంత తక్కువ ధరకు సేకరించిన దొడ్డు బియ్యాన్ని ఎఫ్‌సీఐ గోదాములకు సీఎంఆర్ (Custom Milling Rice) కింద అప్పగించినట్లు విచారణలో వెల్లడైంది. అధికారులు సేకరించిన బియ్యం నమూనాలను ప్రయోగశాలలో పరీక్షించగా, అవి నిర్దేశిత సన్న రకం బియ్యం కాదని శాస్త్రీయంగా నిర్ధారణ అయ్యింది.
3,385 టన్నుల బియ్యం మళ్లింపు – రూ.242 కోట్ల నష్టం నివారింపు
ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ , ములుగు జిల్లాల్లోని 16 రైస్ మిల్లుల నిర్వాహకులు సన్న బియ్యానికి బదులుగా సుమారు 3,385 టన్నుల దొడ్డు బియ్యాన్ని సరఫరా చేసినట్లు సీఐడీ ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దొడ్డు బియ్యం మళ్లింపు చర్యల వల్ల ప్రభుత్వానికి కేవలం బోనస్ రూపంలోనే సుమారు రూ.1.69 కోట్ల మేర ప్రత్యక్ష నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. అయితే, పౌరసరఫరాల శాఖ అధికారులు సకాలంలో అప్రమత్తమై అక్రమంగా వచ్చిన బియ్యం సేకరణను తక్షణమే నిలిపివేయడంతో, ప్రభుత్వానికి జరగాల్సిన దాదాపు రూ.242 కోట్ల మేర సంచలన ఆర్థిక నష్టాన్ని ముందే నివారించగలిగారు.
ఈ అక్రమాల ఉదంతంపై సీఐడీ పోలీసులు ఇప్పటికే మూడు వేర్వేరు క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు. రైస్ మిల్లర్లపై బియ్యం మళ్లింపు, కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఒప్పంద నిబంధనల ఉల్లంఘన, మోసం , క్రిమినల్ కుట్ర వంటి కఠినమైన సెక్షన్ల కింద విచారణ జరుపుతున్నారు. ఈ భారీ బియ్యం కుంభకోణంలో మిల్లర్లతో పాటు పౌరసరఫరాల శాఖ లేదా ఎఫ్‌సీఐకి చెందిన ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఏదైనా ఉందా అనే కోణంలోనూ సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు.